Tuesday, 19 October 2021
// నీ కోసం 397 //
ఈ సాయింత్రాలు చాలా బాగున్నాయి
మదిలో వెలుగు ఆకాశమంతా పరుచుకున్నట్టు
వేల దీపాలు నవ్వుతున్న నిముషాలివి
నిశ్శబ్దంగా కురుస్తున్న
విరజాజుల మాటు పరిమళం
నా లిపిలో నీ ప్రేమాత్మ ప్రవహించి
ఆద్యంతాలను కలుపుతున్నట్టుంది
నాకేదో అయిందని అనుకోకు
ఈ పసిమిఛాయ కాసేపటికి చీకటైపోవచ్చు
వెన్నెల తాకిడి ఒంటరిగా నువ్వు భరించలేవు
పువ్వులు రంగు మార్చుకునేలోపు రా..
ఏవీ నీ ఆనందాలు...
ఆ చిన్ని చిన్ని ఆశలన్నీ తీర్చాలని ఉంది
నీకిష్టమైన సినిమా చూసొద్దాం పద
లేదా
కనీసం కాసేపు కమ్మని కబురులైనా చెప్పుకుందాం
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment