Monday, 27 May 2019

//నీ కోసం 6//

ఎన్ని రోజులు భయపడ్డాను నిన్ను అందుకోవడానికి
చానాళ్ళు స్వప్నలోక సంచారిగానే మిగిలిన తర్వాతనే కదా
నా మదిలో నువ్వు చేస్తున్న అలికిడి నీకు వినబడింది
అదంతా నిజమో.. కలో..అబద్దమో తెలిసేలోగా
నిజం చేద్దామని అంత దూరం నుంచి చేయందించింది నువ్వు కాదా
ఎన్నెన్నో ఉద్వేగాలు చిలికి మనమధ్య ప్రేమ పుట్టిందని
ఆ అమృతం మనకే సొంతమని తాగేసాం కదా
ఇప్పుడేదో అర్ధంలేని పొరపాటుకి సమాధానం వెతకడం దేనికి
నీతో నడిచిన ప్రతిదారిలో సంతోషపు మొగ్గలే తప్ప
ఘనీభవించిన ఒక్క శిలనీ చూడలేదుగా నేనైతే
కేవల మాత్రపు ఆకర్షణ కాదుగా మనది 
మాటలున్న చోట మౌనమెందుకు ప్రవహించాలసలు
తోచని క్షణమెల్లా అనుభూతిగా నా వెంటొచ్చి
కాస్త ఆదమరుపుకే నన్నలిగి నిష్క్రమిస్త్తానంటావా
ఎదురుచూసేందుకు ఈ కన్నుల్లో జీవం లేదిప్పుడు
మనసాగిన చోటే నిలబడిపోవాలి నేనన్నది నీకు వినబడనప్పుడు 

No comments:

Post a Comment