Tuesday, 19 October 2021
// నీ కోసం 391 //
మధ్యాహ్నం నుంచీ ముసురుపట్టే ఉంది ఆకాశం
నా చుట్టూ కనిపిస్తూ, కనుమరుగవుతూ పరితపిస్తున్న నిన్నూహిస్తూ
ఇప్పటికో అరవైసార్లు తీసి.. చదివుంటా నీ ప్రేమఉత్తరం
నాకసలు నిలకడ లేదంటూ
ముద్దుచేస్తూ నువ్వనే మాటలు
స్వగతంలో నన్నలరిస్తున్న నాదాలైనా
ఒక్కసారిగా వెండిమబ్బులు రంగుమారే దృశ్యంలో
నా జ్ఞాపకాలదంతా నిర్వేదరాగమవుతుంది తెలుసుగా..
ఆగమ్యగోచరాల వలయంలో
బలంగా వీస్తున్న గాలులకి కన్నులు మూసుకున్నానా
నువ్వన్నది నిజమే..
ఆకాశం ఉరిమినా కురిసినా ప్రయాసపడేదేముందని
ఈ నల్లని అమాసరాత్రి, ఎర్రగా మారి
మెరుపులన్నీ నీ రూపుకట్టి నాలో వెలుగు నింపుతున్నట్టు
కొత్త సౌందర్యాన్ని చిందిస్తుంటే
ఆస్వాదించడం మాని వెక్కిళ్ళెందుకు కదా
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment