Tuesday, 19 October 2021

// నీ కోసం 405 //

ప్చ్.. కాస్త వెన్నెలకే కుదురుకొనే హృదయానికేమైందో తెలీక చుక్కలు.. దిక్కులు చూస్తూ గుసగుసలు మొదలెట్టాయి ఎక్కడో జారినట్టున్న మది అనంతమైన పెనుగులాటతో కలత పడుతోంది నా నుంచీ నన్ను దూరం చేసిన మాయగా.. మౌనంలో పెను ఆర్తనాదమై వినబడుతూ కొత్తగా.. నిశ్చలమైన నిశ్శబ్దానికీ భయపడుతోంది సోమరిగా కదులుతున్న రాత్రి నాలో నవ్వులు పూయించలేనని వెనుదిరిగింది పలకరించాలనొచ్చిన పూలగాలి వివశత్వామేదీ నాలో లేదని విసుక్కుంటూ పోయింది నిన్ను ఆహ్వానించి ఖాళీ అయినందుకేమో సగం నిద్దురలో ఊపిరికోసమీ పెనుగులాట కలలోనూ కలవలేకపోయిన బెంగ అదేమో విషాదానికి కొనసాగింపులా ఈ తొణికిసలాట ఏమీ రాయాలేనిక ఈ పూట నీ వేలికొస అయినా నాకు తగలకపోయాక

// నీ కోసం 404 //

సాయింత్రం ఎప్పుడయ్యిందో తెలీనే లేదు ఎప్పట్నుంచో ఈ వాన ఆగకుండా దూకినట్టు అనిపిస్తుంటే మట్టివాసన కనుమరుగైనా మొక్కల పచ్చివాసన మాత్రం దేహాన్ని దాటి మనసుని చుట్టేస్తూ ఉంది ఇన్నాళ్ళూ దాహమని తపించిన అంతరాత్మ పువ్వుల సుకుమారానికి మెత్తబడ్డ పెదవులపై ఈ సహజ పరిమళపు అనుభూతికి సాక్షిగా వచ్చీరాని రికామీ పాటలు పాడుతుందంటే ఏదో ఇష్టం ధ్వనించి ఆలాపనలోని అందాన్ని పెంచినట్టుంది పక్షుల కువకువల చిలిపిదనం వెచ్చని గూళ్ళకే పరిమితమైన వేళ ముంగిట్లో మురిపెం.. ఎన్ని కాలాలు దాటి సందిలికొచ్చిందో ఎవరు నిర్వచించగలరు అవును.. నాకూ కొంచెం రాయడం తెలిస్తే బాగుండనిపిస్తుంది నేను తడిచిన ఊహను సంతకం చేసేందుకైనా

// నీ కోసం 403 //

ఓయ్.. చందమామకి వరసవుతావని ఎందుకు చెప్పలేదు నీ గుండెల్లో పాటలన్నీ నా పెదవులపై పరిచేసి నెలలో పక్షం బాగుంటే మరో పక్షం గిల్లికజ్జాలాడుతూ వల్లంకి పిట్టలా వగలున్న నాతో రేయీపగలూ నీ సయ్యటలా.. ఒక్క పిలుపుతోనే ప్రాణం పోసుకుంటానని తెలిసి పదేపదే నా తలపు తట్టే నీ మనసుకి మర్యాద నేర్పకుండా తీరంలా కాచుకుని నువ్వుంటూ కూడా కసి కెరటంలా ఉప్పొంగేది నేనేనంటావా.. వియోగాల విందులో రుచికరమైనవి మది జ్ఞాపకాలేనని తెలిసేలా ఇంకా రాయని కవనంలో నీ ఊసులనూ, నిత్యవసంతంలాంటి నా ఊహలనూ కూస్తూ కోయిల నేనయ్యా చూసావా పచ్చిపాల నురగలాంటి నవ్వులు పూసుకుని నిశ్శబ్దపు ఉయ్యాలలూగుతూ ఎందుకలా కవ్విస్తావో నీ కనుపాపలతో ఆడుకునేందుకు పిలిచినప్పుడు చెప్తా చీకటి రంగేసుకొచ్చిన చిమటలా నేనూ భయపెడతా

// నీ కోసం 402 //

ఇదిగో రాస్తున్నా.. కాలమేదైనా భాషకి అందని సుందర కావ్యాన్ని మాటలకందని భావాన్ని నీ గుండెలపై నన్ను వాల్చుకుని నువ్విచ్చిన అనుభూతిని.. నన్నోదార్చాలని నువ్వు చూసినప్పుడే గాయం గమ్మున పరుగెత్తిపోయింది నావెంటున్నావనే చలించే చిరుగాలీ ఉక్కిరిబిక్కిరై నిలబడిపోయింది ఆకాశమే హద్దయ్యేలా నీ అనురాగానికే మన అడుగుల మధ్య దూరమూ చెరిగిపోయింది అవును.. ఇప్పుడు అలసిపోయిన ఆవేదన నీ సమక్షంలో ఆలాపనైంది శూన్యమైన ఎదలో సంగీతమొచ్చి చేరింది

// నీ కోసం 401 //

కొన్ని నిరీక్షణల దూరాన్ని చెరిపే దృశ్యకావ్యాలు ఎప్పటికీ పదిలంగానే ఉంటాయి. ఇన్ని యుగాలుగా నా గుండెకు రెక్కలుకట్టి హరివిల్లుదాకా తీసుకుపోతుంది నువ్వే కదా. ఇంకెంతసేపు ఆగమంటావు చెప్పు. నిజంగా చినుకు చినుకుకీ మధ్య దారిచూసుకుంటూ నువ్వొస్తావనే నేనెదురు చూస్తున్నా. నువ్వనే మాటలు అబద్ధం కావని, నా మనసుని చక్కబెట్టేందుకు ఖాళీ లేకపోయినా, నడవలేకపోయినా, నీడగానైనా అనుసరిస్తావని నమ్ముతున్నా. ఏకాంతంలో ఈ వెన్నెలరాత్రులు పెడుతున్న చక్కిలిగింతలు బుగ్గలనిండా నవ్వులు పూయిస్తున్నదెలానో నువ్వు చూడాలి ఒక్కసారయినా. నీ ఉనికి నా కనురెప్పల కావిళ్ళ మీదనో, తప్పిపోయిన నిర్మోహపు నవ్వులోనో, అలసిపోయిన హృదయపు తపస్సులోనో, స్మరిస్తూ ఎండిపోయిన గొంతులోనో, దేహమంతా కలదిరిగే రుధిరంలోనూ, తడబడే అడుగుల వెనుకనో ఉండే తీరుతుంది. అయినాసరే.. నన్ను నేను కోల్పోయిన అస్తిమత్వపు జాడ కోసం నీ కౌగిలిలో ఓదార్పు తప్ప విశాలమైన ఆకాశమేదీ నే కోరనని తెలుసుగా. కొన్ని అవాంతరాలకు చలించకుండా నన్ను సమ్మోహనం చేసేందుకు నువ్వేదోలా వస్తావని స్వాగతించేందుకు నిలిచున్నా

// నీ కోసం 400 //

మదిలోని వెలితి మధురమయ్యేందుకేమో పగలంతా నన్నొంటరిని చేసిన బదులుగా.. అందమైన నీ ఆకాంక్షలన్నీ మాలగుచ్చి మరీ రాత్రి కల్లోకొచ్చి కబుర్లుగా చెప్తావ్ నిశ్శబ్దరాగానికి చినుకు ముత్యాలెన్ని కలిసాయో చెప్పలేని మాటలన్నీ వానపాటలై వినబడి.. నీ చిరునవ్వుల ధారాపాతంలో నే తడిచినట్టు కనుపాపల్లో మెరుపులవుతాయ్ నువ్వున్నావే.. వివశాన్ని పొందికగా దోబూచులాడాలనేమో సరాగాలు సంపెంగి వాసనయ్యేలా.. వలపుని కలబోసి.. హృదయంలో చోటిచ్చి అసలెందుకు అలిగానో మర్చిపోయేలా చేస్తావ్

// నీ కోసం 399 //

నీ చూపుల్లో వెలిగిన దీపాలు ఏ గాలివాటానికి కొండెక్కుతాయో తెలీదు. చీకట్లో నేనే నువ్వంటూ నీ పెదవులు అద్దిన చోటునల్లా తడుముకునేలోపే తెల్లారిపోతుంది మౌనంగా పరిమళిస్తున్న పువ్వు భావనేదో మెత్తగా నాలోనూ మొదలవుతుంది నీ అరచేతులకంటిన నా సిగ్గు రంగు ఎదలో ఇన్నాళ్ళ తాపాన్ని తగ్గించిందో లేదో చూసుకో లేదంటే.. నెలవంకలూ, నీలిగంటలూ, నేపధ్యమేదో తెలీని నిశ్శబ్ద కవితలవుతాయి నీ కుంచెలో !!

// నీ కోసం 398 //

అమలిన బంధమై నాలో వెలిగే వెన్నెల నీ సమస్తాన్ని నాలో నింపుకున్న మౌనం కలలకు వేళయ్యింది రమ్మని పిలుస్తుంది చూడు.. నీకు ప్రేమను పంచేందుకు ఇప్పుడీ అనుభూతి సాంత్వనవుతుంది కొంతకాలం 'కాలం' ఆగిపోతుంది అప్పుడు నువ్వో విశ్వమై నన్ను చేరదీస్తావు

// నీ కోసం 397 //

ఈ సాయింత్రాలు చాలా బాగున్నాయి మదిలో వెలుగు ఆకాశమంతా పరుచుకున్నట్టు వేల దీపాలు నవ్వుతున్న నిముషాలివి నిశ్శబ్దంగా కురుస్తున్న విరజాజుల మాటు పరిమళం నా లిపిలో నీ ప్రేమాత్మ ప్రవహించి ఆద్యంతాలను కలుపుతున్నట్టుంది నాకేదో అయిందని అనుకోకు ఈ పసిమిఛాయ కాసేపటికి చీకటైపోవచ్చు వెన్నెల తాకిడి ఒంటరిగా నువ్వు భరించలేవు పువ్వులు రంగు మార్చుకునేలోపు రా.. ఏవీ నీ ఆనందాలు... ఆ చిన్ని చిన్ని ఆశలన్నీ తీర్చాలని ఉంది నీకిష్టమైన సినిమా చూసొద్దాం పద లేదా కనీసం కాసేపు కమ్మని కబురులైనా చెప్పుకుందాం

// నీ కోసం 396 //

నా నిరీక్షణలోని ఓ దీర్ఘశ్వాస ఊహకవతలి అక్షరాలను వెతుక్కుంటూ కాలాన్ని ఏమార్చిన సంగతి చీకటయ్యేదాకా తెలుసుకోలేకపోయింది రవ్వంత నవ్వు చిగురించిన ఈ క్షణాల తాకిడి అవధులు మరచిన అలల గలగలలా నులివెచ్చని అనుభూతిలో మునకలేయించింది ఎటు చూసినా వర్షం రాలిన చినుకులన్నిటినీ మార్చి మార్చి ఏవైపు నుండీ చూసినా నీ పదాలు చిత్తడి చేస్తున్నట్టే ఉంది మరి

// నీ కోసం 395 //

మనస్వీ... ఎలా ఉన్నావు, ఎక్కడికెళ్తే అక్కడ స్థిరపడిపోయి నన్ను మర్చిపోడమేనా ?! ఎప్పుడు చూడు, కాలంతో పోటీ పడినట్లే పరుగులు పెడుతుంటావు. ఎక్కడున్నావో తెలుసుకోలేక నాలో నేను గింజుకుంటాను. తెల్లారి లేచింది మొదలు, ఇల్లూడ్చే చీపిరి నుంచి చిగురించే చెట్లదాకా నీ కబుర్లే చెప్తుంటాను. ఈ ఆకాశం విశాలంగా ఉండబట్టి నా మనసుని ఏమంత కసురుకోకుండా ఆలకిస్తుంది. తెలుసా, అయినా సరే, ఏపూట కాపూట నువ్వేం చేస్తుంటావోనని తోచినట్టు ఊహించుకుంటాను. నా నవ్వులన్నీ నీ పేర రాసుంచా కాబట్టి నువ్వు నన్ను తలచినప్పుడల్లా ఆహ్లాదంగానే అనిపిస్తా. నిన్ను పాడి పాడి అలసిపోయిన నా పెదవుల బెంగ నీకు తెలీదు కదా. నీ తలపుల్లో సోలిపోయే కళ్ళలోని కన్నీరు నిన్నింకా తపించేట్టు చేస్తుందంటే నమ్ముతావుగా. నా చుట్టూ ఉన్న అందరూ చాలా బాగున్నట్టే అనిపిస్తున్నారు. పండుగ పనులన్నీ శ్రద్ధగా చేసుకుంటూ భక్తిగా ఉన్నారు. సగం అమ్మానాన్న లేనితనం, ఇంకో సగం, నీకు చేరువకాలేని తనం.. వెరసి నాదెప్పుడూ ఏకాకితనమే. బెంగగా ఉందని కాసేపు డాబా మీదకి రాగానే మెల్లిగా గాలొచ్చి ఆత్మీయంగా హత్తుకుంటుంది. ఆ సంగతలా ఉంచితే, మసకపొద్దు మొదలయ్యే సమయం నుంచీ చిమ్మచీకట్లోనూ నా కళ్ళకు ఒకే నక్షత్రం కనిపిస్తుంది. అందుకే దానికి నీ పేరు పెట్టుకుని పలకరిస్తున్నాను. అప్పుడప్పుడూ, మనోవీధిలో నీతో దాగుడుమూతలాడుతున్నట్టు మభ్యపడుతున్నాను.. కొండాకోనల్లో దారితప్పిన అలలా అయినా కలలోకైనా రావేమని అడగాలనుకుంటానా... గొంతులో ఆగిన భాష్పాలు గుండుసూదులై గుచ్చుతున్నందుకేమో సరిగా నిద్రయినా రాదు. అందుకే నిన్నూ ఏమీ అనలేక ఓర్పుగా ఇలా ఉంటున్నా

// నీ కోసం 394 //

నీ మౌనం నన్నో అనిశ్చిత తరంగంలా దిక్కుతోచని ఉక్కిరిబిక్కిరిలో ముంచుతుంది ఆకాశంలో నక్షత్రాలు కలలు దోచుకుపోతున్న కారణంలా పదాలు చెదురుమదురై ఎగిరిపోతున్నట్టుంది గుండెలో గాయం మెత్తని పువ్వుల గుసగుసలా ఏకాంతాన్ని వెచ్చగా వణికిస్తుంది Huhh.. దూరాల బెంగ నిర్వచించేదేముంది ఏమీ పట్టనట్టు అంతర్ధానమవుతున్న కాలం నీ తలపుల్లో వాలిపోయేంత చోటెందుకిస్తుందో అర్ధంకాక ఛస్తుంటే

// నీ కోసం 393 //

రెండు ఆత్మల మధ్య మోగుతున్న మువ్వలచప్పుడు పురాతన బంధానిది అనుకుంటే ఏమీ చెప్పక్కర్లేని మాటలు మౌనరహస్యాలు దిగులుపడ్డ మసక వెన్నెల రాత్రి అకస్మాత్తుగా అద్భుతమనిపిస్తే మెలకువలాంటి కలలోకి నువ్వొచ్చిన ఆనవాళ్ళు కావాలంటే నీ మదిలోకి తొంగి చూసుకో.. నీలో సుగుణాలు అనంత సాగరకెరటాలు పదేపదే సంగమించేందుకు రమ్మని పిలిచే తుంటరి సైగలు కదా.. కిన్నెరవీణలా నా మేను కిలికించితమవడం నీ స్వప్నమైతే కళ్యాణిలా కదం తొక్కుతూ నే రాగమవుతానన్నది వాస్తవం నిలువరించలేని నిత్యవసంతాన్ని చిలకరించడం నీకిష్టమైతే అందులో తడిచి మోహాన్ని పరిమళించడం నాకు పరవశం

