Monday, 27 May 2019

//నీ కోసం 5//

మన్నించవా..
అడగరానిది అడిగినందుకు..
మనసు తెలిసిన నేను అనుకోకుండా కుదుపినట్టు
నా ఎదనే ఒడిచేసి నువ్వు నిద్రించి తెలుసుకున్న మెత్తదనం
తిరిగి నీ పెదవులతో నా కనులకి అద్దినప్పుడు తెలుసుకోలేకపోయానా
ఇంత చక్కని కవిత ఏ ప్రేమికుడు రాయగలడాని..

నీ ఊపిరి వలయంగా చేసి
నడివేసవిలో నన్ను చల్లగా చూసినప్పుడు
నువ్వు నాపై ప్రసరించిన హాయిని అనుభూతించాను
తొలివేకువ వెన్నెలగా..రేయైతే మైమరపుగా
నాతో కలిసి తిరుగుతున్న పరవశాన్ని ఎలా విస్మరించాను
సుకుమారమైన పువ్వులా నా పేరు పలికే
ఆ ఆర్తిని అనుభవిస్తూనే ఉన్నా ఇంకా ఏమి వెతికాను

నిర్జీవమైన రోజులన్నీ నీ సంతకంతో 
శ్వాస తీసుకొని ఆమనిని ఆస్వాదించడం మొదలెట్టాయి కదా
నిట్టూర్పు రాగమింకెప్పుడూ వినిపించను
నువ్వెక్కడున్నా ఆలకించే సంగీతం మనదైనందుకు
అందుకే..మరోసారి మనస్ఫూర్తిగా మన్నించవూ.. 


No comments:

Post a Comment