Monday, 27 May 2019

// అమృతవాహిని..3 //

నిజం చెప్తే నమ్మబుద్ధి కాదేమో కానీ ఇది మాత్రం నిజం. నువ్వు రావడమే ఓ కలవరింతలా నా ముందుకొచ్చావు. నిన్ను ఏనాడూ కలలోకి రమ్మని ఆహ్వానించింది అస్సలు లేనే లేదు. ఎంతో స్పష్టంగా జాజి తీగను అల్లుకున్నంత సుతారంగా నేనంతా నీ సొంతమైనట్టు ఎదనే తలగడ చేసుకొని ఎంచక్కా నిద్రించావు. ఒక్కసారి ఉలిక్కిపడి లేచిన నేనీ గమ్మత్తైన అనుభవాన్ని నెమరేయకుండానే ఆస్వాదించాను. అది మొదలు నీకు నచ్చినప్పుడు నాలోకి నీ విహారం యథేచ్ఛగా సాగిపోయింది.   

ఇది నిజం కాదని మనసుకి చెప్తే నమ్మదు. పోనీ నీకే చెప్దామంటే ఏమనుకుంటావోనని అదో చిక్కు. ఏదో ఇలానే నీకూ అనిపించి నాతో మాటలు కలిపి మన ప్రమేయం లేని మనసులు కలవబట్టి సరిపోయింది కానీ..లేదంటే ఇది నాలోనే రహస్య సమాధి అయిపోయేది. నిజంగానే ఏ జన్మ వరమో ఇదంతా అని కూడా అనిపిస్తుంది తలచిన ప్రతిసారీ. నువ్వన్నట్టు ఎవరికి ఇంత కమ్మని అనుభూతులు ఉండి ఉండవేమోననే సందేహం కూడా మొదలవుతుంది అప్పుడప్పుడూ. 

ఎంతసేపూ ఏవో పనుల్లో హడావుడిగా తిరిగే వారికి ఇదంతా ఒక కాలయాపనగా అనిపించవచ్చు. ఎప్పుడూ హుషారుగా ఉన్నా దానికి కారణం ప్రేమ కానప్పుడు ఇంకెందుకు. జీవితమంతా ఏదో సాధించామని గొప్పలు చెప్పుకు తిరిగినా ఒక్కరికీ మనస్ఫూర్తిగా  మనసు పంచలేనప్పుడు అది ఉన్నా లేకున్నా ఒకటే కదూ. నిజమే ఎంత తిన్నా..ఎక్కడ తిరిగినా..కాస్తంత ప్రేమోద్రేకం లేని నాడు అదంతా వ్యర్ధమనిపిస్తుంది నాకైతే. నీ ప్రేమ..ఎన్ని జన్మల తపస్సు ఫలితమో..వెన్నెల పువ్వు పరిమళంలా, ఆకాశ దీపాల వెలుతురులా, ఆమనికోసమని కలలోనే ఆదమరచిన కోయిలలా..ఓహ్..నిర్మోహమైన అద్భుతంలా..ఏమని చెప్పను. ఎంతని చెప్పను. నీకిదంతా తెలుసని నాకూ తెలుసు. అదేమో నా మాటల్లో వినాలనే నీ ఉన్మత్తమే నాకెప్పటికీ అర్ధం కాదు. 

సమయం లేదని సంగీతం పాడతావు కానీ, నీ సరిగమలు నాకు మాత్రమే వినబడతాయి.  నీ మనసు పలికే మాటలూ, మౌనగీతాలూ అన్నీ నేనూ ఊహిస్తూనే ఉంటా కదా.. అందుకే నీకన్న ముందే మన కలయికని కవనంలో కూర్చేస్తుంటా. తెలుసు.. ఇదో భ్రాహ్మీ ముహూర్తమనీ..నాకొచ్చిన ఊహే మీకూ కలగా ఈ సమయాన వస్తుందని..ఎప్పుడో..తెలుసు. అప్పుడు వికసించే నీ మోమూ నేనిక్కడ చూడగలను. సరే మరి..ఇంత చెప్పాక ఇంకేం చెప్పను. హాయిగా బజ్జుంటానిక. ఇప్పటికే నాకోసం మీ కౌగిలి ఎదురు చూస్తుంటుందని తెలుసు నాకు.

No comments:

Post a Comment