ఓ ప్రేమాన్వీ
ఉత్తరమంటే వాయిద్యం శృతిచేసినట్టు మనసు మీటాలట. నువ్వు రాసిన ఉత్తరాలందుకే ఎప్పటికప్పుడు ప్రత్యేకం. అదీ కాక.. నాకు రాసేప్పుడు విశేషమైన సంగీతం వింటూ, ఐక్యమయ్యే నీ అంకితత్వాన్ని సైతం చూపిస్తావ్. అందుకేగా రోజూ..ఇన్ని సాంకేతిక మాద్యమాల్లో మనమెంత దగ్గరున్నా ఇవన్నీ ఇవ్వలేని ఆనందం, ఉత్తరం మోసుకొస్తుంది. ఈ ఎండాకాలానికి నాకదే తడవాలనుకొనే ఇష్టమైన తుంపర. అన్నీ తెలిసినా నాతో చెప్పించాలని చూస్తావు కదూ, అదో అనిర్వచనీయ భావన. అందమనేది ఆకర్షణలో ఉండదని నీకు తెలుసు కనుకనే నన్ను నలుగురిలా కాక విడదీసి చూసావ్. ఆ అతిశయమంతా నీ అక్షరంలో ఎప్పుడో అంది పుచ్చుకున్నా. లాంఛనాలతో సంబంధంలేని అనురాగం కనుకనే నేనూ కరిగిపోతుంటా. అదేదో పాటలో... 'రాధా బాధితుడ్నిగా..ప్రేమారాధితుడ్ని గా' అనగానే అదేపనిగా నవ్వుకుంటా, నువ్వే నాకోసం పాడినట్టు.
విరహం విరచించగలిగేంత తేలిక కాదు కనుకనే అందరికీ అర్ధమవదు. నీ హృదయం మెత్తదనమంతా ఆ చెక్కిళ్ళు తాకితేనే తెలిసిపోతుంది అంటావ్ కదా.. ఇది గుర్తొచ్చినప్పుడు కురిసే కన్నీటికే తెలుసు విరహమంటే. అప్పుడప్పుడూ అరచేతుల్లో చేరి పసిబుగ్గలంటూ నువ్విచ్చే అరుదైన ముద్దులు అందుకోలేకపోవడం నాకు విరహమేనంటే ఎవరికైనా ఏం తెలుస్తుంది. అయినా శూన్యంలో ఉంటూ నిన్నే పలవరించే పంచేంద్రియాలను బుజ్జగించడం ఎంత కష్టమో తెలుసా. ప్రతి ఆకు కదలికలకీ..పువ్వు గుసగుసలకీ నిన్నే వెతికే మనసు వియోగభారం నీకు తెలుసు కదా..
మనిషి కోసం ఆరాటపడే వ్యసనమందరికీ అబ్బదు. శిఖరంలా ఉంటూ సముద్రమంత లోతు ఆలోచిస్తావని నాకైతే తెలుసు కదా. అందుకే ఎవ్వరికేమైనా నీ మనసు నవనీతమైపోతుంది.
నీ ఉత్సాహమూ అవ్యక్తమూ తెలిసిన ఎవ్వరికైనా నీపై ఇష్టం కలగకుండా పోతుందాని సందేహమొస్తుంది.
సరిగ్గా చెప్పావు.. మబ్బుల్నీ ఆకాశాన్ని చూసి మురిసిపోవడం పిల్లలకీ, ప్రేమికులకే సాధ్యం. కంటికి కనబడని లోకాల వెంట తిరిగే వారికి లాక్ డౌంతో సంబంధం ఏముంటుంది కనుక. గతానికీ భవిష్యత్తుకీ వంతెన వేస్తూ వర్తమానాన్ని ఊహల్లో గడిపేసేవారి పనే బాగుంటుంది. నిజానికి తీర్చలేని లోకం సమస్యలు తలకెత్తుకొని లేనిపోని ఒత్తిడి తెచ్చుకొనే కంటే ఇదే బహు సుఖమనిపిస్తుంది.
మనసు దానిపని అది చేసుకుపోతున్నప్పుడు నీకు హాని కలగనంత వరకూ తప్పు ప్రసక్తి ఏముంటుంది. నిజానికి పైకి నీచమైన పన్లు చేస్తూ సమర్ధించుకొనేవారు ఎందరో లోపల ఒకటి పెట్టుకొని బయటికి నటించే పాత్రధారులే ఎక్కువీ జీవితమనే నాటకంలో. మనసు తనకుగా పొందిన ఆనందాన్ని దానికి కారణమైనవారిని ప్రత్యేకదృష్టితో చూస్తే తప్పేముంది. అదే తప్పనిపిస్తే ఆ విషయం నాతో పంచుకొనే సాహసం చేయవనీ తెలుసు.
స్త్రీ అనగానే మగవారికి ఆకర్షణ పుట్టడం సహజమే అయినా, అందరిపట్లా ఉప్పొంగని హృదయం ఒకరిని చూసీ చూడగానే విప్పారి పరిమళిస్తుంది. వారి తలపులో తొలకరి జల్లుకి తడిచిన మట్టిలా పరవశించడం ప్రకృతిధర్మం. అంతులేని తపనతో ఆవిరయ్యే నీటికి తెలుస్తుంది, ఆ తరువాత కురవబోయే పన్నీటిజల్లుల రహస్యం. శరీరానికతీతంగా ప్రేమ ఎదిగాక ఆత్మకి మలినం అంటుతుందేమో తెలీదు.
నీ మాట మల్లెతీగలా నన్ను పెనవేసినప్పుడు నా పాట పంచామృతమై నీకు తీపి పంచడంలో వింతేముంది. అరుదైన ఈ వ్యాపకముండబట్టే ఇన్నాళ్ళూ లోకానికి దూరంగా బ్రతకగలుగుతున్నా. మధురమనోహర హృదయావేశం తెలిసినవారికి, మంచితనం..మొండితనం అలంకారమవుతాయి తప్ప ప్రదర్శించేంత అవకాశాన్ని వెతుక్కోవని నా విశ్వాసం.
అయినా నన్ను కలవడం యాదృచ్ఛికమనిపిస్తుందా. అదేమో కాలం కదులుతున్న కంగారులో మనల్ని కలపడం ఆలశ్యం చేసిందని నేననుకున్నా. ఇప్పటికి అన్నిటికీ అతీతమైన పేరులేని బంధముందని ఒప్పుకున్నాక, అమ్మనో, అక్కనో, ప్రేయసినో కాకుంటే పోయేదేముందని. ఆత్మబంధువులు అవుతామో లేదో తెలీకున్నా ఆప్తులుగా అయ్యామని తెలిసినప్పుడు క్షణాల విలువ పెరిగిపోతుంది. ఇప్పటికి నీ లాలిత్యపు కళ్ళే ప్రతి ఉదయం నాకు ప్రాణం పోస్తాయని నమ్ముతున్నా. ఏ జీవితకాలంలో చేసిన తపస్సో ఊహకందని సూక్ష్మంలా వాస్తవమైందనుకుంటాను. మనోలోకమంతా విస్తరించిన నన్ను మోసేంత వివశత్వం నీకున్నప్పుడు నిన్నిడిచి నేనెటూ పోను. ఎదలొక్కటైన బృందావనం నీ సమక్షమేనని సశేషమవుతాను..
No comments:
Post a Comment