Tuesday, 20 June 2023
//నీ కోసం 527//
ముసురేసిన ఆకాశంలో
ముక్కలు ముక్కలుగా విడిపోతూ మేఘాలు
మగతగా కదులుతున్నట్లున్నాయి
అనురక్తిని మోయలేకపోతున్న సాయింత్రం
మనసు మనసులో లేదంటే
ఉట్టి మౌనమనుకునేవు..
అంతరాత్మ దాహార్తి నుంచి
ఆరాధనా ప్రవాహం దాకా
దానికి తెలియనిదేది..
వసంత పరిమళమూ, గ్రీష్మ గాయమూ
అన్నిటినీ ఆదరిస్తుందిగా..
ప్రేమలిపితో పలకరింపులు నువ్వాపేసినా
నిన్ను తలచి స్మృతులు నిమురుకుంటూ కూడా
తపించి ఎడబాటుతో కుంగిపోతుందది
తోడుగా ఉంటుందనుకున్న కాలం
కవ్విస్తూ కదిలిపోతుంటే
అనుభూతులూ, అద్భుతాలూ
అతిశయాలూ, ఆశలూ కోల్పోతూ
నిస్సహాయంగానూ నిట్టూర్చుతుందది
ఓయ్ నిజం..
ఈ రోజు.. అలసిపోయినట్టు
అనామకస్వరాన్ని ఆలపిస్తుందది
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment