Tuesday, 19 October 2021
// నీ కోసం 404 //
సాయింత్రం ఎప్పుడయ్యిందో తెలీనే లేదు
ఎప్పట్నుంచో ఈ వాన
ఆగకుండా దూకినట్టు అనిపిస్తుంటే
మట్టివాసన కనుమరుగైనా
మొక్కల పచ్చివాసన మాత్రం
దేహాన్ని దాటి మనసుని చుట్టేస్తూ ఉంది
ఇన్నాళ్ళూ దాహమని తపించిన అంతరాత్మ
పువ్వుల సుకుమారానికి మెత్తబడ్డ పెదవులపై
ఈ సహజ పరిమళపు అనుభూతికి సాక్షిగా
వచ్చీరాని రికామీ పాటలు పాడుతుందంటే
ఏదో ఇష్టం ధ్వనించి
ఆలాపనలోని అందాన్ని పెంచినట్టుంది
పక్షుల కువకువల చిలిపిదనం
వెచ్చని గూళ్ళకే పరిమితమైన వేళ
ముంగిట్లో మురిపెం.. ఎన్ని కాలాలు దాటి
సందిలికొచ్చిందో ఎవరు నిర్వచించగలరు
అవును..
నాకూ కొంచెం రాయడం తెలిస్తే బాగుండనిపిస్తుంది
నేను తడిచిన ఊహను సంతకం చేసేందుకైనా
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment