Tuesday, 20 June 2023

//నీ కోసం 529//

1. చెదిరిన చీకట్లలోంచీ సగం విరిసిన చందమామ తెగ నవ్వుతున్నాడు నువ్వొస్తే అందగించే నీ ముఖం తప్ప తనని చూడనని తెలిసిపోయిందేమో.. 2. ఒక్క మాట మాట్లాడింది లేదు తల తిప్పి నన్ను చూసిందీ లేదు అయినా నన్నెలా పిచ్చిలో పడేసావో తెలీదు మనసెప్పుడు దోచుకెళ్ళావో అసలే తెలీదు.. 3. కంటిచివర్లు ఎర్రబడుతున్నాయని విరహాన్ని ఓర్చుకుంటున్నా గానీ నిన్ను తలవగానే పూసే చిరుచెమట్లను ఆపలేక వేసవి కాలమ్మీదకి నెపం నెడుతున్నా.. 4. నిజమే.. తప్పంతా నాదేలే.. ఎదురుగుండా రాలేవని తెలిసి కళ్ళు మూసుకు పిలవగానే రాకపోయేందుకు నీకేమైనా మొహమాటమా ఏంటి..

//నీ కోసం 528//

నువ్వొక పూదోటవైతే.. నాకెప్పుడూ ఆ దారుల్లోనే నడవాలనిపిస్తుందని చెప్పానా !! ఇప్పుడిప్పుడే వెన్నెల చినుకులు ఆరంభమైన సమయం విరజాజులకి సువాసన ఎక్కువయ్యింది నీ చిరునవ్వును ఊహిస్తున్న నా రెప్పల వెనుక తడెప్పుడు చేరిందో ఈ వివశత్వాన్నేం చెప్పను నిశ్శబ్దరాగం మోహపెడుతున్న ఈ పొద్దు మనసుకి రెక్కలొస్తుంటే దూరాన్ని అధిగమించి నిన్ను చేరాలనిపిస్తుంది ప్రేమని ప్రాణాయామంగా చేసే నీ దగ్గర యుగాల ఎడబాటు అంతమయ్యేందుకు 'లవ్ యూ' మంత్రోపదేశం తీసుకోవాలనుంది ఏకాంతస్వప్నంలో ఎదురుచూస్తానంటే చెప్పు నన్ను like చేసి హృదయమంతా share చేసుకునేలా cuteగా వచ్చేస్తా

//నీ కోసం 527//

ముసురేసిన ఆకాశంలో ముక్కలు ముక్కలుగా విడిపోతూ మేఘాలు మగతగా కదులుతున్నట్లున్నాయి అనురక్తిని మోయలేకపోతున్న సాయింత్రం మనసు మనసులో లేదంటే ఉట్టి మౌనమనుకునేవు.. అంతరాత్మ దాహార్తి నుంచి ఆరాధనా ప్రవాహం దాకా దానికి తెలియనిదేది.. వసంత పరిమళమూ, గ్రీష్మ గాయమూ అన్నిటినీ ఆదరిస్తుందిగా.. ప్రేమలిపితో పలకరింపులు నువ్వాపేసినా నిన్ను తలచి స్మృతులు నిమురుకుంటూ కూడా తపించి ఎడబాటుతో కుంగిపోతుందది తోడుగా ఉంటుందనుకున్న కాలం కవ్విస్తూ కదిలిపోతుంటే అనుభూతులూ, అద్భుతాలూ అతిశయాలూ, ఆశలూ కోల్పోతూ నిస్సహాయంగానూ నిట్టూర్చుతుందది ఓయ్ నిజం.. ఈ రోజు.. అలసిపోయినట్టు అనామకస్వరాన్ని ఆలపిస్తుందది

//నీ కోసం 526//

ఇన్నాళ్ళూ ఎక్కడ దాక్కున్నాయో పచ్చని ఆకుల చైత్రపు శబ్దానికి మోహపరిచే రాగంలో.. గొంతువిప్పి కూస్తున్న కోయిలలు ఓ పక్క వెదురుపొదల వేణుగీతాలు వసంతపు విరహాన్ని తలపిస్తుంటే మరో పక్క.. సుతారమైన సాయింత్రం ఈ కొత్తపూల గాలి నీ చిరుచెమట గంధాన్ని మోసుకొచ్చి నిన్నలేని పులకింతలిస్తుంది చూడు Yeah.. Some days r diamonds n some days r only stones But.. hmm.. u r worth that wait too

//నీ కోసం 525//

తను: కూ.. కూ.. నేను: .... తను: కూ.. కూ.. నేను: హహ్.. అలగడమా.. నేనెవర్నీ అలగడానికి తను: కూ.. కూ.. నేను: అర్ధమైందిలే, తనకి తీరికే లేదు.. ఈరోజు ఆం కూడా తిన్లేదు, కానీ.. నేనెలా ఉన్నానో తలుస్తున్నాడంటావ్.. తను: కూ.. కూ.. నేను: బానే ఉన్నానని చెప్పు.. కనపడని దారంతో తన మనసుకి ముడేసుకున్నాక, విరహాగ్ని వేడికి పగలంతా నిద్రిస్తున్నానని.. వసంతం విసిగిస్తుందని ఏం చెప్పనూ.. అయినా సరే, నా దగ్గర జ్వరం వాసనొస్తుందని అనుమానపడొద్దని చెప్పు.. తను: కూ.. కూ.. నేను: నువ్వు తీయగా పిలిచినప్పుడే అనుకున్నాలే, ఆలశ్యమైనా నన్నారా తీయకుండా తనుండడని.. నిమిత్తమాత్రమన్నది నా విషయంలో నిజం కాదనే నా గర్వం ఋజువైందనే ఈ నవ్వు.. ఇంకా, ఇక్కడ గుప్పుమంటున్న సాంబ్రాణి తన ఉనికిని అందించిందని చెప్పడం మరువకు తను: కూ.. కూ

//నీ కోసం 524//

హా.. వినబడింది.. Can u hear me. . అనే కదా అంటున్నావ్ ఒకటికి నాలుగుసార్లు నాతో ఏమ్మాట్లాడాలో మనసులో అనుకుని మౌనంగా ఉంటే మాత్రం నాకు తెలీదనుకున్నావా.. నా కన్నుల లోతుల్లోకి చూస్తూ హృదయం కంపిస్తుందని నీ ప్రాణస్పందనలోకి నన్ను చేర్చుకోడం చాలా చాలా బాగుందిలే.. వసంతం వాకిలి తీసి ఊహల్లో ఊపిరి బరువెక్కుతున్నా నన్ను తలిచేందుకు విరామం దొరకలేదని నువ్ పడుతున్న వేదనా నచ్చిందిలే.. నీ పెదవిదాటని పదాలు ఉదయమంతా చినుకులుగా కురిసినా రాత్రికి నక్షత్రాలుగా పూయగలవనే మధుర సంభాషణలెప్పుడూ మక్కువేలే.. Hmm.. I can imagine that look of love in your eyes n always adore d way u caress my soul

//నీ కోసం 523//

మారని స్వరంతో పిలుస్తున్నాననా మౌనాన్ని ముడేసుకుని ముభావంగా వెళ్ళిపోతావ్ ఏం చేస్తున్నానో అడగవా..? ఆకాశంలో మబ్బుల్ని చూస్తున్నా ! నా హృదయమెలానూ ఘోషించడం ఆపదని నిశ్శబ్దంగా కదిలిపోతున్నాయవి.. మరి మధుమాసం కదా.. కోయిలల సంగీతం వినొచ్చుననుకోకు.. కాలాన్ని కల్పించుకు మరీ ఏకాకి వైరాగ్యాన్ని పాడుతున్నానని విసుగొచ్చి ఇటు రావడమ్మానేసాయవి.. మగత నిద్రలో నేనున్నప్పుడు మిరియాల పొడి చల్లి మేల్కొల్పుతున్నావ్.. ప్రహిస్తూ ప్రవహిస్తూ ఘనీభవించినట్లు నీ అస్తిత్వాన్నిలా ప్రకటించడం నిజమేనా ముసి ముసి చీకట్లలో చందమామాలా వెలిగే నువ్వు నల్లపూసలా మారిపోయావెందుకో నీకైనా తెలుసా

