ప్రేమాన్వీ...
మనసుప్రాంగణంలో శీతలపవనాలు..అమృతవర్షిణి రాగమాలపించిందో ఏమో
లోపలంతా పూలవాన కురిసిన ఆనవాళ్ళు, గ్రీష్మతాపాన్ని తీర్చేందుకు కురిసిందనుకున్న వాన ఊహలపడవలో ఒళ్ళు మరిచే చిలిపిదనాన్ని అనుభూతించేలా చేసింది.
ఏకాంతపు ప్రేమగీతిలోని అనురాగం కన్నులు తెరవనివ్వని తీపి పరితాపమైతే, అది నిద్రని ఎలా అనుకోనూ..
నిశ్శబ్ద ప్రపంచంలో పరవశాల విద్యుల్లతలా వెలుగుతున్న నా మోము గుండెలో వర్ణాలను ప్రకటిస్తుంది తెలుసా ?!
మధుమాసం ముగిసిందని కాలప్రవాహం ఆగనట్టు, శారదరాత్రి అందం వేకువైతే మాసిపోదుగా. నీ తలపులతో నే రాసే సంకలనం నాకో అనిర్వచనీయ రాగం. నన్నూయలూపే మధురగానం. అయినా..చప్పుడు చేయక నువ్వు చూసే చూపుతోనే నువ్వాడాలనుకున్న ఊసులు మదికందిపోతాయి. అందుకే రేయంతా నీ చిత్తరువే నా లోకమవుతుంది. కాలానికి కోల్పోయిన ఆనందతన్మయత్వం ఇప్పుడిలా సుషుప్తిలో నీ సమక్షమవుతుంది. వెన్నెల ప్రకోపించే అద్భుతావస్థ తడిచిన పువ్వులా మార్చేసాక నీ ఎదపై మల్లెదండనై వాలిపోతాను.
గుండెగదిని చీకటి చేస్తూ కలలా నడిచొచ్చి నువ్వు చేసే అల్లరికి పెదవుల్లో మొదలయ్యే మువ్వలశబ్దాన్ని ఎంతకని దాచనూ. ఎన్నో అద్భుతాల్ని నింపుకున్న నీలిమబ్బు రాత్రి కాగానే చుక్కల్ని దేహమంతా అలంకరించుకున్నట్లు నేనో ఆదమరచిన బొమ్మలా నీ వశమవుతాను. ఈ సువాసన ఏ మూల నుంచో, నువ్వన్న మాటలు మరిమరి తలుచుకున్న భావనో, చిరుగాలి సైతం స్వరాల గంధాన్ని కలిపి కవ్విస్తున్న సంగతేం చెప్పనూ..తొలిఝామున ఎగిసిపడే అలల అలజడి నీ హృదయమై నన్ను తాకినప్పుడు నేనో చిత్తడి తీరమై చిరునవ్వుతాను..ఆపై పట్టిపట్టి తట్టిలేపే నువ్వు.. నాకు ప్రాణసమానమందుకే.. .
No comments:
Post a Comment