Tuesday, 20 June 2023
//నీ కోసం 521//
అనురాగపు వంతెన మీద
తొలిసారి కలిసినప్పుడు కంటికొసల్తో
ఆగి ఆగి నే చూసిన చూపులకి
సుతిమెత్తగా నవ్వి విస్మయాన్ని అణచుకోలేదూ..
నాలో వలపు ఆకాశమంత విస్తరించి
నీ ఏకాంతానికి దృశ్యకావ్యమై
ఆనందాల పందిరేసినప్పుడు
నీలో నువ్వే పరవశించలేదూ..
మరిప్పుడేమో..
ఎదురుగానే ఉంటున్నా
నేనెవరో తెలీనట్టు నీ బెట్టు..
గుండెల్లో దాహార్తిని పొగిలించేలా
కన్నుల్లో గ్రీష్మమొచ్చినా
మధురమైన నీ పిలుపుధారల కోసం
మౌనంగా పరితపిస్తున్నాననేం చెప్పనూ..
నిద్దురపట్టని నిశిరాత్రి
నీ గురించిన తలపుల వేడికి
అలసిన మల్లెలు ఎర్రబడినా
విరహాన్ని దాచుకోలేక విరజిమ్ముతున్న
సుగంధాన్నేం చేసుకోనూ..
Oyy.. సముద్రపొడ్డున నన్ను కూర్చోబెట్టి
కాగితప్పడవలో నువ్వొక్కడివే విహరిస్తున్నావా !!
అలల గలగల నాకెటూ అర్ధంకాదని
నువ్వొచ్చే వేళ కోసం ఎదురుచూడమన్నావా
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment