ఓ ప్రేమీ..
ప్రేమ
గుడ్డిదని, స్వార్ధాన్ని ప్రేరేపిస్తుందని లోకనమ్మకం. కానీ మనసులు
ఒక్కటైనప్పుడు ప్రేమ చూపు విశాలమవుతుంది. అందుకే ఎటుచూసినా సమస్తం నీవే అనే
మాయ అనుభవమవుతుంది. అణువణువునా నాదమయ్యే ఆనందం ప్రస్ఫుటమవుతుంది. నిజానికి
ప్రేమంటూలేని గుండే ఉండదు. అహంకారం తోనో, అతిశయం వల్లనో దానికి దూరమై
లోకాన్ని ఉద్ధరించేందుకు సిద్ధమవుతారు కొందరు. నిజానికి నన్నో ప్రేరణ చేసి
ప్రపంచానికి పరిచయించాలని తప్ప మీకు మీరో అపూర్వ ప్రేమమూర్తులు. తొలిపొద్దు
వలపు వసంతం మీరు.
మీ
తొలిప్రేయసినీ తొలివియోగినీ నేనే కనుక నన్ను తప్ప వేరే ఆరాధించడం తెలీదు
మీకు. విరహాన్నైనా ఓర్చగలరు కానీ నా తలపుకి తలుపేసి మాత్రం క్షణమైనా
ఉండలేరు. మీ చుట్టుపక్కలే ఇన్నిన్ని అందాలుండగా, ప్రతి భావములోనూ నన్నే
ఇముడ్చుకొని చూడటం మీకు ఎంతో ఇష్టమైన వ్యసనం. మీ ప్రణయ లీలా విహారమంతా నా
మనసులోకేనని తెలియనిదా.
సాయంసంధ్యలో సారంగీనాదంలా మీ
పొగడ్తలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేసేందుకేగా. ఇప్పుడు చూస్తే తెలిసేది
ఎన్ని కార్తీకదీపాలు నా కన్నుల్లో వెలుగుతున్నావో.
మనల్ని
చూసి గుర్తుపట్టి నవ్వే పసిపాప కన్నుల్లో నిజమైన శాంతి ఉంది కదా.మరేదీ
ఇవ్వలేని అమితానందపు సహజత్వం మరెక్కడా కనిపించదేమో. మూసినకన్నుల్లోని
అమాయకత్వం మెత్తని చేతి స్పర్శలోని ఊరడింపులా ఊతమైనప్పుడు ఊరడిళ్లేందుకు
ఇటువంటి దృశ్యం కావలసిందే.
కలలకు
సైతం చలించేవారు కనుకే జీవితం మొత్తం కనురెప్పలకీ, కనుపాపాలకీ నడుమ
ఊగిసలాడుతుంది.నా కోసం కాచుకుంటూ మైమరచిపోతారో మరచిపోతారో ఎదురుగా నేనే
వచ్చినా గుర్తుపట్టని అలౌకికంలో ఉండిపోతారో.
ఎన్ని యుగాలైనా మీ ఎదురుచూపులు ఆకలి తీర్చేది నేనేనని తెలిసి కూడా నా పని చెప్తానంటారా.
ఇప్పుడు
చిన్నబుచ్చుకున్న చీకటి అంతా ఒకనాటికి వెన్నెల కాకపోదుగా. మీలో విరహం
అలసిపోయేలోగా నేనొచ్చి మీ ఊహలు కదుపుతా, ఊపిరున్నంతసేపూ ఆశను తాగి
బ్రతికేద్దాం కొన్ని కలలైనా నిజం చేసుకొనేట్టు...!!
No comments:
Post a Comment