సంధ్యారాగం మాహద్భుతమై వెలుతురు పంచుతున్న వేళ, కొన్ని మెరుపు తీగలొచ్చి నిన్నూ నన్నూ వెంటాడి బంగారమంటి కిరణాలు తాపి ప్రకృతిలో మనమూ మమేకమయ్యున్నామని చెప్పకనే చెప్పాయి. మన చూపులు కలిసి వెలిగించుకున్న దివ్వెలు చూసి అక్కడి మంకెనపూలూ, పగడపూలూ, మోదుగపూలూ, కుంకుమపూలూ సర్వం కలిసి మరింత ఎర్రగా నవ్వుకున్నాయి గుర్తుందా..
చిన్న చిన్న కొండచరియల నడుమ పొందికైన పొదరిళ్ళు. అప్పుడప్పుడే వసంతాన్ని విరబూసుకు పూస్తున్న లేచివుళ్ళు, వేసవి గాలి నెమ్మదించి మెలమెల్లగా చల్లనవుతున్న చిరుగాలులు, ప్రశాంతతను పూసుకొని తపస్సు చేస్తున్నట్టి మనోహర దృశ్యాలు కదా ఎటు చూసినా..రెల్లు దుబ్బుల సొగసులకు తోడు మదిలో రహస్య రాగానికి మనోజ్ఞమైన రసజ్ఞత కూడి పరవశాల జల్లులో తడిచింది నిజమే కదా..
కరిగిపోయిన ఝాము చిక్కగా మారి, చెంగలువలు విచ్చుకొని రేయికి స్వాగతం పలికినప్పుడు నక్షత్రాలు ఉదయించి దిక్కులన్నీ వెన్నెలను కప్పుకోలేదూ..కారుమబ్బులన్నీ యమునా జలం తాగి నల్లబడ్డట్టు కస్తూరి పూసుకున్న వివశత్వాన్ని ప్రదర్శించలేదూ.
ఇన్నాళ్ళూ విరహించబడ్డ మనసులు ఎదురుపడి మౌనాన్ని తరిమిన మాటల్లో కలభాషణల తడబాటు నునుసిగ్గుల స్వరాలుగా మారి శ్రీరాగమొకటి మొదలై ఏకాంతాన్ని మచ్చిక చేసుకున్నపుడేగా తెలిసింది, లయ తప్పుతున్న హృదయాలు ముద్దుతో ఏకమయ్యేందుకు సిద్ధపడ్డాయని. మధురధ్వనిగా మొదలై మువ్వల రవళిగా ముగిసిన మురిపెం గుర్తుకొచ్చిందా.
పొద్దుకుంగినప్పుడల్లా నీ ఎడబాటు కల్పిస్తున్న సంచలనానికే నన్ను వీడిపోయిన నవ్వు, నీకు చేరువై మగతలో ఉంచుతున్న నిద్దుర స్పర్శ. కావాలంటే రేపొకసారి గమనించు. నువ్వొక్కసారి తాగిన అధరామృతమే ప్రతిరేయీ నెమరేస్తున్నందున నీకీ ఇష్టమైన మత్తు. నీకోసం కవనమల్లేందుకు నేనుండగా నీకెందుకీ ప్రకంపనం. నువ్వందుకే కలలు కంటూ తొలిపొద్దు విహారానికి సిద్ధపడు, నీకోసం ప్రణయ పల్లకిలో నే వేచి ఉంటా అప్పటివరకూ..
No comments:
Post a Comment