Tuesday, 15 February 2022
// నీ కోసం 438 //
ఏకాంతానికి మాల వేసి వరించాలనుకుంటా
నీ ఊహను కమ్ముకోవాలని మనసు గోలపెట్టినప్పుడు
కొన్ని రాగాలు మధురించే క్షణాలు
తీయగా కదులుతున్నప్పుడు
హృదయస్పందన చేసే సవ్వడి
నీలో లీనమైన నా ఆత్మకే తెలుసు
సుగంధాన్ని సంతరించుకున్న సమీరం
నులివెచ్చని శ్వాసను చేరినప్పుడు
కన్నుల్లో చిప్పిల్లే నీటిరంగు ఆర్ద్రత
నీలో ఊయలూగే నా స్వప్నాలకే తెలుసు
సంగీతాన్ని మరిపించే చిరునవ్వు పలకరింపు
నాలో సరసానుభూతుల కావ్యానికి శ్రీకారమైనప్పుడు
దోబూచులాడుతున్న సంధ్యాకాల సౌందర్యం
నీ జ్ఞాపకాలు పరిమళించు నా నిశ్శబ్దానికి తెలుసు
మధురిమ తెలిసిన మౌనమిప్పుడు
హద్దుల్లేని అంతరిక్షానికి పాకినట్టున్న భావనలో
స్పందించే సమస్తాలు నిన్నే ఆవరించినట్లు
ఇప్పుడంతా విరజాజుల శిశిరోత్సవం
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment