నువ్వు మాట్లాడి చాలాసేపయినా
ఇంకా ఏదో చెప్తున్నట్టే అనిపిస్తుందిహృదయస్పందనలో పేరు తెలియని రాగం
నీ పల్చటి నవ్వుని ధ్వనిస్తున్నట్టుంది
నిశ్చలంగా జారుతున్న చీకటితెరను
పట్టించుకోకనే కురుస్తున్న వెన్నెల
నా కలను నీ నోట వినిపిస్తూ
పున్నమి పరవశాన్ని పెంచేస్తుంది
గగనకుసుమాలన్నీ నిలువెత్తు నీలా మారి
ఊపిరాడనివ్వని మత్తులో ఊపేస్తుంటే
అశ్రువులన్నీ అంతులేని అక్షరమాల చేసి
నీ ఎదనే అలంకరించాలనుంది తెలుసా
నీ సమక్షంలోని నా ఆనందాన్నడుగు
నే కల్పించుకున్న ఆత్మబంధాన్ని చెప్తుంది
లేదా నీ ఇంద్రియాల లాలసనే అడుగు
నీలో ఆర్తికి సరిపడా కవిత్వాన్ని వినిపిస్తుంది
No comments:
Post a Comment