Sunday, 26 February 2023

// నీ కోసం 512//

వెన్నెలనీ చీకటనీ తెలియని నా కురుల్లో చిక్కుకున్న చందమామ సగమైనట్టుందని చెప్తున్నావ్.. ఇదంతా ఎప్పుడు గమనించావ్.. ?! అవున్లే.. తీరిక లేదంటూనే మెడ ఒంపుల్లో గిలిగింతలు పెట్టడం నీకు మాత్రమే తెలుసు మళ్ళీ మళ్ళీ తాకుతున్న నీ చూపుల చంచలత్వానికేమో, ఆలోచనలంటూ లేని నా ఎదలో ఓ ప్రేమభావనవుతుందంటే తలొంచుకుని నవ్వుతావ్..! హా.. ఎర్రబడ్డ నీ పెదవంచు తాపం, వసంతానికి వేళయినట్టు చెప్పాలనేగా ఈ చమత్కారం.. ఓయ్.. కుంకుమరంగులో కలం ముంచి విరహాన్ని విరచిస్తున్నాననుకోకు.. నిజంగా, నాతో నువ్వున్నట్టు నీతో మాట్లాడుకోడం, నిద్రనాపుకుని మరీ అనుభూతించడంలో హాయి ఇంకెక్కడుందో నాకు తెలీదు " U already know that weird is just a side effect of being Awesome.. n that's why u act weird all d time I feel "

// నీ కోసం 511//

ఇంత గోరువెచ్చగా నవ్వడం నీకెవరు నేర్పారూ..?! నీ చూపులతో నా పెదవుల ఎర్రదనం చెరిపేయొచ్చని నీకెలా తెలుసూ..?! నిశ్శబ్దం తలుపు తీసి నిరంతరం నిన్నే ధ్యానించమంటుందెందుకూ..?! నీ కన్నుల్లో ఒలుకుతున్న ప్రేమరసం నన్ను తడుపుతుందెందుకూ..?! నా గాజుల గలగలల్లో నీ గుసగుసల రహస్యాలున్నాయని నాకెందుకు చెప్పలేదూ..?! చీకటని చూడకుండా గుప్పుమంటున్న ఈ మల్లెపూల వాసన చిరాకేస్తుందెందుకూ..?! అసలూ.. అర్ధరాత్రయినా మనసుకెక్కి దిగకుండా నిద్రపోనివ్వని నిన్నేమననూ..?!

// నీ కోసం 510//

నీ గుండెగదిలోకి తొంగిచూసి చానాళ్ళయింది మౌనం ఘనీభవించి భావావేశాలు బరువయ్యాక మాటల శబ్దం సద్దుమణిగింది కదా హృదయాన్నావరించిన దిగులు మేఘమేదో చడీచప్పుడు లేక విషాదాన్ని నిట్టూర్చుతూ దీర్ఘరాత్రుల అలుపుని పెంచుతుంది తెలుసుగా.. Pch.. నా కనురెప్పల పడవల్లో నిన్ను సేదతీర్చి అలౌకిక తీరాలకు చేరేలోపు ఆపుకోలేని మత్తు ఆవహిస్తుంటుంది అయినా.. ఇంత తీపి బాధ కలిగి ఎన్నాళ్ళయింది.. శరత్కాలమంటే మబ్బు తొలగిన రాత్రుళ్ళు మనసంతా వెన్నెల చిరునవ్వుతున్న అల్లర్లు కదా ఏమో.. కవిత్వంతో కబుర్లాపి చాలా కాలమయినా నీలోంచీ నన్ను తీసే విశాలత్వం ఏ వాక్యానికి లేదని తెలిసిపోయింది Ofcourse agreed.. Sometimes u have to forget what u feel to remember what u deserve

// నీ కోసం 509//

1. ఒక్కోరోజు పగలు ముగియకుండానే వానపడుతూ సగం సగం జ్ఞాపకాల వరదలో నన్ను ముంచి తేల్చుతుంది 2. అంతులేని విచారానికి భాషలేక భావాన్ని దరిచేరని వాక్యంలా ఆదమరచిన అంతరాత్మనై వణుకుతున్నానేమో.. మిణుగురులై మెరిసే నీ కళ్ళు చీకటి నిండిన నా ఏకాంతాన్ని వెలిగించి కాసేపలా వెచ్చదనాన్నీ వెదజల్లుతాయి 3. నిశ్శబ్దంతో రాజీపడి హృదయాన్ని అన్ని రాగాలకూ దూరం చేసినా నీ పాట కోసం కలల్లోనూ తపనపడుతున్నానని తలపోసానేమో.. ఆకుల్లో సంగీతం వినబడుతున్న ఆనందం ఇన్నాళ్ళకు తెలుస్తుంది ప్రేమాన్వీ.. నన్ను తలచుకుని నువ్వేమైనా చిరునవ్వు చిందావా

// నీ కోసం 508//

ఎలానూ నా తనివి తీరేది కాదని నువ్వసలే కనిపించవా.. నేనేమో సంధ్య ఎరుపుని విరహాగ్నితోనున్న నీ మోములా తలపోసుకుంటున్నా.. ఈ చలికాలపు దీర్ఘరాత్రులు అనురాగం కరువైనందుకే మరి కలలోనైనా తదేకంగా నిన్ను చూసేందుకు నిదురను కప్పుకుంటుంది కన్ను.. శూన్యమైన నా హృదయానికి చిరుచెమటలేంటని నవ్వుకుంటావ్ గానీ నీకైన ఎదురుచూపుల్లో గుమ్మానిక్కట్టిన తోరణంలా వాడిపోతున్నానని తెలియనిదా.. ఓహ్హ్.. తామరాకు మీద నీటిబొట్టులా నువ్వెంత నిదానమో U r at ur best to make me mad

// నీ కోసం 507//

శరన్మేఘం మాటుమణిగిన అద్భుతమంటి నిరాడంబర భావావేశం నీ ప్రేమార్పిత నిశ్వాసతాపం అందువలనే.. దిగులు చుట్టుకున్న అంతరాత్మబాధ ఉండుండీ గుచ్చుతున్నప్పుడు నన్ను నేను సంతోషపెట్టుకునే క్రమంలో నీవైపుకి తొంగిచూస్తాను నిజం.. నాలో సమస్తాన్ని వెలిగించే ఆ చిరునవ్వే నిశ్శబ్దంగా నువ్వు చేసే ప్రాణదానం

// నీ కోసం 506//

ఈ రాత్రి.. చిందరవందరగా చలిగాలి పొగమంచుగా అలుముకుని మసకచీకటిని మరింత ఆవిరిపట్టించింది హేమంతమింకా మొదలవకుండానే గుండెకు తడబాటు ఎక్కువై తీపి నీ జ్ఞాపకాల కోసమని అదేపనిగా సుషుప్తిలోకి జారిపోతుంది గాఢమైన నా నిరీక్షణలో నీ తలపుల ప్రేమగీతిక స్వరజతుల పులకరింపులా తమకంతో నన్నూయలూపుతుంది నీ ఉనికి ఉప్పొంగినప్పుడంతా మోహాల తీరం వెంబడి మనసు అసంకల్పిత భావనా ప్రపంచాన్ని చేరి కాలంతో కరుగుతూ సోలిపోతుంది అమ్మూ.. కనీకనిపించని పగటి చంద్రికలా ఎందుకలా వెంటాడుతావ్ నన్ను

Saturday, 25 February 2023

//నీ కోసం 505//

కలలో విరహించీ విహరించీ విడిపోయి ఓ కొత్త కావ్యంలా కలగలిసే ఊహలన్నీ నీ జ్ఞాపకాల పొగడదండలేనా మనసొక్కసారి మధురానగరిగా మారిపోయిందంటే మలయమారుతానికి గంధం కలిపి ఇటువైపు పంపించింది నువ్వేనా నా అంతర్వాణి పలవరిస్తున్న వెచ్చని ప్రేమకెరటంలాంటి మృదుస్పర్శ నీ కనురెప్పల సీతాకోకచిలుకలదేనా పగలో రేయో గుర్తుకురాని ఈ క్షణాల మోహరింపు తీయని నీ మనస్సంగమ ఉప్పెనలోని మైకమేనా ప్రేమాన్వీ.. సున్నితమనిపిస్తూనే విదితమవని నీ మిధ్యాభావం లాలిత్యమైన ఈ సాన్నిహిత్యమేమో నాకదో మానసికారాధనం U r like a winter evening n I will b a poet with ur language of love

//నీ కోసం 504//

ఇప్పుడెలా ఉన్నానో చెప్పాలి ఊహకందని ఓ తన్మయావస్థలో అత్తరుమత్తుని ఆవహించిన సన్నజాజి కొమ్మలా ఊగుతున్నా నీ గుండెల్లో దాగి ఉన్న తహతహలు రంగురంగులుగా నాపై చల్లినట్టు చిరునవ్వులనే గొంతెత్తి పాడుతున్నా చానాళ్ళుగా చుట్టూ ప్రవహిస్తున్న శూన్యం కలతల్ని దాటి విస్తుపోయేలా నీ ముద్దుమాటలతో నింపుతున్నా మెత్తగా కలల్ని దోచుకుపోయే నీ చూపులు అస్తవ్యస్తపు అలలై నన్ను తడిపినట్టు ఊపిరందని బిడియమై పులకిస్తున్నా I think ur majic started already

//నీ కోసం 503//

వరిచేలతో పోటీగా ఉన్న అందమది ఏం వారసత్వమో.. పచ్చపచ్చగా ఉన్న నిన్ను చూస్తూ ఆ ఒంటి సువాసనలూహిస్తుంటే వలపు వేడి సెగలుగా మారి నిదురకు నన్ను దూరం చేస్తుంది వసంతకాలం ముందే వచ్చింది విరహగీతాల్ని ఆపమనేమో.. మంచిరోజు చూసుకు మరీ మదిలోని పులకరింతలు బయటపడుతుంటే చెక్కిలి మీది చిరుచెమటలు చీకటిలోనూ మెరుస్తున్నవనేం చెప్పనూ..

//నీ కోసం 502//

గుండెప్రమిదలో వెలిగే దీపంలా మౌనంగా నువ్వుంటూ పెట్టే తీయటి శాపం నీకేమైనా తెలుసా.. Ofcourse.. u feed my senses with ur silence as if u r somewher inside me.. బరువెక్కిస్తున్న చలిగాలి స్పర్శకి మునిపంట నే దాచుకున్న అలజడి నీ విరహాన్ని ఎగదోస్తుందని తెలుసా.. Hmm.. u r like a haunting song that struck in my head all d time.. ఆకులు రాలే కాలం మాటలకి దొరక్క కలల్ని మిగిల్చే అద్భుతమైన కళ్ళు నీకున్నవనైనా తెలుసా.. Yeah.. thre s a whirlpool in your eyes constantly pulling me towards u.. ఉన్నట్టుండి నాలోంచీ నన్ను తప్పించే ఆ నవ్వు పట్టుతప్పి నువ్వు పారేసుకున్నదేనని ఏకాంతం తట్టినప్పుడైనా తెలిసిందా.. Really.. u smile like a full moon n i feel that majic every now..

//నీ కోసం 501//

శిశిరం చేస్తున్న చప్పుళ్ళలో ఏ రాగం వినబడిందో మాఘమాసం పులకరిస్తూంది పున్నమినాటి వెన్నెల వాసనేమో కాసేపైనా నిట్టూర్పులనాపి ఆదమరపుకి రమ్మంటుంది వెలుతురుచ్ఛాయల్లో నీ మౌన నిశ్చలత్వమేదో నా ఏకాంతవాసపు చంద్రోదయానికి మాటలకందని నిర్మోహత్వమౌతుంది ఓహ్హ్.. చెదిరిన చీకట్లలో ప్రేమరసం అమృతాన్ని పొంగించినందుకు తడియారని చూపుల్లో చిరునవ్వు కిలకిలవుతుంది

//నీ కోసం 500//

ఎవరీ చక్కనివాడు.. ఎంతకీ చిక్కనివాడు పగలంతా పక్కనే ఉండి.. రాత్రైతే రెప్పలచాటుకెళ్తాడు నవరసాల నవ్వుల్తో పిల్లంగోవి లేకపోయినా ఆ నల్లనయ్యని తలపిస్తాడు వెయ్యి జలపాతాల వేగాన్ని తలపిస్తూ వెక్కిళ్ళు పుట్టిస్తుంటాడు పచ్చిమిర్చిబజ్జీలా పొగరుగా ఉంటూ పంచదార చిలకలా సిగ్గుపడతాడు తనువూపే రహస్యం తెలీదంటూనే పన్నీటి రాగడోలల్లో తేలిస్తాడు చూస్తూ చూస్తూ ఊపిరాగిపోతేనేం కోరగా కన్నుగీటి ప్రాణం పోసేట్టుంటాడు నిజంగా.. ఆదమరవని ఆనందాల మైకం వాడు విస్మరించ వీలులేని తీయనివిరహం వాడు

//నీ కోసం 499//

ఈ సాయింత్రం.. మన ఆత్మల బృందావనంలో కొన్ని కోయిలలు స్వరవిహారం చేస్తున్నాయ్ మరైతే శిశిరమింక సవ్వడినాపేసినట్టేనా..?! గుండెను గుప్పిట్లో దాచి చేస్తున్న ధ్యానానికేమో కలలు కొన్ని కస్తూరి వాసనేస్తూ పరిమళిస్తున్నాయ్ మదిలో మౌనవిస్తున్న అనుభూతుల తరంగానికేనా..?! నిన్న మొన్నటి గాయాల నవ్వుకి ఆకుచాటు మందారపు వెన్న పూసి గాలిలా గుసగుసలాడుతున్నది నువ్వేనా..?! ఏకాంతం చిత్రించుకున్న నీలం రంగు ఆకాశానిదో, నా అవ్యక్తానిదో ఈ అనంతం నీమీద బెంగనే వల్లెవేస్తుంది Haa.. everything became kind suddenly N it feels like m on d top of my fav cloud