చల్లగా ఉన్నా ఉక్కిరిబిక్కిరి తబ్బిబ్బు కావడం నీపైన అభిమానమేనా, ఏమో సన్నని నీ చిరునవ్వుకి నాలో ఇంత ఆర్తి పుడుతుందెందుకు.. కురిసినప్పుడు వెన్నెల్లా, కరిగినప్పుడు కర్పూరంలా, కవిత్వాన్ని కలగనేలా ఉంటుందనేమో.. నాలో అల్లరి అప్పటికప్పుడు ఒద్దిక నేర్చిన ఆదమరుపవుతుంది. కనిపించని గాలిలోని నిశ్శబ్దసంగీతం నీ ఉనికిని అందించి సేదతీర్చేందుకు చూసినా.. దగ్గరకొచ్చి దూరమైన రంగులకలను తిరిగి పొందాలని జోకొట్టిన రాత్రిని కళ్ళు నిదురపోనిస్తేగా.
కాసేపు కిటికీలోంచీ ఆకాశాన్ని తాకి కొన్ని నక్షత్రాలను తెంపుకొచ్చి రవ్వల గొలుసుగా గుచ్చుకున్నా, రంగు రంగుల పూలెన్నున్నా ఊదారంగు పువ్వులే నాకెందుకు ప్రత్యేకమో ఆలోచించినా, మంచులో ఒకే మాదిరి తడుస్తున్న గడ్డిపూలూ, మల్లెలూ ఏం కబుర్లు చెప్పుకుంటున్నాయో ఆలకిస్తున్నా, ఎన్ని క్షణాల అనుభూతులు దాచుకున్నా.. నిన్ను తలచిన తాదాత్మ్యానికి సరి రావెందుకు?! ఇంకా సంపెంగల తీపివాసన మనిద్దరికీ ఎంతిష్టమో గుర్తుచేసుకోమనకు. కన్నుల్లో మెరుపు గుండెల్లోచేరి రక్తాన్ని వేడెక్కించి ఓరచూపులు చూస్తుంది చూడు. మౌనంగా మనసుతో సంభాషిస్తానంటే సరిపోదిప్పుడు. మృదువైన ఊహలు చిలకలగుంపులై ఇన్ని ఊసులేమిటో పెదవిప్పి మరీ అడుగు.
నా సమస్త ప్రాణమూ చైతన్యవంతమై నిన్నే తలచుకుంటుంది. భరించలేనంత చీకటిలోనూ కొంత వెలుతురుందంటే, అది లోపల నుండీ ప్రసరిస్తున్న నీ ప్రతిబింబానిదే. ఎక్కడ ఉన్నా నా ఏకాంతానికి కదిలొచ్చే నీ అడుగులు నాకు సంభ్రమాలు కనుకే నాకిన్ని స్పందనలు. గంపెడు గులాబీలను శ్వాసిస్తున్నట్లు.. నీ పరోక్షంలో చలిస్తున్న ఈ పరిమళం నీరాకది కాక మరేది. ఆకాశానికి సంద్రానికీ లేని సరిహద్దు మనకెందుకనీ, నువ్వొస్తే మోహానికి మరువాన్ని కలిపి అలౌకికం చేసేద్దాం..
No comments:
Post a Comment