//నీ కోసం 522//

తెలుసా... నీ మీద ప్రేమ ఎక్కువవుతుంది నన్ను నేను తెలుసుకునే కొద్దీ నాలో నాకు నచ్చుతున్నది నీ మనసే ఒక్కోసారి సముద్రంలా లోతుగా ఇంకోసారి ఆకాశంలా అందకున్నా తలుచుకుంటే చాలు తీయగా, గమ్మత్తుగా అంతర్ముఖ స్తబ్దతలో ఉంటూ కూడా నిరంతర తరంగంలా ఉవ్వెత్తునుంటావ్ కదా అందుకే తిరిగి ఇవ్వవని తెలిసినా ఉన్న ఒక్క మనసూ నీకిచ్చేసా మౌనంలో ప్రేమాలాపనగానైనా తోడుందామని నువ్వు నా మోహ జీవనానివి కనుకనే... ఈ ప్రయాణం ముగిసేవరకూ అంతరాత్మగా నాతో వెంబడించమంటా.. Finally.. it s true that.. "The whole point of living s learning to accept the great nothingness of life"

//నీ కోసం 521//

అనురాగపు వంతెన మీద తొలిసారి కలిసినప్పుడు కంటికొసల్తో ఆగి ఆగి నే చూసిన చూపులకి సుతిమెత్తగా నవ్వి విస్మయాన్ని అణచుకోలేదూ.. నాలో వలపు ఆకాశమంత విస్తరించి నీ ఏకాంతానికి దృశ్యకావ్యమై ఆనందాల పందిరేసినప్పుడు నీలో నువ్వే పరవశించలేదూ.. మరిప్పుడేమో.. ఎదురుగానే ఉంటున్నా నేనెవరో తెలీనట్టు నీ బెట్టు.. గుండెల్లో దాహార్తిని పొగిలించేలా కన్నుల్లో గ్రీష్మమొచ్చినా మధురమైన నీ పిలుపుధారల కోసం మౌనంగా పరితపిస్తున్నాననేం చెప్పనూ.. నిద్దురపట్టని నిశిరాత్రి నీ గురించిన తలపుల వేడికి అలసిన మల్లెలు ఎర్రబడినా విరహాన్ని దాచుకోలేక విరజిమ్ముతున్న సుగంధాన్నేం చేసుకోనూ.. Oyy.. సముద్రపొడ్డున నన్ను కూర్చోబెట్టి కాగితప్పడవలో నువ్వొక్కడివే విహరిస్తున్నావా !! అలల గలగల నాకెటూ అర్ధంకాదని నువ్వొచ్చే వేళ కోసం ఎదురుచూడమన్నావా

//నీ కోసం 520//

ప్రకృతి.. చిరుగాలి చక్కిలిగింతలకి మనసు పరవళ్ళు గుండెవాకిళ్ళు దాటి ఎన్నాళ్ళయిందో.. నిద్రలేచిన నక్షత్రాలు నీలిమేఘాల మలుపులు మారినా దాగుడుమూతలాడవెందుకనో.. నువ్వు.. గాఢమైన నిశీధిలో అవ్యక్తస్వప్నాల అనుభూతి మరిచి నిశ్శబ్దమయ్యావెందుకనో ప్రణయానందపు నీ ఆత్మ ఏకాంతానికి నన్ను రమ్మని పిలిచి మౌనవించిందెందుకనో.. నేను.. దీర్ఘమైన దిగులు వెంబడి అలసిపోయిన రాత్రులనే హత్తుకుని దాక్కుంటున్నాను.. శిశిరపు మనోచ్ఛాయల్లో నాకు నేనుగా కలతపడి కన్నీటితో కరుగుతున్నాను Haa.. i miss d time when i was lil happy

//నీ కోసం 519//

ఓహ్హ్ గ్రీష్మతాపమంటారే.. ఎటు పోయిందది విరబూస్తున్న సన్నజాజులు ఇంద్రియాల్లో లీనమై మనసుని అదిమిపెడుతున్నప్పుడు కోయిల పాడుతున్న పాటకు ఏకగ్రీవంగా తలలూపుతున్నట్లు చెట్లు.. ఏకాంతద్వీపంలో తీపివగరు ప్రేమకాంక్షలా రెక్కలిప్పుకున్న మధురకవిత లయతప్పి పెదవులపై మోహనగా మారి నిరవాన్ని సంచలనం చేస్తున్నప్పుడు.. విరామంలేని అల్లరి గుసగుసలతో ఆవిరి మేఘాలు దాటొచ్చి వీస్తున్న గాలి వసంతపు రహస్యాన్ని అనుభవించమని మృదువుగా తీస్తున్న కూనిరాగాలు.. Pch.. ఇన్ని అందాల మధ్య సాయింత్రమైనా సూర్యుడితో సమంగా నువ్వు వేడిగానే ఉన్నట్టున్నావుగా

