Tuesday, 15 February 2022

// నీ కోసం 449 //

ఏదీ నచ్చదు.. అప్పటిదాకా ఇష్టమని మనసంతా ఆనందం పరచుకొని పెదవులపై నెలవంకను దించినా..ఇప్పుడెందుకు నచ్చలేదో..ఒక్క కారణమూ దొరకదు. ఇంద్రధనస్సు మోసుకు తిరుగుతున్నానన్న భావనలో నేనున్నా రంగులు కరిగి విషాదం మిగులుద్దేమోనని బెంగగా ఉంది నీకు దూరం జరగడం కుదరదని తెలిసిపోయాక..ఊహలకు దారి మరింత సుగమమయ్యింది. ఎర్రగులాబీనెంత చూసినా తనివి తీరక బుగ్గలకు రాసి ఆ సున్నితాన్ని సంతోషానికి ముడేసినా హృదయం నవ్వలేదంటే అప్పుడర్ధమయ్యింది..మనసంతా నువ్వే నిండినా చూపులకందేంత దగ్గరలో ప్రస్తుతం లేవని.. నిన్ను రాయొద్దని ఎన్నిసార్లనుకున్నా..ఏకాంతాన్ని గమనించాక అర్ధమైంది..నిన్ను రాసేందుకైనా కలమిప్పుడు కదలాలని..

// నీ కోసం 448 //

1. నీలి తారలో.. నల్లని గనులో.. అందమైన కలలు దాచుకున్న ఆల్చిప్పలో ఎందుకలా దాచేసుకుంటావ్ నవ్వుతూ తళుక్కుమనే కళ్ళు అందరికీ ఉండవు తెలుసా 2. చలువ చేస్తాయంటే సరే చెలువము దాచేసే చలువటద్దాలు చూపుని చదివేందుకు రాని చీకటితెరలు ఇదైనా తెలుసా అయినా ఈ చలి సమయం కలత నిద్దురలోనూ నీ కబురులేంటో

// నీ కోసం 447 //

కొన్ని గులాబీలు లేతవాసనేస్తున్నట్టు ఎప్పుడో అలా వచ్చి వెళ్ళిపోతావా కొంత చల్లగా కొంత వెచ్చగా అనిపించేలా చప్పుడు చేయని రెప్పలు ఎందుకు తడుస్తున్నాయో తెలీక నేనేమో స్వేదం పట్టేవరకూ నిలిచుండిపోతా.. గొంతెత్తి పిలిచినా నీకు వినబడదని కనుచూపు మేర నగ్నమైన చెట్లలో దాగిన పక్షుల్నీ, పువ్వుల్నీ నీ సమాచారం అడుగుతూంటా.. Woah... చలికాలపు బద్దకానికేమో నా మాట వినబడనట్టు నటిస్తున్నవన్నీ నీ పక్షమేనేమో ఇప్పుడు నేనేం చేయాలీ.. విరహానుభవమయ్యే వరకూ మీ అందరినీ వెలివేయాలి

// నీ కోసం 446 //

ఈ చీకటి కెరటాలలో జ్ఞాపకాల వలలు ఏడురంగుల ఇంద్రధనస్సులై నన్నల్లుకుంటూ మనసు మడతలు విప్పితే వచ్చే పరిమళమంతా నీ ఊహదేనన్న వాస్తవం చాలదూ... ఉక్కిరిబిక్కిరవ్వడానికి.. నువ్వూ నేనూ స్వప్నంలో కలుస్తున్నా వాస్తవంలో తప్పిపోయిన ఆత్మలం కాదనగలవా.. తలపులు సయ్యాటాడే ఒక రాత్రికి నక్షత్రాలలో విహరించినట్లనిపిస్తే మధురక్షణాలెక్కడో లేవని అనిపించడం తప్పు కానట్టే.. మనసు దాచలేని నీ చూపులు కొత్తలోకానికి రమ్మంటుంటే మౌనమే మధురిమకు సమాధానమై కదులుతున్న క్షణాలను ఆగమన్నది నిజమే However.. ప్రేముందని మనసివ్వలేదు..నేనే నువ్వయినప్పుడు ప్రేమన్నది కృతి కాక మానదు..నాతో నువ్వున్నప్పుడు

// నీ కోసం 445 //

A little taste of high life గతం ఆత్మని తడి చేస్తుంది జ్ఞాపకాల అలలకి దేహం సముద్రమై హృదయాన్ని విశాలం చేసేస్తుంది ఆశించినంత తీయందనం లేదని మనసు రుచిని ఏమార్చి మమతల గంధాన్ని వదులుకోలేదుగా భావోద్రేకాన్ని దాచాలని చూసే కన్నుల్లోని మౌనం చూపుని దాటి పలకరించడమే కదా వాత్సల్యం ఆద్యంతాల విరహం సంగీతాన్ని మింగేసిందని స్వరాలు చెదిరిపోతే రాధామాధవీయానికి ఓదార్పు ఏముంది తోవ ఏదయినా గమ్యం తెలిసింది కనుకనే కాలాన్ని అర్ధం చేసుకోవడం మొదలెట్టాలి

// నీ కోసం 444 //

నీ నీడ నన్ననుసరిస్తూ వీడిపోయిన స్మృతులను సంచలించింది ఇప్పుడిప్పుడే గాయాలు మాపుకుని నీరెండిన కళ్ళకు గతాన్ని గుర్తుచేసి మౌనాన్ని తుడుస్తానంటూ కన్నీటిని ఒలికించింది నా ఒంటరితనాన్ని వెక్కిరిస్తూ జ్ఞాపకాల అలజడి రేపి ఊసులు మరచిన నీరెండల్లో భావుకత్వపు రంగులు పంపింది సాయం సంధ్యను మరచిన నా వీనులకు మలయమారుత రాగంతో సాంత్వనిచ్చింది..

// నీ కోసం 443 //

అన్నీ తెలుసంటావ్ ఏం తెలుసు చెప్పు ఎందుకలా ఉండీ ఉండీ ప్రాణం పోయేంతలా అలసిపోతానో తెలుసా ఇన్నాళ్ళూ బుజ్జగించి నువ్వు ధరించిన ఆనందం ఎక్కడిదో చెప్పూ నువ్వు కనిపించని రోజు నా ఎదురుచూపుల శూలాలు గుచ్చుకునేలోగా కాగితప్పడవలో షికార్లు చేపిస్తావ్ కదా.. ఈ పొగమంచు స్పర్శలో నా బెంగను దాచా, ముట్టుకుని చూడు ఎప్పుడో ఒప్పుకున్న నిజమిది నా హృదయ పరిమళం, నీ ప్రేమ కవిత్వానిది ఇంకా నీ మనసుకి నచ్చకుండా ఉండి ఉంటానా Hmm.. అందం మాటైతే ఎత్తకు మరి

// నీ కోసం 442 //

ఆనాడు కాలం కన్నెత్తమని నిన్ను చూపించి కదులుతున్న నడకల్లో నిద్దురపొద్దులు కవిత్వపు గుబులయ్యింది మెరిసే నీ కంటిచివరి సంతోషం ముద్దబంతుల కాంతుల్లో నవ్వులా అటూ ఇటూ తప్పించుకోలేని గోడయ్యింది ఇప్పుడేమో... సాయింత్రం చల్లబడేకొద్దీ సముద్రపు కెరటాల్లోని తుంపరలు మీదపడ్డట్టు మధురక్షణాలు గుర్తుకొస్తున్నాయి ఆకులు రాలిన శబ్దానికి నులివెచ్చని మాటల విత్తనాలు మొలకలై గుసగుసలు గుమ్మరిస్తున్నాయి మనసు లోగిలంతా తడిపేసి నిద్రలేకుండా చేసిన ఆలాపన నీదై అద్వితీయ కృతులవుతున్నాయి

// నీ కోసం 441 //

నీ నాలుగుమాటలకి నేనాకాశంలోకి ఎగరడం మేఘాలు నన్ను చూసి నవ్వడం అర్ధమవుతుంది పూలవాసనకి మది మగత కమ్మడం నిన్నెలా స్వాగతించాలోనని ఏవేవో కలలూరడం తెలుస్తుంది నీ అలికిడితో కాగితాలు తడవడం ఆ కలవరంలో కాలమాగడమూ కనబడుతుంది కానీ మౌనాన్ని తాగుతూ చుక్కల్ని లెక్కించడం నువ్వెప్పుడొస్తావోనని అడగలేకపోవడమే బెంగయ్యి ఏడిపిస్తుంది

// నీ కోసం 440 //

నువ్వూ నేనూ ఒకరినొకరం తలుచుకోవడం ఎంత బాగుంటుందని జ్ఞాపకాల్లో నిలిచినప్పుడో విషాదాన్ని ధిక్కరించినప్పుడో వసంతం కోసం కోయిల కొత్తపాటలు నేర్చినట్టు నువ్వూ నేనూ ఒకరినొకరం నిరీక్షించినప్పుడు ఎంత దిగులవుతుందని పదం పుట్టనట్టుగానో పువ్వు రాలినట్టుగానో సమయం సమస్తం మూసిన పుస్తకమైనట్టు నువ్వూ నేనూ ఒకరినొకరం పిలుచుకోవడంలో ఎంత ప్రేముంటుందని దూరం దగ్గరయినట్టుగానో హృదయం చలించినట్టుగానో యుగయుగాల మోహం పచ్చగా చిగురించినట్టు And... When we exchange lines from our heart, we learn to smile n care each other నువ్వూ నేనూ ఒకరికొకరం ఎదురుపడ్డప్పుడు ఎంత ఆనందమయ్యిందని పరిమళాలు చుట్టుముట్టినట్టుగానో ఆకాశం అందినట్టుగానో దిగంతాల్లో తప్పిపోయి స్వర్గానికి చేరువైనట్టు

// నీ కోసం 439 //

ఎప్పుడూ ప్రపంచంతో తగాదా పడి నీకు నువ్వే బాలేననుకుంటావ్ నిర్వేదపు తీరంలో సంచరిస్తూ సముద్రపు ఘోషకు అర్ధాలు వెతుకుతుంటావ్ మనసు మాసిపోయి మధనపడుతుందంటూ తత్వాన్ని తలకెక్కించక తప్పదంటావ్ ఆపత్కాలపు అబద్దంలో నిజంలా నన్ను మాత్రం గుండెమీది పుట్టుమచ్చలా అతుక్కునుంటావ్

// నీ కోసం 438 //

ఏకాంతానికి మాల వేసి వరించాలనుకుంటా నీ ఊహను కమ్ముకోవాలని మనసు గోలపెట్టినప్పుడు కొన్ని రాగాలు మధురించే క్షణాలు తీయగా కదులుతున్నప్పుడు హృదయస్పందన చేసే సవ్వడి నీలో లీనమైన నా ఆత్మకే తెలుసు సుగంధాన్ని సంతరించుకున్న సమీరం నులివెచ్చని శ్వాసను చేరినప్పుడు కన్నుల్లో చిప్పిల్లే నీటిరంగు ఆర్ద్రత నీలో ఊయలూగే నా స్వప్నాలకే తెలుసు సంగీతాన్ని మరిపించే చిరునవ్వు పలకరింపు నాలో సరసానుభూతుల కావ్యానికి శ్రీకారమైనప్పుడు దోబూచులాడుతున్న సంధ్యాకాల సౌందర్యం నీ జ్ఞాపకాలు పరిమళించు నా నిశ్శబ్దానికి తెలుసు మధురిమ తెలిసిన మౌనమిప్పుడు హద్దుల్లేని అంతరిక్షానికి పాకినట్టున్న భావనలో స్పందించే సమస్తాలు నిన్నే ఆవరించినట్లు ఇప్పుడంతా విరజాజుల శిశిరోత్సవం

// నీ కోసం 437 //

మాటవినని మనసుకి సర్దిచెప్పే ప్రయత్నంగా సంచరిస్తున్న మబ్బుల అడుగుజాడల్లో కాస్తంత వెలుతురు పట్టుకోవాలని వంగిన నీడల మాటు వెతుకుతున్నా అనాలోచిత విరామం పూర్తవదు.. నిశ్శబ్దపు నిగారింపు నిర్ధారించేందుకు సాయింత్రాలన్నీ ఒకేలా ఉండవనీ రోజూ పక్షులేం పాటలు పాడవనీ ఒంటరితనపు కాగితమ్మేద రంగులు గతానికి కొత్తబట్టలేసినట్టు ఉండవని తెలిసేదెలానో.. Be alive n save urself

// నీ కోసం 436 //

చలిగా ఉందనో, జ్వరమొచ్చిందనో వణికినట్టుంటుంది ప్రాణం నిద్రలో కలలాంటి ఏమరపాటులా మాయ చేస్తుందీ నిర్లిప్తకాలం మతిలేక మరచిన ముచ్చట్లన్నీ పెదవుల్లో ఎండిపోయినా.. మది కోరిన మాటలన్నీ మనసు కూడగట్టుకుంటుంది మోహపడి గీసుకున్న వృత్తంలో మరువాల మూటలకందుకే మత్తు ఎక్కువనిపిస్తుంది

// నీ కోసం 435 //

నే దొరకనంతసేపు పడిగాపులు కాసావ్ నాలుగడుగులు ముందుకేయగానే మొదటి పాదానికే తడబడిపోయావ్ Dear Huggies 🤗🤗 ఇంకేం చెప్పకు మరోజన్మలో ముగిద్దామీ పయనం అందాకా నన్ను కాగితమనుకో నీకిష్టమైన భావాలన్నీ రాసుకో 💜 PS.. Please don't forget to mention my awesomeness

// నీ కోసం 434 //

చూపులు మాట్లాడే భాషలో కొన్ని కధలు, నిశ్వాసల్లో నిలిచిపోయిన వాక్యాలు, వెరసి నీ ఉనికే ఓ స్మృతిగా మారినట్టుంది తెలుసా నిశ్శబ్దాన్ని పూజిస్తూ ఉన్నన్నాళ్ళూ నీలో అక్షరాలు ప్రవహిస్తాయని, అరచేయి దాటొస్తే అవి కవితలవుతాయనీ నాకనిపిస్తుంది నిజమేనా ఈ చలిచూపుల బెంగను తీసివేసేలా, శిశిరకెరటాల్ని ఎదిరించే వెచ్చదనం నీ పాదముద్రల అలికిడితోనే రెట్టింపవుతుంది నమ్ముతావా ఎంతకని కాలక్షేపాన్ని నటించనూ... మనస్వీ కొన్ని పదాలు చల్లు.. కళతప్పిన నా తేజస్సుని నిద్రలేపు.

// నీ కోసం 433 //

ఒక్క ఆకూ కదలని సాయింత్రం కనుపాపలకి మౌనసాహచర్యంలా చిగురాకంత చిన్నినవ్వుతో తలపుకొస్తావు సంకల్పిత క్షణాలన్నీ మధురం చేస్తూ ఆకాశవర్ణంలో చిక్కుకుపోయేలా పంచమస్వరాన్ని చిద్విలాసంగా పంచుతావు గతం ముంగిట్లో వాలే అవకాశమివ్వకుండా కొత్త దారుల వెంట అలుపురాని అనురక్తి ఉన్నదని ఆనందపు సరిహద్దులకు చేర్చి నిలబెడతావు కాలమా.. మనసుని విహంగయానం చేయించమని ఎవరు చెప్పారే.. సుందర స్వప్నాలు రేయికి మాత్రమే సొంతం కావని చిరకాలం అనుభవించదగ్గ కమ్మని కవితలని తెలుసుకున్నాలే అందుకే..గంగలో మునిగినా..వెన్నెల్లో తడిచినా.. ఆరని ఆశలన్నీ అక్షరాలుగా అలంకరించేస్తున్నా వెలుతురే ముగ్ధ సౌందర్యమని చాటి చెప్పేస్తున్నా

// నీ కోసం 432 //

మనసు కొమ్మకు పూసే పువ్వుల భాష కాగితం మీద ప్రేమై ప్రకటనవుతుంది కొన్ని భావాలను వ్యక్తం చేసే భావావేశం హృదయానికి సాంత్వనిచ్చే స్పందనవుతుంది మేఘాల అంచున విరిసే మెరుపు చూపుల వలలో చిక్కి వెన్నెలవుతుంది మాటలన్నీ మంత్రాలైతే చీకటికి చొరవొచ్చి ఆకుచాటు అందాన్ని అక్షరం చేస్తుందేమో కలలన్నీ రాస్తూ పోతే ఏమవుతానో నెమ్మదిగా ఆవరించే ఉద్వేగానికే తెలియాలి

// నీ కోసం 431 //

ఈ తెలుపుగోడ వంకే చూస్తున్నా అంతుపట్టని దూరం నుంచి నువ్వొస్తున్న సడికేమో మెత్తగా తేలిపోతున్నా నేనూ.. నా కిటికీ చాలా నిశ్శబ్దం ఇష్టంగా నిన్ను ధ్యానం చేసుకునేంత వచ్చావా మరైతే.. మనసు పట్టుతప్పి మాటలు తడుముకుంటున్నా ఎవ్వరూ పలకరించకపోతే బావుణ్ణు కాసేపలా మధూహలోనే ఉండాలనుంది

// నీ కోసం 430 //

నీకు బాగోలేదనగానే ఒక్కసారిగా కాలం తడబడిపోతుంది చూడు.. గాలికేం చేయాలో తెలీక నిలబడిపోయినట్లుంది మునిమాపు శీతలవేళకి చెమట పడుతుంది పూలకు ఊపిరాడక పరిమళించడం తెలీనట్టుంది కుదురులేని క్షణాలకు కన్నీరు అడ్డుపడి పదిసార్లు నిన్ను తలచుకునేమో బరువుగా ప్రవహిస్తూ మలుపులు తిరుగుతున్న మెలికలై పెదవికి ఉప్పగా తగులుతున్నవి మనసు పరిచినందుకేమో, ఏమో.. బుగ్గలకింద చేతులుంచుకుని నిన్నే చూడాలనిపిస్తుంది నీ ఒంటరితనంలోని కలవరింతలకు.. చెంత నేనున్నానని చెప్పాలనిపిస్తుంది కుదిరినంత ఆకాశం మేర నీతో ఎగిరిపోవాలనిపిస్తుంది ఇదంతా కలో నిజమో తెలియట్లేదు.. R u ok or May b.. ur absence makes the heart grow fonder

// నీ కోసం 429 //

నిన్ను నువ్వు ఊపిరాడనివ్వనంత దూరాలెందుకు తిప్పుతావో తెలీదు మౌనంతో కాలాన్ని దాటించి దాహంతో అలమటిస్తున్నావని దగ్గరకొచ్చినా నన్ను స్వప్నమనుకుంటావు పైగా.. నా ఎదురుచూపులకి దూరం జరిగి అనంతానికి నిన్ను కోల్పోయి శూన్యంలో కొట్టుకుపోవడం ఏమంత సరికాదని తెలుసుకోవు కల్పాంతర రసోదయానికని ఎన్ని యుగాలని తడికళ్ళతో అన్వేషిస్తావు నీ జ్ఞాపకమే నేనైతే సీతాకోకలా ప్రతినిత్యం నా చుట్టూనే ప్రదక్షిణం చేసేది కదా ఏమో.. ఆలశ్యం జరిగిపోయిందంతే దేహాల్లేని చోటొకటి దొరికేదాకా ఎడబాటుని సహించి శోకాన్ని పూర్తి చేయాల్సిందే మనమిప్పుడు

// నీ కోసం 428 //

1. హేమంతం నర్తిస్తూ తన అందాన్ని వెదజల్లుతుంది పగటికి కాలం తక్కువై చీకటికి ఆయుష్షు ఎక్కువై నా చుట్టూ నీ జ్ఞాపకాల అలలవుతుంది 2. నిశ్శబ్దంగా కురుస్తున్న వెన్నెల నన్ను కన్నెత్తి చూడమంటుంది ఆకాశమైదానంలో నక్షత్రాల నవ్వులు నా నిశ్శబ్దాన్ని వెలిగిస్తూ పున్నమి సోయగాన్ని బుగ్గలకు పూస్తున్నట్లుంది 3. Ohh.. తగ్గినట్టే తగ్గి మళ్ళీ తిరగబెట్టింది చలి నీ మాటలు కప్పుకోబట్టి సరిపోతుంది కానీ.. ఈపాటికి మంచుమొక్కై మిగిలేదాన్ననిపిస్తుంది

// నీ కోసం 427 //

హేమంతం మౌనంగా మనోభావాన్ని మొదలెడుతున్నా మోహానికి తీరికలేదనేగా దేహాన్ని మరిపించేసావ్ ఇప్పుడేమో పిచ్చిపట్టినట్టు ఉంటుందని చెప్పాననేనా అలా ఆగి ఆగి వెనక్కి తిరిగి చూస్తున్నావ్... నిజమేనబ్బా.. నా మనసుపొరల్లో నువ్వు దాచుకున్నా పాట వెచ్చగా పెదవులపైకొచ్చి మరీ కరిగిపోతుంది సాయింత్రానికంతా లయతప్పిన ఆలాపన నీ సాన్నిహిత్యానికని అవిశ్రాంతంగా నిరీక్షిస్తుంది చలిగాలి తాకిడికేమో త్వరగా అలసిపోయి నా మేను సిగ్గుపువ్వులా ఎరుపెక్కుతుంది ఎప్పుడింతగా ఆధీనమైందో మరి నువ్వెలాగున్నా సరేనని ఆదమురుస్తుంది మది

// నీ కోసం 426 //

ప్రేమకు ఋజువేదని అడుగుతాను ఒక్క మాటైనా చెప్పకుండా నువ్వేంటో తెలుసంటావు నిశ్శబ్దానికి ఉలికిపడుతూ నేనుంటే ప్రేమంటే చప్పుడు చేసేది కాదంటావు తడిగా పాటల్లో తప్పిపోయిన ప్రతిసారీ వెచ్చగా చలించినట్టే ముట్టుకుంటావు వలసపోయిన ఆత్మ వెన్నెల్లో దొరికినట్టు మోహంలో దేహపు మెరుపు అద్భుతమంటావు నిభాయించుకోలేని దూరానికి నే నలిగిపోతుంటే గుసగుసలాడే గాలివై గుటకలేయిస్తావు అర్ధంకాని సముద్రంలా ఉండకంటే మాత్రం అమాంతం అలలా కమ్ముకుంటావు