Friday, 29 May 2020

అమృతవాహిని 12

ప్రేమాన్వీ...

మనసుప్రాంగణంలో శీతలపవనాలు..అమృతవర్షిణి రాగమాలపించిందో ఏమో
లోపలంతా పూలవాన కురిసిన ఆనవాళ్ళు, గ్రీష్మతాపాన్ని తీర్చేందుకు కురిసిందనుకున్న వాన ఊహలపడవలో ఒళ్ళు మరిచే చిలిపిదనాన్ని అనుభూతించేలా చేసింది. 
ఏకాంతపు ప్రేమగీతిలోని అనురాగం కన్నులు తెరవనివ్వని తీపి పరితాపమైతే, అది నిద్రని ఎలా అనుకోనూ.. 
నిశ్శబ్ద ప్రపంచంలో పరవశాల విద్యుల్లతలా వెలుగుతున్న నా మోము గుండెలో వర్ణాలను ప్రకటిస్తుంది తెలుసా ?!

మధుమాసం ముగిసిందని కాలప్రవాహం ఆగనట్టు, శారదరాత్రి అందం వేకువైతే మాసిపోదుగా. నీ తలపులతో నే రాసే సంకలనం నాకో అనిర్వచనీయ రాగం. నన్నూయలూపే మధురగానం.  అయినా..చప్పుడు చేయక నువ్వు చూసే చూపుతోనే నువ్వాడాలనుకున్న ఊసులు మదికందిపోతాయి. అందుకే రేయంతా నీ చిత్తరువే నా లోకమవుతుంది. కాలానికి కోల్పోయిన ఆనందతన్మయత్వం ఇప్పుడిలా సుషుప్తిలో నీ సమక్షమవుతుంది. వెన్నెల ప్రకోపించే అద్భుతావస్థ తడిచిన పువ్వులా మార్చేసాక నీ ఎదపై మల్లెదండనై వాలిపోతాను. 

గుండెగదిని చీకటి చేస్తూ కలలా నడిచొచ్చి నువ్వు చేసే అల్లరికి పెదవుల్లో మొదలయ్యే మువ్వలశబ్దాన్ని ఎంతకని దాచనూ. ఎన్నో అద్భుతాల్ని నింపుకున్న నీలిమబ్బు రాత్రి కాగానే చుక్కల్ని దేహమంతా అలంకరించుకున్నట్లు నేనో ఆదమరచిన బొమ్మలా నీ వశమవుతాను.  ఈ సువాసన ఏ మూల నుంచో, నువ్వన్న మాటలు మరిమరి తలుచుకున్న భావనో, చిరుగాలి సైతం స్వరాల గంధాన్ని కలిపి కవ్విస్తున్న సంగతేం చెప్పనూ..తొలిఝామున ఎగిసిపడే అలల అలజడి నీ హృదయమై నన్ను తాకినప్పుడు నేనో చిత్తడి తీరమై చిరునవ్వుతాను..ఆపై పట్టిపట్టి తట్టిలేపే నువ్వు.. నాకు ప్రాణసమానమందుకే.. .💕💜  

// నీ కోసం 164 //

గోధూళి రేగుతూనే నీ తలపులు
తోడు తెచ్చేందుకు సిద్ధమవుతాడు చంద్రుడు

చీకట్లో ఏరుకోలేని చూపులు
అక్షరాలుగా నన్ను తాకుతాయనే
నా ఊపిరి నీ కవిత్వపుగాలి పీల్చుకొనేందుకు వేచిచూస్తుందప్పటికి

రెప్పలు కలవని కన్నులకు కలలు చేరవన్నట్టు
ఇంతకు ముందు కాస్త ధైర్యమిచ్చిన మాటలన్నీ
మౌనాలుగా ఎప్పుడు మారాయో..
ఎదలోపలి సందడంతా బుగ్గల్లో దాచిపెట్టి
నువ్వు రాగానే వినిపించాలని చూస్తున్నా

నాకోసమని పువ్వుల కానుకిచ్చావుగా
నీకోసమని క్రీగంటి చూపుల మైమరపు నేనవుతా..😊💜

// నీ కోసం 163 //

నన్ను పోగొట్టుకున్న తన్మయత్వం నీకు తెలుసు కదా
గుబుళ్ళనొదిలి గుండెవాకిళ్ళు తెరుచుకున్న స్వరాలు
కనుచూపుల కౌగిలింతకని తొంగిచూసిన కలలు

ప్రణయినీ రసాస్వాదనకని ఋతువులన్నీ మకరందాలై
ఎదలోయన ప్రవహించు ప్రేమవాగుల గలగలకి
లోలోపలి వెన్నెలజల్లులో పరిమళించిన క్షణాలు

మహోజ్వల సౌందర్యం నిన్ను తలచిన వసంతానిదని
నన్నాకర్షించిన ఆకాశం నీ హృదయమని
పెదవిప్పి మరోసారి చెప్పనా..
కోయిలున్నచోట కొమ్ముంటుందని తెలిసిన నీకు
నా ఆనందం నీ పొద్దెరుపు పదచిత్రమని పదేపదే తెలుపనా..😊💕

// నీ కోసం 162 //

నిశ్శబ్దంలో జారే కన్నీటి విలువ
కనులకు తెలియనట్లు
ఒక్కోసారి గొంతు మూగబోయిన సంగతి
గుండెకి తెలీదు

పరధ్యానంలో ఉన్న పువ్వులకు
మంత్రమేసేవారు లేకనే..సుగంధం శూన్యంగా మారి
పదాలు పొడారిన నీటిచెమ్మలైతే
హద్దులు చెరిగిన పొద్దులు ఒంటరి నవ్వులు కదా..

అప్పుడు..
ఆనందతరంగం కలలోనిదే అయితే
తెప్పలా ఊగుతున్న మధురోహాల మాటేమిటో
జ్ఞాపకాలు కాలాతీత అద్భుతాలో
ఒదులుకోలేని రెప్పలకు ఇష్టమైన కెరటాలో

ఏమో..
సమ్మోహనయుగాలు శాశ్వతం కాకున్నా
ఆగిపోయిన కాలం అబద్దమవనట్టే
అనుభూతుల రాగాలూ అలసిపోవన్నట్టు 💜

// నీ కోసం 161 //

నీలో సముద్రం పొంగి
అలలా నన్ను తడిపేందుకు పరవళ్ళు తొక్కుతున్నప్పుడు
కాలాన్ని కట్టేసే క్షణాలకి నిన్నా..రేపూ ఉంటుందా

నువ్వేమో..కన్నులకందని దూరాన్ని దాటేసి
నీ గమనం నేనన్నట్లే వచ్చేస్తావు

తెలుసా..
నిద్రగన్నేరు పువ్వులా మెత్తగా నవ్వే
నీ చూపులో ఎన్ని కవితలో
చదువుతూ నే పరిమళిస్తున్నా

నీ మనసులోని కోటి స్పందనలు
మౌనరాగాలుగా నన్నంటినప్పుడల్లా
నే గళమెత్తి పాడేస్తున్నా

ప్రేమాన్వీ..
నీలో నువ్వు లేవని భావరాహిత్యమైపోకు
మనఃతరంగాల తోడు..నీ ఊహల ఓడలో పయనిస్తూ
ప్రేమతీరాలకేసే నే సాగుతున్నా 💕💜

// నీ కోసం 160 //

మళ్ళీ వెనక్కి తిరిగొస్తే బాగుండనిపించే క్షణాలు
దారి తప్పుతున్న కాలాన్ని లాలనగా అదుపు చేసింది నువ్వేగా..

నలుగురిలో నిశ్శబ్దంగా ఉంటూ
నన్ను ఏకాంతంలో పలకరించిన రోజులవి
కళ కోల్పోయిన జీవితానికి తొలకరి స్వప్నమై
పున్నాగ పువ్వుల తోవలో నడిచొచ్చావు

మహా ప్రేమపాత్ర నాకిచ్చి నాలో చిరునవ్వుని
నీ కంటి దివ్వెలతో వెలిగించావు
కనులే తెరవాలనిపించని నీరవ ప్రకంపనలో
అనంతమైన నీ మౌనమే ఓ ఆలాపనగా
తెలియని ఆల్లరిని లోలోపలే నర్తించావు..

ఇంతలోనే..
బరువెక్కిన మనసుకీ మలుపులుంటాయని
మెరుపు లాగే గుండె లయ శాశ్వతం కాదని
గాలికి గాయమున్నట్టే..మనోవేదన సహజమని
మరణాన్ని మించిన విషాదం
నీ వియోగానిదని చెప్పకనే చెప్పేసావు

కానీ..ఏదేమైనా...
ఎదలో శిధిలమైన సంతోషం సాక్షి
నాకు నేనే ఉపసంహరించుకున్న ఊహలెప్పటికీ నావే..💜💕

// నీ కోసం 159 //

నా మనోమందిరంలో నీ రూపు
సడిలేని ఆకాశంలో మేఘాల దొంతర మాటు
చందమామ చందమని
పంచేద్రియాలకు ప్రాణవాయువులా
మనోహరభావమీ మధురోహ

