Monday, 2 December 2019

// నీ కోసం 69 //

నీ గుండెగోడలపై తొలకరిగా కురిసిన
స్వరలయల ప్రతిధ్వనులు
నా పేరుగా మారినట్టు
ఊపిరాడనివ్వని అనుభూతుల నవ్వులు

సజలనేత్రాల అరమోడ్పులు
స్రవిస్తున్నది నీ భావుకత్వపు మకరందాన్నని తెలిసి
కాలమాగి చూస్తున్న ఏకాంతం
ఆనందపు ఏరువాకకు సాక్ష్యమైనట్టు..
అంతుచిక్కని మౌనం నేపథ్యమైన వేళ
ఎదలో స్పందన గంధమై పరిమళిస్తే
నీ ఊహల పువ్వొత్తే నాకు ప్రాణవాయువు
తొలితలపు ఆనవాళ్ళే.. వలపు పొత్తిళ్ళు..

కడలి కెరటం రెప్పలమాటు స్వప్నమై
ఓ చిలిపి గమకాన్ని కోరినందుకు
నిశ్శబ్దానికి సంగీతం తెలుసనుకుంటే
ఈ రాతిరి నులివెచ్చటి కవనాలాపన మొదలవ్వొచ్చు... 💕💜

No comments:

Post a Comment