// నీ కోసం 392 //

నువ్వూ నేనూ ఎన్నోసార్లు ఒకరి నుంచి ఒకరు తప్పుకుని దేహాలకతీతంగా సాగిపోయాం నిరంతర మోహంలో రగిలిపోయినప్పుడంతా చలిరాతిరిని పట్టుతప్పించి నులివెచ్చని అవ్యక్తానుభూతులూ పంచుకున్నాం చీకటికి చెమట పుట్టించి చినుకు రాలేంత ఆనందాన్ని చెంగల్వపువ్వుల స్పర్శతో సరిపోల్చి చిన్ని చిన్ని మాటలకి మూగబోతూ చాలా ఇష్టాన్ని నవ్వులుగా పులకరించాం ఆకాశమూ సంద్రమూ ఏకమై కనబడుతున్న చూపు చివరి భ్రమలా.. ఇప్పుడు నువ్వు నాకొదిలిన కలలన్నిటా ఏటిగట్టున పొద్దుగడవని రోజులే నిర్జీవమైన భావాలు మోస్తూ అలసిపోతున్నా కనుకే అనుభవమవుతున్న శూన్యాన్ని పదాలుగా కూర్చి గుప్పిళ్ళు దాటించేస్తున్నా

// నీ కోసం 391 //

మధ్యాహ్నం నుంచీ ముసురుపట్టే ఉంది ఆకాశం నా చుట్టూ కనిపిస్తూ, కనుమరుగవుతూ పరితపిస్తున్న నిన్నూహిస్తూ ఇప్పటికో అరవైసార్లు తీసి.. చదివుంటా నీ ప్రేమఉత్తరం నాకసలు నిలకడ లేదంటూ ముద్దుచేస్తూ నువ్వనే మాటలు స్వగతంలో నన్నలరిస్తున్న నాదాలైనా ఒక్కసారిగా వెండిమబ్బులు రంగుమారే దృశ్యంలో నా జ్ఞాపకాలదంతా నిర్వేదరాగమవుతుంది తెలుసుగా.. ఆగమ్యగోచరాల వలయంలో బలంగా వీస్తున్న గాలులకి కన్నులు మూసుకున్నానా నువ్వన్నది నిజమే.. ఆకాశం ఉరిమినా కురిసినా ప్రయాసపడేదేముందని ఈ నల్లని అమాసరాత్రి, ఎర్రగా మారి మెరుపులన్నీ నీ రూపుకట్టి నాలో వెలుగు నింపుతున్నట్టు కొత్త సౌందర్యాన్ని చిందిస్తుంటే ఆస్వాదించడం మాని వెక్కిళ్ళెందుకు కదా

// నీ కోసం 390 //

నీ రాకతో నా చిన్ని హృదయం చిరునవ్వుల వెలుగుతో చీకటిని తరిమింది ఇప్పటిదాకా పరాయిని చేసిన సంతోషం ప్రేమగా దగ్గరకొచ్చింది గుండెచప్పుడు ఆలకించేందుకు నువ్వొచ్చావని తెలిసాక మనసు కూడా మౌనం వీడి నీతో గుసగుసలాడుతూ నిద్రపుచ్చాలని కొత్తకొత్త ఊసులను పోగేస్తుంది పిలవగానే పలికావు కాబట్టి సరిపోయింది లేదంటే నీ పిలుపు కోసం కలతపడ్డ రాత్రితో పెనుగులాడవలసి వచ్చేది బరువెక్కే సమయమయ్యింది బెంగ లేదిక..నువ్వొచ్చేసావుగా.

// నీ కోసం 389 //

వానొస్తుందని, చిగురాకుల వణుకు చూడమన్నది నువ్వే నీటిలో కాగితప్పడవలు వదులుదామని చెప్పింది నువ్వే కాసేపు స్వేచ్ఛగా తడిచినా తప్పులేదని చెప్పింది నువ్వే బరువెక్కిన పువ్వుల సౌందర్యం చూద్దామన్నది నువ్వే భావోద్వేగపు ఆనందాన్ని హత్తుకుని అనుభవించమన్నది నువ్వే చిమ్మచీకటిలోనైనా రెక్కలొస్తే ఎగిరిపోవచ్చని రెచ్చగొట్టింది నువ్వే పట్టరాని సంతోషాలకి వెలకట్టలేమని ఆదమరిచింది నువ్వే అంతరంగాన్ని ఆకాశమెలా గుమ్మరిస్తుందో ఆస్వాదించమన్నదీ నువ్వే ఆపై... రాత్రంతా నిద్రపోకుండా, కలలొచ్చే దారి మరిచానని గోడెక్కి మరీ కోడిలా కూస్తున్నదీ నువ్వే

// నీ కోసం 388 //

నీ మదిలోని ఆర్తి శబ్దరహిత భాషలో నన్నావరించినప్పుడే నిన్ను పోల్చుకున్నా ఏకాంతంలో నన్ను గమనించేంత తీరికా, ప్రేమా నీ ధ్యానంతోనే నాకందిపోతుంది చిత్రంగా నీ చూపులు నన్ను భద్రంగా దాచుకున్నాయని మిలమిలా ఆ కళ్ళు నవ్వినప్పుడే తెలుసుగా జ్ఞాపకమయ్యేంత దూరంలో నువ్వెప్పుడూ లేవని ఎన్ని పాటలు పాడి చెప్పనూ.. అయినా, ఈ వేకువలూ, సాయింత్రాలు దాటి కాలాతీత కావ్యమయ్యావు కదా నువ్వెప్పుడో

// నీ కోసం 387 //

మనసు తెరిచుంచా రమ్మని పిలిచి మాటలకి తాళమేసి బజ్జున్నావా గుట్టుగా గుండెలో దూరిపోమని చెప్పి గుబుళ్ళకి నన్నొదిలేసి మాయమవడం గొప్పనా అల్లిబిల్లి అల్లరంతా పిడికిట్లో నలిగి అలుకలతో కలతపడుతుంది ఏమైనా తెలుసా నునుసిగ్గులు దాచుకున్న కళ్ళల్లో ఎరుపుకాస్తా కరిగి ఉదయానికి ఏరయ్యేట్టుంది కనికరించవా

// నీ కోసం 386 //

సమయం అలా కదిలిపోతూంది.నేనే వెనుకబడ్డానేమో, నీతో నేనున్న కొద్ది నిముషాల గతాన్ని అదేపనిగా నెమరేస్తూ నిలబడిపోతున్నా. దేహానికి మంటబెట్టి అలలా కదిలిపోయే సముద్రుడిలా నువ్వనిపిస్తుంటే, ప్రవహించడం మరచిన నదిలా పడి ఉంటున్నా. రాతిరంతా రెప్పల్లో నువ్వు దోబూచులాడిన సంగతి మరువనేలేదు. పగలయింది మొదలు కన్నుల కిటికీ తెరచి నీకోసం ఎదురుచూస్తూనే ఉన్నా. అన్ని రంగుల అనుభూతుల్లో నీకిష్టమైన వానరంగులో తడిస్తూ నీ ఊహలతో తాపం తీర్చుకుంటున్నా. ఏం చేయలేదో చెప్పు. మనసునెదిరించి చీకటి పొలిమేరల్లో నిన్ను అనుసరించలేదా, నువ్వు తలెత్తినప్పుడల్లా నీ చూపుల్లో ఒదిగేందుకని నవ్వుతూ వెలగలేదా, మౌనంలో పెనుగులాడుతున్న నీ మోహానికి పరవశపు సాంత్వనివ్వలేదా. నీకంతా తెలిసిన నా బెంగనేం చెప్పనూ నీ ఏకాంతంలో పరిమళిస్తున్న ఊపిరిగాలి నాదో కాదో నువ్వే చెప్పు..

// నీ కోసం 385 //

కనురెప్పల్లో చేరి క్షణక్షణం నువ్వు చేస్తున్న సందడికేమో మబ్బుకుండలా నా మది చిరునవ్వుల వర్షాన్ని కురిపిస్తుంది మేనంతా కలవరానికి తడుస్తుందేమో తూలుతున్న ఈ వేకువగాలి చల్లగా నీ ఊహను చేర్చి చెక్కిలినంటిన తీపి చినుకయ్యింది

// నీ కోసం 384 //

పాలపొంగులా ప్రేమకెరటమో మహాద్భుతమై తీయగా నీలో నన్ను కలగలుపుతుంది నిజమేనేమో ఏమో.. నాలో ఏకాంతానికి ఒక్క నువ్వంటేనే ప్రాణమని తెలిసేలా రుధిరమంతా ప్రణయధారగా మారి ప్రవహించడం ఇప్పటికిది ఎన్నోసారో నా గుండెగిన్నెలో మధురసం తాగిన మైకం నీ పెదవుల మోహమై నన్నల్లుకుని మదిలో మౌనం మాటలు దాటి ముద్దులుగా మారడం నిశ్శబ్దరాగానికో లిపి కుదిరిన విచిత్రం నీ చూపులు శ్వాసిస్తూ ఎంత భావావేశానికి లోనవుతానో అప్పటికప్పుడు పువ్వులా పరిమళిస్తాను అయినా కొన్ని సమయాలెంతో బాగుంటాయి నా కాటుక కళ్ళు కరిగి పన్నీరయ్యేంతగా

// నీ కోసం 383 //

సగం రాత్రి వేళ ప్రేమ వాసనేస్తున్నట్టు నీ విరహం నా నిద్దుర చెదరగొట్టి ఒక్కసారి పొదుపుకుంటా రమ్మని పిలిచింది. ఆ రహస్య బాహువుల్లోని నిశ్చింతే నాలో చిన్న చిరునవ్వుకి ప్రాణం పోసింది. వినిపించని రాగాల నీ ఎదలోని భావావేశం, నా జుత్తు నిమురుతూ నువ్వేసే తాళం నన్నో మధువనిలోకి తీసుకుపోయినట్టుంది. నీ పెదవి దాటని మాటలన్నీ నా కన్నుల్లోని ఒంపేందుకు ఇంతకంటే మంచి సమయం లేదనుకున్నావేమో, ఒక్కో పదమూ బుగ్గల జారి రెప్పల బరువుని దించుతుంది. హృదయం లోపలంతా కవ్వం పెట్టి చిలుకుతున్నట్టు ఈ హాయి నీ స్పర్శదైతే, ఈ రాతిరి తెల్లవారొద్దని నా చుట్టూ ఇన్ని చీకటి తెరలు నువ్వల్లిన కౌగిలిదేగా. నీ ఊపిరి ఉద్వేగపు చిరువెచ్చని పరిమళం అందమైన పూలగాలికి సమానమైతే కాదుగా.. కిటికీ లోంచీ సన్నగా పారిజాత పరిమళం, నల్లగా ఆకాశం.. అరె, కలో నిజమో తెలీనట్టు, అచ్చం నువ్వు చెప్పినట్టే ఉంది, ఈ గదిలో వెన్నెల వెలుతురు కూడా, మరైతే ఇది అమావాస్య కాదా.. ఇక్కడ బిడియంతో పెరుగుతున్న నా అందం నీకు ముందే తెలుసా?!