//నీ కోసం 518//

నీ చూపుల జోలికి రావొద్దనుకుంటా.. తనివితీరని వెన్నెల్లు కురుస్తూనే ఉంటాయవెప్పుడూనని.. మనసునూయలూపే కెరటాల్లా ఆ నవ్వుల వైపుకి అసలే చూడొద్దనుకుంటా.. రసార్ణవంలో ముంచి అతీతమైన పులకరింతలిస్తుంటాయని.. నీ నిశ్శబ్దం జోలికీ రావొద్దనుకుంటా నా స్వప్న తునకల్లోని భావాలు సరిచేస్తూ పలవరింతలుగా మారుతుంటాయని.. మత్తు మత్తు మాటలు దాచుకుని కూడా మెల్లిగా కదిలే నీ హృదయాన్ని తలవొద్దనుకుంటా అంతులేని భావుకత్వాన్ని పురివిప్పి మోహకలాపమాడుతుంటాయని.. కానీ.. నీ ఊహల సరసన మాత్రం చేరాలనుకుంటా పదిలమైన జ్ఞాపకాల తమకపు ఒడిలో కాసేపైనా ప్రణవనాదం ఆలకిద్దామని.. As u know.. thre s perfect amount of majic within u n hence u r on my every single page

//నీ కోసం 517//

నా నుంచి నన్ను విడిపోయేలా చేసి నువ్వు మాత్రమేం పట్టనట్టు ఎరుపెక్కిన ఆకాశానికేసి చూస్తావ్ Ohh... గుంపులు గుంపులుగా మేఘాలు హాయి తీరానికి రమ్మంటుంటే ఒంటరిగా వెళ్ళేందుకు సిద్ధమయ్యావన్న మాట కలలకు రంగులద్ది ఏదేదో రాసేలా చేస్తూ మౌనం నీ అలంకారమైనట్టు అదేమో అపరిచితమైనట్టుంటావ్ Huh.. వెన్నెల సోనలు కరుగుతూ నీ చిరునవ్వులు గుర్తుకు తెస్తుంటే పున్నమి శ్వాసకి సంకటమవుతుందని తెలుసా ద్రాక్షరసమో.. ప్రేమరసమో తాగి.. ఈ ఊదారంగు పూలు పాడుతున్న సౌందర్యలహరికి లేతచిగురాకులా నే ఒణుకుతున్నా Somehow.. as I'm extra inspired.. still following d moon

//నీ కోసం 516//

ఈ దూరమంతా తప్పించుకుపోదామని నీ కవనపు రససిద్ధి వైపుకి అడుగేస్తానా.. గుప్పెడు గులాబీరేకులు చల్లినట్లనిపించి ప్రేమను పెంచేలా అవే జ్ఞాపకాలు నా ఆనందానుభూతి రహస్యాలవుతాయి గతాన్ని నేమరేసుకునే నిట్టూర్పుల్లో సుతారపు జలదరింపులెప్పుడొచ్చి చేరతాయో పారేసుకున్న పదాలు వెచ్చని పాటలై పెదవుల రంగుకి తీపి వెల్లువగా తోడవుతాయి నాకు మాత్రమే తెలిసే ఓ తపనకి అమాస పున్నములతో సంబంధం లేదంటే నమ్మవేమో.. నా మనస్సహవాసి మొహావేశం ఈ నిర్విరామ నిశ్శబ్దంలో మౌనస్వరమై సున్నితంగా వినబడుతుంటే నేనతిశయాన్ని అభినయిస్తాను Yess.. u r my source of Happiness n I'm pleased for u to b pleased..

//నీ కోసం 515//

నా మనసుతడి ఆవిరై జ్ఞాపకాల పరిమళాల నుంచీ బెంగ పొంగుతుంది నిన్నేమయినా అలుసు చేసానా.. అర్ధంతరంగా ఏడిపించానా అయినా సరే.. నీ నిశ్శబ్దపు లాలిత్యంలోని పచ్చకర్పూరపు వాసన నన్ను నిలువనివ్వకుంది.. నువ్వేమైనా మధుర స్వప్నానివా.. కవి కాళిదాసు కావ్యానివా ?! నాలో సంతోషం శూన్యమై ఎటుచూసినా దిగులేస్తూ జీవితం అంతుపట్టకుంది నిన్నెప్పుడైనా ప్రేమించి ఉంటానా కనీసం ప్రశ్నించుకున్నానా అదేంటో మరి.. నీ సుతిమెత్తని నవ్వుల్లో రంగుల సీతాకోక చిలుకలా ఎగరాలనుంది నువ్వసలా పరధ్యానంగా తలిచావా.. వెన్నెల్లో కన్నుకొట్టి పిలిచావా.. ?! Woah.. U messed with my heart from afar, with all unfinished words.. N u r acting naive all d time

//నీ కోసం 514//

ఇంత కాలం ఎక్కడున్నావోనని ఎంత ఆత్రంగా ఎదురుచూస్తూ ఉన్నానో మెత్తటి శబ్దంతో భలే చెంత చేరుతావు దూరాలు దాటి గిలిగింతలు పెట్టే నీ చిరునవ్వులోని నీలిరంగుకో సువాసనుందని తెలుసా.. అదే గ్రీష్మంలో చిగురాకు వసంతపు పరిమళం మాదిరి సుకుమారంగా నన్నంటుతూ కలదిరుగుతుంది.. ఇక, ఒళ్ళంతా తనివితీరా నిమురుతున్నట్లు నీ కళ్లు... నిప్పురవ్వలో.. అయిస్కాన్తపు కిరణాలో కాలుతున్నంత సేపు తెలియదు కానీ దీర్ఘ నిశ్వాసల ఉద్విగ్నానంతరం అరచూపుల ఆవిర్లలో అపురూపంగా మెరిసే భాష్పం మాత్రం అత్యానందపు కానుకగా వెలుగుతుంది నువ్వో ఏమరుపాటు విచలిత్వానివి కాదని తెలుసులే ఎంతో ఏకాగ్రతగా నన్నో నేమలీకగా దాచుకున్నాననుకుంటూ కల్లోల సముద్రంగా మార్చేస్తుంటావ్ కదా.. నువ్వెంత మురిపానివో లోలోపల తడిచిపోతూ నేనుంటున్నా.. Every moment we share is hauntingly beautiful n soo precious to me

//నీ కోసం 513//

ఓ అల్లరి చూపుల రాజా.. పలకవా.. నువ్వెలా ఉండేవాడివో అలానే నాకిష్టం నువ్వొక సుతారపు మోహానివి ముద్దొచ్చే అద్వితీయ శిశిరాజువి.. తెలుసుగా.. నీ హృదయస్వరంలో చనువు నీలి ప్రవాహపుతీపిలా నన్నల్లుకునేది.. మధురమైన నీ పెదవుల్లో మమతగానం అచంచలమైన తాపాన్ని రేపెట్టేది.. నీ నొసటి మెలికెల్లో ఎదురుచూపులుండేవి నాలో విరహాగ్నిని మెల్లగా చల్లబరిచేవి.. వెన్నెల్లాంటి నీ కన్నుల్లో కబుర్లుండేవి ఆగి ఆగి లాలింపుగా నన్నవి తడిపేవి.. నీ రాగం దూరమయ్యి, వేడుకలు వలసపోయాక అనురాగం పట్టుతప్పి అశ్రువుగా మారింది నా ముచ్చట సగం సంధ్యలా స్థబ్దమై ఆగింది నే కోల్పోయిన సాయింత్రాలన్నీ తిరిగివ్వలేవా బెంగనంతా తరిమేసి అమ్మలా హత్తుకోవా Pch.. అందమైన ఆదమరపులా ఉండేవాడివే.. ఆ ఆనందపు రంగులోనే నువ్వుండలేవా.. Look.. U r larger than life n Let me hear ur laughter aloud..