చూపులతో మాట్లాడే నీ కన్నుల నిదురలేమి
ఒంటరితనపు శూన్యాన్ని ఓర్చలేని
అశాంతి క్షణాల నిశీధి లోకమైతే
నిండుపున్నమి కళల కౌముది నేనైపోనా
ముద్దులు మూటకట్టుకున్న నా పెదవుల నవ్వులు
మహార్ణవంలోని ముత్యాలు కనుక
నీ ఎదపై లాలిత్యపు దండగా మారి
నిన్నో వసంతకాలపు పూదోటకి గంధర్వరాజుని చేయనా
అలలై కదులుతున్న నా మనోభావాలకు రూపమిచ్చి
ఘనీభవించిన నిశ్శబ్దం పులకరించిపోయేలా
నీ బ్రతుకుచిత్రానికి రంగులద్దేందుకు కుంచెగా మారి
కాంతికిరణాల వేకువ కలవరింతను నిజం చేయనా