చెప్పావుగా..నన్ను వదిలిన క్షణం నుండీ నీ మనసులాగే ఆకాశమూ ముసురుపట్టి కురుస్తూనే ఉందని. సగం కన్నీరు ఆ వాన నీటిలో కలిపేసి నెమ్మదించావని. అప్పటిదాకా కౌముదీ కిరణాల్లో తేలియాడిన నువ్వు ఒకేసారి దిగులు కమ్ముకుంటే నీ పరిస్థితి ఊహించగలను. ఇక్కడ నా ఎదురుగా తారలన్నీ ఆహ్లాదంగా ఎవో భావాలు అల్లుకుంటున్నట్లు నాకనిపించి వాటి అనురాగాన్ని మన ప్రేమతో పోల్చి చూసుకోవడంతోనే నాకు సరిపోయింది. నువ్వక్కడుండీ నేనిక్కడున్నా మాటలకేం కొదవుంది. గుండెచప్పుడు ఆలకింపులా నీ ప్రియమైన భవోద్వేగాలు నాకు అనుభవమయ్యాక ఈ విరహాగ్ని సైతం చల్లగానే అనిపిస్తుంది. నాకోసం తపించి నువ్వలా ముభావిస్తే నా మనసుని ఊరడించలేనిక్కడ.
మన చెలిమి తోటలో తిరిగేంత ప్రశాంతత నీకు కలగాలనే అలా కాసేపు ప్రకృతిని గమనించమన్నా. శిలలు మాట్లాడటం, పువ్వులు నవ్వడం, నిశ్శబ్దం రవళించడం, ఆకు పాటలు వినపడటం, ఒకే గుండ్రంలా చినుకులు రాలడం, పక్షులు పలకరించుకోవడం, ఇవన్నీ మెలకువలో కలలా మనసుకి మత్తునివ్వడం బాగుంది కదూ. ఇప్పుడు చిరుగాలిని కావాలంటే నా కుశలమడిగి చూడు, ఎన్నెన్ని బెంగలు సన్నాయిలు చేసి చెవిలో చెప్తుందో ఆలకించు. ప్రేమంటే అందం,ఆయుష్షు, కులగోత్రాలు, డబ్బూదర్పమని నేనూ భావించలేదు. అదేదో నిశ్శబ్దంలోంచీ ప్రేమ పుడుతుందని నువ్వు వాదించవచ్చు. సుతిమెత్తని భావాలు మాటలుగా మారేసరికి మృదుత్వం కోల్పోతాయని అంటావు కదూ, మరి నేనేమో నీ ప్రపంచమంతా మౌనరాగాలెందుకో, నా గొంతులో విషాదమేం చేయనూ అనుకుంటాను. తీయటి వాదనలూ, ఘాటైన చర్చలు ఎన్ని జరిగినా తామరాకు మీద నీటిబొట్టులా ఆ కాసేపు మెరిసి మన భావాలు ఏకమై నేనే నువ్వు, నువ్వే నేనుగా అయిపోవాలని ఆశిస్తాను. ఎంతో సున్నితమైన ఆకర్షణగా మొదలైన ప్రేమ కనుకే మనలోని చిరునవ్వుల కేరింతలు ఏనాటికీ ముగిసిపోరాదనే నేనంటాను. ముద్దువరకే హద్దనే సరిహద్దులు పద్దులవరకే కదా, అందుకే అనుభవమన్నది వెగటుపుట్టని పరమాన్నంలా పరమానందాన్ని ప్రాప్తింపజేయాలి. కదిలొచ్చే కెరటం తీరాన్ని మచ్చిక చేసుకోవడమెంత పని. తడవననుకున్న తీరం తడవతడవకూ తడిచి మరీ మురిసిపోతుంది కదా..
నిజమే.. నా అన్న అహం ఎంత ముఖ్యమో నావాళ్ళపై ఉండే ఆపేక్ష అంతే ముఖ్యం కదా..ఎవరూ లేని ఏకాకిగా అయినప్పుడు జీవితం అశానిపాతంగానే అనిపిస్తుంది. కొన్ని బాధ్యతలో బంధాలకో లోబడి మనవారికి అండగా ఉండాలనుకున్నప్పుడు ఆ చివరి ప్రతిఫలం ఎటువంటిదైన స్వీకరించే స్థితప్రజ్ఞత అలవడిపోవాలి. ఏదో ఆశించి మనం ఉపకారం చేయలేదని వారికీ ఒకనాడు తెలిసేట్టు చేసుకోవలసిన పని మనకేముంది. మనం తప్ప చేయలేమని తెలిసిన నాడు ఎవరైనా మన ముందొచ్చి చేయి చాచవలసిందేగా.
తెలిసిందేగా నీ గురించి నాకు, ప్రేమను రాస్తూ మొదలుపెట్టి ఎక్కడో ఏదో జరిగిందనే ముచ్చట మొదలుపెడతావు. ఇప్పటికిప్పుడు దేవతనంటూ నాకో దైవత్వం ఆపాదించి ఎలాగైనా నవ్వించాలని చూస్తావు. నేనేమీ పెద్ద అందగత్తెను కానని నాకూ తెలుసులే. అయినా నీ గుండెగదిలో నాకో పందిరేసి మరీ ఆహ్వానించావంటే అపురూపమప్పుడే అయ్యా కదా. సుళ్ళు తిరిగేంత ఆనందం నాకు వరమయ్యాక నీ ప్రేమావేశపు జల్లు నన్ను ముత్యముగా మార్చేస్తుందిలే. ఇప్పుడెంత వాన కురిస్తే కురవనీ, నువ్వెంత తడిచినా లాలించి తుడిచేందుకు నేనున్నానుగా..