Friday, 24 May 2019

// అమృతవాహిని..2//

మరపురాని నువ్వు జ్ఞాపకమై నన్ను మేల్కొలిపేందుకు అసలు నే నిద్రించింది ఎప్పుడని. లోకమంతా కనుమూసినవేళ నడుమలా వాల్చగానే కాసేపట్లా కన్నుల ముందుకొచ్చి అదో ఆర్తిగా తొంగిచూస్తావు. తత్తరపడి రెప్పలార్చగానే చిరునవ్వినట్టనిపిస్తావు. మనిద్దరికీ ఇష్టమైన పాట వింటూ అలా కన్నులు మూయగానే నా తన్మయత్వాన్ని తాకేందుకన్నట్టు ఎదనే ఒడిగా చేసుకుంటూ తలవాల్చుతావు. ఆ వివశత్వం ఈజన్మది కాదేమో అన్నంత మాయ మూగినట్టు పదేపదే కన్నులు తెరిచి నిన్ను తడుముకుంటాను. ఈ కలవరింతలో నేనుండగానే వేకువ కావడం. అప్పటికీ లేవగలనా అంటే..ఊహూ..తలెత్తి ప్రేమ  కురిపించినట్లనిపించే ఆ కళ్ళు లోపలేదో ఆరాతెస్తూ పట్టి ఉంచుతాయి.నిత్యమిదే జరుగుతున్నా రాత్రైతే బాగుండన్న ఆశ మాత్రం వీడిపోదు. విరహం మధురమన్న భావన కోసమనుకుంటా నీ ఊహ నన్నిలా ఊపుతుంది. 

మనసంతా తీరంలా నే వేచి ఉన్నట్టు అలలా నువ్వు ఉన్మత్తం కానిదెప్పుడని.ప్రేమపాటలు మాత్రమే పల్లవించే నీ మది మైకంలో పడి గమకాలు తీస్తుందంటే ఆశ్చర్యమేముంది.  క్షణానికో తీరుమారే లోకానికిదంతా విశదపరిచేంత అవసరముందని అనుకొనేదేముంది. ఎన్నెన్నో వర్ణాలుగా వికసించే ప్రేమ ఎన్నోరకాలుగా ఉంటుందని తెలుసు.అది ఎదుటివారి బాంధవ్యాన్ని బట్టి అలా వ్యక్తమవుతుంది.తండ్రికీ..అన్నదమ్ములకీ..పుత్రునికీ పంచబడని ప్రేమ ఒకటుంటుంది. దాని పరిమళం వీటికన్నిటికీ భిన్నంగా ఒక్కరికే పంచడముంటుంది.పదేపదే నీతోనే ప్రేమలోపడ్డ అనుభవాన్ని అడిగితేకదా ఆ వివరాలు తెలిసేది. ఒక్కచేష్ట ద్వారానన్నా నీకది నే చేర్చగలిగితే ఉన్న కాస్త అసంతృప్తినీ అధిగమించగలవు. మనసు తీపి తాగేసి అధరపు రుచి మారిందని వదిలేసే తుమ్మెదవు కావని నాకు తెలిసిన రహస్యం నీకు తెలుసని నాకెప్పుడో తెలుసులే. 

అక్కడెక్కడో నా పేరు వినిపిస్తే పులకరిస్తావు. నన్ను పిలిచేందుకే నీ పెదవులున్నట్టు మురిసిపోతావు. నువ్వు చదివే సాహిత్యంలో..వినే పాటల్లో..రాసే రాతల్లో నాపేరు సగమైనా ఉంటుందిగా. అదేమంత ప్రత్యేకమైంది కాకపోయినా నువ్వు పలుకుతున్నందుకే అంత తీపిగయ్యింది. నా చిరునవ్వే నువ్వు పిలిచే పిలుపుగా అవగతమైనందుకే పదేపదే నెలవంకనవుతాను. ఇప్పుడు చెప్పండి విరహమన్నది కేవలం నీవు సృష్టించుకుంది తప్ప నేనెన్నడూ నీకు దూరమైందే లేదు. మీకు విశ్రాంతి..తీరిక లేకపోవడానికి కారణం నేనైనప్పుడు వేరే ఆరాటానికి ఆశపడేదేముంది. 

చిన్ననాటి ప్రేమ గురించి నువ్వు  చెప్పింది నిజమే, వెక్కిరించి నవ్విన నవ్వు కాదది. నీలో ఆర్ద్రత తెలిసిన నేను ఎప్పటికీ అలా చేయను కదా. ప్రతివారూ జీవితంలో ఓసారి ప్రేమలో పడతారనుకుంటే  అదే వయసులోనైనా జరగొచ్చు. అయితే చిన్న వయసులో జరిగినదానికి అంత గుర్తింపు ఎందుకు ఉండదంటే..ఆ వయసుకి అది ప్రేమని గ్రహించుకో లేరు కనుక.నేను చెప్పేది ఆనాటి ప్రేమ. ప్రేమ ఎప్పటికీ ప్రేమే కదాని అడిగితే ఈ కాలంలో ప్రేమ ఎక్కువ ఆకర్షణకి సంబంధించింది ఉంటుంది. నిజాయితీ అయిన ప్రేమ నూటికో, కోటికో అంటే అతిశయోక్తి లేదు. ప్రేమంటే సమయానుకూలం ప్రేమించేది కాదు. అదే విధంగా మూణ్ణాళ్ళకీ సమసిపోయేదీ కాదు. మనసుతెర తీస్తే బొమ్మ కదులుతున్నంత ప్రత్యక్షంగా ఆరోజులు వీక్షించగలిగితే అది కదా అసలైన అనుభూతి. 

అప్పటికప్పుడు ఆ కాలానికి తీసుకుపోయి ఇప్పుడే జరుగుతున్నంత సహజంగా అనిపించాలి. ఆనాటి సంఘటనలతో ముడివేసుకున్న ఉదయాలూ..నీరెండలూ.. గలగలలూ..నిట్టూర్పులూ..అన్నీ జలతారు మెరుపులుగా కదులుతూ ఇప్పటి కన్నుల్లో ప్రతిఫలిస్తే..సన్నటి తొలకరి గుండెల్లో మొదలైనట్టు కదా. మరలాంటి గమ్మత్తులో తడిపే ప్రేమలు ఎందరికుంటాయి. ఆపై జీవితంలో ఎన్నిప్రేమలు తడిమినా అలనాటి స్పర్శకి సమానం కావు కదా.   ఒక కోమలత్వం, సున్నితమైన పరిమళమో పరితాపమో దానికి కలిసినందుకే అదెప్పటికీ మనోహరభావమే. మనోలోకపు మోహానురాగమే తప్ప లోకపు చేదురుచి తెలియని ప్రేమ ప్రతిక్షణమూ అనుసరిస్తుందని తెలిసినా నన్ను స్వీకరించిన నీకు నేనే చివరిప్రేమను కావాలని చిన్నకోరిక. ఇలా ఎందుకన్నానో నీకు తెలిసినా మరోసారి చెప్తున్నా. నీలో గూడు కట్టుకున్న అంతటి ప్రేమను అందుకోగలిగే అర్హత నాకున్నందుకే నన్ను స్వీకరించారని నా నమ్మకం.     పసిప్రేమను పోలినదాన్ని వెతికావో లేదో తెలీదు కానీ నన్ను ఆదరించిన నీ ఆత్మీయత ఇలా అనిపించేలా చేసింది. తిరిగి అదే జ్ఞాపకాల ఒరవడిలో నువ్వుండిపోతే నీకు తోడు ఇంకో ప్రేమపిపాసి తయారవుతుందిక్కడ. అంతగొప్ప ప్రేమను మరిపించగలిగినప్పుడే కదా మన ప్రేమకో విలువబ్బేది.  తరాలెన్ని మారినా ప్రేమ నిర్వచనం మారనప్పుడు అదెవరు పంచుకున్నా రెట్టింపు అలౌకికాన్ని అందించాలి తప్ప అసంతృప్తిని రేకెత్తించకూడదు. దిగులు మబ్బుల్ని దూరం చేసే ప్రేయసి రూపం నాదైనప్పుడే కదా నేను నిన్ను తీపి ఆనందంలో ముంచానని తెలిసేది. తునకలు చేయలేని నీ ప్రేమ తెలిసే తూచమని అడగట్లేదు. చూపులతో లాగేసినంత తేలిగ్గా ఎద మీద తల ఉంచగలగాలని చెప్తున్నా. 

అయినా నీకు తెలుసినంతగా నాకేం తెలుసు, నిదురలేవగానే వానజల్లు కురిసిన సవ్వళ్ళలో నా చేతిగాజుల గలగలలు వినగలిగేవాడివి, జలతరంగిణి రాగంతో నాపై పాట కట్టగలిగేవాడివి, దూరాన్నుంచే నా పరిమళాన్ని నీలో లయం చేసుకోవడం సైతం తెలిసినప్పుడు  ఇంకేదో చేయలేదని అడిగేదేముందని. ఒకసారి ఎదలోకి స్వీకరించాక అశాశ్వతమయ్యే అవకాశముంటుందని నేనూ ఊహించలేను. ప్రేమైనా స్నేహమైనా, మరో చక్కని అనుబంధమైనా సశేషమవ్వాలి తప్ప ముగిసిపోయే రోజెన్నటికీ రాకూడదు. పైగా ప్రేమ గొప్పదనమేమో, లోకంలో ఏ పిచ్చితో మనుషులు ఇంకోదాని కోసమో వెంపర్లాడినా.. నాకైతే ప్రేమే ఓ మజిలీ అయినా ముగింపైనా.  నువ్వన్నట్టు ఈ మాట అనుకున్నప్పుడే నిజమైన ప్రశాంతత నా మనసు అంచులు నిండి మరీ ప్రవహిస్తుంది. తీపి తినీ తినీ తీపెక్కాననే కదా నీ అతిశయంతో కూడిన ఈ లాలితము. అయినా సరే, నువ్వు పంపిన మోతీచూర్ నీ  ముద్దంత మెత్తగా మొత్తం నేనే తినేసేలా చేసింది. ఇంత తీపి వంటబడ్డాక ఇప్పుడన్నీ విశేషాలేనిక. 

No comments:

Post a Comment