ప్రతిసారీ పచ్చివాసనేస్తున్న కలలకే
సరాగమవుతున్న సుతిమెత్తని వలపు చాటు
నాకు నేనే కనిపించని
నిశ్శబ్దం శృతి కలిపిన రాతిరిలో
వెన్నంటిన రసానందం నీ తలపు

మాటలు రాని పువ్వులా ఎప్పుడు మారానో మరి
నా హృదయం నీ దగ్గరే ఉండిపోయినందుకే
ఏకాంతంలో తనివితీర్చేందుకు..
అద్దంలో నీ ప్రతిబింబమే నాకు తోడిప్పుడు 💜💕

// నీ కోసం 158 //



ఆకాశపుకొస నేలను మీటిన తరుణం
మనసు మలయసమీరం
లిప్తకాల కవిత్వ సుస్వరమైంది

వైశాఖపున్నమి వెన్నెల పాలపుంతలో
నీతో మాట్లాడాలనిపించినందుకేమో
అంతరంగ శ్రీరాగం
హద్దులు చెరుపుకొని.. కనిపించని నిన్ను
ఆరాధనగా శృతి చేస్తుంది

ఆపుకోలేని నవ్వులు సీతాకోకచిలుకలై
ఏకాంతపు స్వగత స్వాతిశయమై
అసంగత సంతోషాన్ని నటిస్తుంది
ఏమో..
చీకటి వాసన చికాకేసినందుకేమో
నిశ్శబ్దం చందనమై
గ్రీష్మతాపాన్ని తొలగిస్తే బాగుండునని ఉంది 😒💜

// నీ కోసం 157 //


ఎప్పుడు కనుగొన్నావ్ నన్ను
నీకో గతమో..భవిష్యత్తో కాలేని
తప్తశిలనుగా నేను..

అనుసరించే వచ్చిన అలవో
అనుకోకుండా విచ్చేసిన కలవో
నాలో ప్రవహిస్తున్న జలవో
నీలా నన్ను మార్చేసిన చలవో..

ఎంతోకాలంగా ఎదురైన అనుభవాలు
నీ చెలిమితోటకి చేరగానే పువ్వులై
నా గుండెల్లో వేణువూదిన రాగం
నీలోకి తొంగిచూసినప్పటి కలస్వనమై..
నిజమే కదా
వెన్నెల్లో ఒంటరినక్షత్రం
నిన్ను చూసేగా నేర్చుకుంది వలపువేదం
ఎక్కడుందిప్పుడు చీకటి
సముద్రంపై మెరుస్తున్న ఎండలా నేనైపోయాక..💜💕

Monday, 18 May 2020

// నీ కోసం 156 //

కాలం కథలు ఆలకిస్తున్న నాకు
మన ప్రేమ పాపవుతున్న సంగతి తెలిసి
యవ్వనం గమ్మత్తుగ పులకించింది
రేయంతా కరువైన నిద్ర
వేకువకి కరుణించే సమయం
గుండెతెరల మీద నీ తలపు బరువెక్కిస్తుంది

వలపించానంటూ నీ చిరునామా నేనయ్యాక
మునుపున్న ఆల్లరి మాయమై..నాలో సుతారం 
రంగులద్దుకున్న వసంతమై పల్లవించింది
అడుగడుగునా పువ్వులతో పోటీపడినట్లుండే
నా నవ్వుని చూస్తే తెలిసేది
సముద్రపు అలలు తీపి నురగలైన సంగతి

ఈ చూపుల అల్లిక గతజన్మ మనోవ్రతపు ఫలశృతి కనుకనే
ఇన్నిరాసుల తమకాలు మన పసిడి కావ్యాలు
నా జ్ఞాపకాలతో రమిస్తున్న ప్రతిసారీ
నువ్వు సిగ్గుపూల సువాసనను ఓర్చుకోవలసిందే
పండువెన్నెల సింధువైన రాతిరి
నన్ను సమీక్షించడం ఆపకందుకే మరి..💜 


// నీ కోసం 155 //

వెదురుపొదల నీడల్లో నీ సంకేతాలు
ఎగిసిపడే అలలపై రాసిన ప్రబంధాలు
నాలోనే నువ్వాదమరచిన రాతురులు
నీ మది నాకందించిన సన్నజాజి తరంగాలు

అసలేదీ తెలియకనే..
నీ చూపు విద్యుల్లతకి
పూలఋతువు పరిమళంలా
పెదవుల్లో చిరునవ్వులు పూయించుకుంటూ నేనొచ్చేసా

నరనరంలో ఉరకలేసి
అలసిపోయిన రక్తం
కన్నుల్లోకొచ్చేసరికి ఛిప్పిల్లింది చూసావా

అవును నేనే
నీ చిలిపి కలల లాలసను 
తీర్చేందుకు పుట్టిన మోహావేశాన్ని

నమ్మవా..?!
నీ సౌందర్యాన్వేషణ..నా ధ్యానోపాసన
యుగాలుగా పరుగులెత్తించిన ప్రేమపాశమిదేగా

ఏమో..
అపురూపమైన అనుభూతి అశాశ్వతమైతేనేమి
మేఘాల్లో విహరించే ఊహని నువ్వు నమ్మకున్నా
నీ మనసు నమ్మితే చాలనుకుంటున్నా..💜💕

Thursday, 14 May 2020

//నీ కోసం 154 //

కళ్ళు మూయడమే ఆలశ్యమైనట్టు
నీ పిలుపు ఆప్తస్వరమై తడమగానే
మనసు పక్షిలా నీవైపు వలసకొస్తుంది

వెన్నెలను మేలిముసుగేసుకున్న ఆకాశం
తన అనంతాన్నింకా విస్తరించి
నా ఆహ్లాదానికి దారిచ్చి సాగమంటుంది

మదిలో హర్షం మేఘమిచ్చిన మెరుపుని కలుపుకొని
తన సౌందర్యనికి ఆశల ముడుపు కట్టుకొని
నీలో ఒదిగేందుకు ఉరకలేస్తుంది

నీ ఎదురుచూపుల స్వాగతాన్ని అందుకున్నందుకే
అణువణువూ అనురాగం నింపుకున్న నా గీతం
ప్రతిరేయీ నీకు గుసగుస కావాలనే ఈ పయనమంటుంది

లాలించడం మొదలెట్టు..
లయమయ్యేందుకే నీ ఆలింగనానికొచ్చింది మరి 🤗💜


Wednesday, 13 May 2020

// నీ కోసం 153 //

నిన్న నడిచినంత మేర కదిలిన వెన్నెలచారలే
నేడు గాయాల ఇసుకమేటలై 
ఆకాశమంత శూన్యమైన రహస్యం నీ వియోగం

నిశిరాత్రి వినిపిస్తున్న చేదుపాటలకి
ఒంటరిద్వీపంలో ఉక్కిరిబిక్కిరవుతున్న గుండె
శాపగ్రస్తమై చలిస్తున్నట్లుంది

కన్నుల దీపాలతో వెలిగించుకున్న ఆశలు
కన్నీటితో కరిగిపోతాయనే ఊహలో
నీకైన నిరీక్షణ తీవ్రమై నిదురనే మరపించింది..

నీ చేతుల్లో వెచ్చదనం నా చైతన్యమో
మన మదిలో సంగీతమే ఐశ్వర్యమో
నల్లని మేఘాల్ని దాటి విరుచుకుపడే
వెన్నెల కదా నీ సమక్షం..
ప్రేమాన్వీ
నువ్వెక్కడ. .
ఊపిరిసలపని ఆనందం కనుకొనల్లోకొచ్చి చానాళ్ళయింది
నిశ్చింతను పెనవేసుకోవాలనుంది
సుదీర్ఘ కెరటమై రావా...పూర్తిగా తడిచిపోవాలనుంది..💜



Attachments area

// నీ కోసం 152 //



Attachments4:02 PM (7 hours ago)

ఈ వసంతం అద్భుతం..
హృద్యమైన కోయిల గొంతులో నీ పిలుపులు, వెలుగురేఖల సౌందర్యం ఉన్మత్తమై, మృదుమంజుల గంధం.. వేకువనే నన్ను గారంచేసే నీ తలపుదైన క్షణాల్లో..

ఓ అనుభూతి నిశ్శబ్ద స్పందనం..
నిన్నూ నన్నూ కలిపిన కాలం..నిన్ను తాకొచ్చిన మలయానిలం నాకెంతో అపురూపం..నీ వలపు సారంగం..తడి ఆరని మది అపూర్వ భావోల్లాసంలో...

ఆ ఒక్క కలే మనసుకిష్టం..
నీ మౌనగీతాల గలగల వింటూ, నిదురను ఆహ్వానిస్తూ, పరవళ్ళు తొక్కుతున్న అలలు శాంతించినట్టు, ఊపిరి నెమ్మదిస్తూ మరోలోకానికి చేర్చే చీకటి గదిలో..

నా మనసు పాడే మోహనరాగం.. ప్రణయ కలాపమైతే కానిద్దాం చరితార్ధం..నీతో కలిసి చేసే గగన విహారం..మరెవ్వరికీ దొరకని అదృష్టం 💜💕   

// నీ కోసం 151 //

మనసు తోటలో నే చేసిన స్వరార్చనకి నువ్వు తాళమేయలేదూ
నీ పొడారిన గొంతులో తడి సుగంధం నేను కాలేదూ

దీపాలు నీటిలో తొంగిచూసే వేళ..
నవ్వుతున్న నీ అరకన్నుల్లో 
మమేకమై.. సగమైపోలేదూ

అయినా ప్రతీక్షణలో క్షణక్షణం జ్వలిస్తూ
తొలిపరిచయంలా అనిపిస్తావెందుకు..

ఒంటరితనం ఒక్క దేహానిది కాదని
నీ రెప్పల క్రీనీడలో రూపం నాదైనప్పుడు..
నువ్వూ నేనూ ప్రేమా వేరుకాదని నీకెవ్వరు చెప్పాలిప్పుడు..😣💕 

Wednesday, 6 May 2020

// నీ కోసం 150 //

రెప్ప వేయడం మరిచింది కన్ను
హృదయమొలికితే ఆపలేనని తెలుసుకున్నట్టు

నిద్రనేదే రాని ఈ కాలానికి పేరేం పెట్టాలో
మౌనాన్నాపే ఇష్టమైన మాటేదీ తెలీనప్పుడు

అలిగిందెవ్వరో నువ్వు తీసే ఊపిరికి తెలుసేమో
నేనెదురుపడ్డా నా వాసన గుర్తించలేవిప్పుడు

అసలు గాయాన్ని ప్రేమించే ధైర్యమెవ్వరికుంటుందని..
ఇవ్వలేని వారికీ ఇవ్వగలిగిందే ప్రేమని తెలీనప్పుడు..💜

// నీ కోసం 149 //


ప్రేమసంస్థాపనార్ధాయ సంభవామీ..
అన్నట్టు నువ్వున్న మైమరపులో
కన్ను ముందో..మనసు ముందో
నీ వెనుకే అనుసరించేసింది

ఇన్నాళ్ళూ మహార్ణవపు ఆల్చిప్పల్లో
నిద్రించినట్టున్న స్వప్నాలు
అసంకల్పిత చిరునవ్వులై
కనుపాపలనూ కదిలించాయి

శబ్దరాహిత్యపు నీ ప్రపంచంలో
నా ఉనికి తెరిపిలేని సంగీతమైతే
ఆ అనుభూతి కొసకొమ్మన రాగతాళాలమై
సప్తస్వరాల తీపితో తనువు తడుపుకుందాం

ఒక్క క్షణం..ఒక్కరోజంటూ ఆలశ్యం చేయకు
ప్రబంధమయ్యేందుకు ఆరాటపడుతున్నది..
నేను కాదు..అక్షరాలా అక్షరాలేనంటే నమ్మవే..🤣💜

// నీ కోసం 148 //

సోమరిగా మొదలైన తొలిపొద్దు చలచల్లగా కదులుతూ సాయింత్రానికి నిలకడ లేని అలలా సంగీతాన్ని ధ్వనిస్తూ ఉంది వర్షాకాలం సందడి మొదలయ్యిందిి కదాని ఏ మొక్కని పలకరించినా వానంటే నీకెంతిష్టమో చెప్తుంది అవునా.. విరామమన్నది లేకుండా కురిసే ఈ జల్లులో నీ నిరీక్షణా రహస్యం దాగుంటే విరహమన్నది నీకు వ్యాపకం కదా మరైతే.. నువ్వు అనాలనుకున్న తీయని మాటలు కళ్ళు మూసుకుని నేనాలకిస్తున్న చినుకు శబ్దంలో కలిసి గలగలమని కొత్తరాగాలుగా నన్ను మెలిపెడుతున్నవెందుకో కొన్ని యుగాలుగా శూన్యమైన కలలకు పరిమళం పువ్వులకి మాత్రమే రాదని నచ్చజెప్పాలి ఇంతకీ.. నీ గడపకివతల నిలబడ్డ నేనెవరినో చెప్పవూ

// నీ కోసం 147 //

నేనో నిశ్శబ్దాన్ని..మాటలపై అలిగి అప్పుడప్పుడూ నిదానమైపోతుంటా. ఎన్నో భావాలూ, అనుభవాలూ, అనుభూతులూ క్షణం విరామం లేక మోస్తుంది నా గుండె. పైకంతా ఏదో కోపిష్టిగా కనిపిస్తున్న నేను నిజమైన నేను కాను. ఎన్నో మోసాలను క్షమిస్తూ మరెన్నో గాయాలను ఓర్చుకుంటూ మనసు కొంచం శిధిలమైనా..మరలా చిగురించేందుకు ప్రయత్నిస్తున్న మౌనాన్ని. జీవితపు ప్రయాణంలో పయనిస్తున్న ప్రతిసారీ ఎంతో ఏకాంతాన్ని ఎదుర్కుంటాను. తెలుసా అప్పుడంతా నీలో నేను శబ్దిస్తుంటాను. నీలో మరచిన అస్తిత్వాన్ని పలకరించేందుకు పైకి నిశ్శబ్దమవుతాను. నాకెటూ నన్ను తిరిగి తీసుకోవాలనే కాంక్షలేదు. నీలో సగమై నేనున్నప్పటి సమస్త జ్ఞాపకాలూ శబ్దిస్తుంటే.. అవి ఆలకించడమే నాకిష్టం...💜

కొన్నిరోజుల ఈ స్తబ్దత మరణసదృసమైనా..అల్లరిపరుగుల నీ అక్షరాల వెంట నా మనసు నిదురమాని మరీ వెంబడిస్తుంది. లోలోపల నీ మాటల్లో ఒలికిన అనుభూతులు గజిబిజి లాలిపాటగా వినబడుతున్నా రెప్పలు లయబద్దంగా నవ్వుతాయి తప్ప కలలను రమ్మనవు. మత్తుగా దాచుకున్న గుసగుసలన్నీ మెత్తగా పంచేందుకు చేస్తున్న నిరీక్షణ కొత్తజీవాన్ని నింపుతుంది నిజం..💕   

// నీ కోసం 146 //

మాటలకందని భావాలు
మెత్తని హిందోళంగా పాడుతూ..
నీవైపొచ్చిన కోయిల కుశలమడుగుతుంది

ఈ రసోదయానికర్ధం తెలిపేలా
చెరుకుతీపి పదాలు నేర్పి పంపా..
నీ మనసుకి చెవులుంటే ఆలకించు

ముళ్ళగోరింటలా నా చూపు
గుచ్చుకుందని నువ్వలిగినందుకు
అరమోడ్పులో ఆగిన కన్ను
రెప్పలమాటే నిన్ను బుజ్జగిస్తుంది

నక్షత్రాలు నిద్రలేచేలోపు రా మరి..
ఏకాంతాన్ని పాడొద్దని నా కృతి అర్ధిస్తుంది
నువ్వొస్తే జాజరను కలుపుకుందాం మరి..😊💜


// నీ కోసం 145 //

నీ ప్రేమపరిథిలో నేను
తెరిపిలేని వలపువానలో తడుస్తున్నానంటే
ఆ జాలివిరహమే నిన్నూ తాకి
నన్ను గుర్తుచేసినప్పుడు
కాలానికో ఋతువూ..ఋజువూ
ఉందని మర్చిపోయావు

తీయగా చెమరిస్తున్న నీ కన్నుల్లో ప్రేమార్తి
ప్రణయాన్ని తపిస్తున్న నిషాదంలా
మనసుని ఓలలాడిస్తూ
ఆపై గొంతులోజీర గుండెనెంత జేవురించిందో
నే తలపులో ప్రవహిస్తున్నప్పుడే తెలిసింది

నీ వేదనావహించిన నేనో పాటనై
అంతరంగపు వాల్మీకంలో
పుష్యరాగాన్ని కానుకిస్తా నీకు
ప్రేమాన్వీ.. తెలుసుగా..
ప్రాణానికి ప్రాణమైన నువ్వో ఆలంబన
వైశాఖంలో కొంటె ఊహల పూలగాలి వింజామర.. 💜💕

// నీ కోసం 144 //

అభివ్యక్తి లేని అనురక్తి
అవ్యక్త నిశ్శబ్దమైతేనేమి
గుండెల్లో నవ్వులకైతే నోరుందిగా

జ్ఞాపకాలు పావురాలై
విషాదాన్ని పతాకస్థాయికి తీసుకుపోతేనేమి
మాటైతే పదిలమయ్యిందిగా

చైత్రము వైశాఖమై..
రోజులు..నెలలుగా మారితేనేమి
తీపి తరగని మధురిమ మనసుకుందిగా..

తనలో తానైన
కోయిల మౌనవించినా
రాగాన్ని పరితపించే హృదయాలకది వినబడుతుందిగా..💜💕

Friday, 1 May 2020

అమృతవాహిని 11



ఓ ప్రేమాన్వీ

ఉత్తరమంటే వాయిద్యం శృతిచేసినట్టు మనసు మీటాలట. నువ్వు రాసిన ఉత్తరాలందుకే ఎప్పటికప్పుడు ప్రత్యేకం. అదీ కాక.. నాకు రాసేప్పుడు విశేషమైన సంగీతం వింటూ, ఐక్యమయ్యే నీ అంకితత్వాన్ని సైతం చూపిస్తావ్.  అందుకేగా రోజూ..ఇన్ని సాంకేతిక మాద్యమాల్లో మనమెంత దగ్గరున్నా ఇవన్నీ ఇవ్వలేని ఆనందం, ఉత్తరం మోసుకొస్తుంది. ఈ ఎండాకాలానికి నాకదే తడవాలనుకొనే ఇష్టమైన తుంపర. అన్నీ తెలిసినా నాతో చెప్పించాలని చూస్తావు కదూ, అదో అనిర్వచనీయ భావన. అందమనేది ఆకర్షణలో ఉండదని నీకు తెలుసు కనుకనే నన్ను నలుగురిలా కాక విడదీసి చూసావ్. ఆ అతిశయమంతా నీ అక్షరంలో ఎప్పుడో అంది పుచ్చుకున్నా. లాంఛనాలతో సంబంధంలేని అనురాగం కనుకనే నేనూ కరిగిపోతుంటా. అదేదో పాటలో... 'రాధా బాధితుడ్నిగా..ప్రేమారాధితుడ్నిగా' అనగానే అదేపనిగా నవ్వుకుంటా, నువ్వే నాకోసం పాడినట్టు.

విరహం విరచించగలిగేంత తేలిక కాదు కనుకనే అందరికీ అర్ధమవదు.  నీ హృదయం మెత్తదనమంతా ఆ చెక్కిళ్ళు తాకితేనే తెలిసిపోతుంది అంటావ్ కదా.. ఇది గుర్తొచ్చినప్పుడు కురిసే కన్నీటికే తెలుసు విరహమంటే. అప్పుడప్పుడూ   అరచేతుల్లో చేరి పసిబుగ్గలంటూ నువ్విచ్చే అరుదైన ముద్దులు అందుకోలేకపోవడం నాకు విరహమేనంటే ఎవరికైనా ఏం తెలుస్తుంది. అయినా శూన్యంలో ఉంటూ నిన్నే పలవరించే పంచేంద్రియాలను బుజ్జగించడం ఎంత కష్టమో తెలుసా. ప్రతి ఆకు కదలికలకీ..పువ్వు గుసగుసలకీ నిన్నే వెతికే మనసు వియోగభారం నీకు తెలుసు కదా..

మనిషి కోసం ఆరాటపడే వ్యసనమందరికీ అబ్బదు. శిఖరంలా ఉంటూ సముద్రమంత లోతు ఆలోచిస్తావని  నాకైతే తెలుసు కదా. అందుకే ఎవ్వరికేమైనా నీ మనసు నవనీతమైపోతుంది. 
నీ ఉత్సాహమూ అవ్యక్తమూ తెలిసిన ఎవ్వరికైనా   నీపై ఇష్టం కలగకుండా పోతుందాని సందేహమొస్తుంది. 
సరిగ్గా చెప్పావు.. మబ్బుల్నీ ఆకాశాన్ని చూసి మురిసిపోవడం పిల్లలకీ, ప్రేమికులకే సాధ్యం. కంటికి కనబడని లోకాల వెంట తిరిగే వారికి లాక్ డౌంతో సంబంధం ఏముంటుంది కనుక. గతానికీ భవిష్యత్తుకీ వంతెన వేస్తూ వర్తమానాన్ని ఊహల్లో గడిపేసేవారి పనే బాగుంటుంది. నిజానికి తీర్చలేని లోకం సమస్యలు తలకెత్తుకొని లేనిపోని ఒత్తిడి తెచ్చుకొనే కంటే ఇదే బహు సుఖమనిపిస్తుంది. 

మనసు దానిపని అది చేసుకుపోతున్నప్పుడు నీకు హాని కలగనంత వరకూ తప్పు ప్రసక్తి ఏముంటుంది. నిజానికి పైకి నీచమైన పన్లు చేస్తూ సమర్ధించుకొనేవారు ఎందరో లోపల ఒకటి పెట్టుకొని బయటికి నటించే పాత్రధారులే ఎక్కువీ జీవితమనే నాటకంలో. మనసు తనకుగా పొందిన ఆనందాన్ని దానికి కారణమైనవారిని ప్రత్యేకదృష్టితో చూస్తే తప్పేముంది. అదే తప్పనిపిస్తే ఆ విషయం నాతో పంచుకొనే సాహసం చేయవనీ తెలుసు. 

స్త్రీ అనగానే మగవారికి ఆకర్షణ పుట్టడం సహజమే అయినా, అందరిపట్లా ఉప్పొంగని హృదయం ఒకరిని చూసీ చూడగానే విప్పారి పరిమళిస్తుంది. వారి తలపులో తొలకరి జల్లుకి తడిచిన మట్టిలా పరవశించడం ప్రకృతిధర్మం. అంతులేని తపనతో ఆవిరయ్యే నీటికి తెలుస్తుంది, ఆ తరువాత కురవబోయే పన్నీటిజల్లుల రహస్యం. శరీరానికతీతంగా ప్రేమ ఎదిగాక ఆత్మకి మలినం అంటుతుందేమో తెలీదు. 

నీ మాట మల్లెతీగలా నన్ను పెనవేసినప్పుడు నా పాట పంచామృతమై నీకు తీపి పంచడంలో వింతేముంది. అరుదైన ఈ వ్యాపకముండబట్టే ఇన్నాళ్ళూ లోకానికి దూరంగా బ్రతకగలుగుతున్నా. మధురమనోహర హృదయావేశం తెలిసినవారికి, మంచితనం..మొండితనం అలంకారమవుతాయి తప్ప ప్రదర్శించేంత అవకాశాన్ని వెతుక్కోవని నా విశ్వాసం.

అయినా నన్ను కలవడం యాదృచ్ఛికమనిపిస్తుందా. అదేమో కాలం కదులుతున్న కంగారులో మనల్ని కలపడం ఆలశ్యం చేసిందని నేననుకున్నా. ఇప్పటికి అన్నిటికీ అతీతమైన పేరులేని బంధముందని ఒప్పుకున్నాక, అమ్మనో, అక్కనో, ప్రేయసినో కాకుంటే పోయేదేముందని. ఆత్మబంధువులు అవుతామో లేదో తెలీకున్నా ఆప్తులుగా అయ్యామని తెలిసినప్పుడు క్షణాల విలువ పెరిగిపోతుంది. ఇప్పటికి నీ లాలిత్యపు కళ్ళే ప్రతి ఉదయం నాకు ప్రాణం పోస్తాయని నమ్ముతున్నా. ఏ జీవితకాలంలో చేసిన తపస్సో ఊహకందని సూక్ష్మంలా వాస్తవమైందనుకుంటాను. మనోలోకమంతా విస్తరించిన నన్ను మోసేంత వివశత్వం నీకున్నప్పుడు నిన్నిడిచి నేనెటూ పోను. ఎదలొక్కటైన బృందావనం నీ సమక్షమేనని సశేషమవుతాను..💜💕  

// నీ కోసం 143 //

నా కన్నుల వెన్నెల్లో విశ్రాంతి తీసుకుంటున్న
నీ దేహాన్ని చూసావా..

కొంచం చోటివ్వగానే..కలలోంచీ నువ్వు నడిచొచ్చినట్లు..
ఇప్పుడు నీ చిరునామా నేనైపోయా గమనించు..

నరాల్లోకి అనుభవానికొచ్చిన సంగీతానికేమో
రేయింబవళ్ళూ నిన్నే సాధన చేస్తూ నేనలసిపోతున్నా చూడు..

నీ మనసులోని లోతైన ఆకర్షణ..నా మౌనంలో ఇంకినందుకే
ఓ అలౌకిక రసనావస్థలో తేలిపోతున్నా గామోసు..
ప్రేమాన్వీ...
భావోద్వేగాల వాకిలిని మూసేస్తున్నా నేనందుకే
ఈ అపురూప పరివేదన దాచేసుకుందామనే..😊💜 

// నీ కోసం 142 //

అదే నిష్క్రమణ..అదే నిశ్శబ్దం
అప్పటిదాకా నవ్వుతున్నట్టే ఉంటాను
నా పెదవులు ముడేసుకున్న విషయం ఎవ్వరికీ తెలీదు

సగమైన కన్నులు ఏం చూస్తుంటాయో
గుండెల్లో మోగుతున్న సవ్వడికి
మన మధ్య దూరం తరిగినట్టనిపిస్తుంది

నీ చేతిలో నా చెక్కిళ్ళు
గుట్టుగా ఒదిగిపోయిన సంగతి
కలో నిజమో తెలీక తడబడతాను

ముద్దుపుట్టే నీ మాటలు వింటూ
నేనూపిరి తీసిన ప్రతిసారీ
అదో ధ్యానంలో ఉన్నట్టు మురిసిపోతాను

చిగురించిన క్షణాలకు నిలకడ ప్రసాదించమని
సంకల్పించుకున్న శూన్యంలో
నీ  ప్రేమ మాత్రమే ప్రతిధ్వనించాలనుకుంటాను..💕💜