ఆదమరచిన ఏకాంతంలో
మెత్తగా నిన్నారాధిస్తున్న చూపులకునువ్వు చనువుగా స్పందిస్తే చాలు
కిలకిలలు రువ్వే పసిపాపనవుతున్నా
నిశ్శబ్దం పల్చబడిన ఆర్తిసంగీతపు నిర్వచనమే
నీ సహృదయ స్వభావము కాగా
సిరివెన్నెలలు, రంగులకలలూ ఏకమై
మనసుని ముంచెత్తే అలలతో
నువ్వలా చేయి చాచినప్పుడల్లా
గుండెల్లో ఎగిసే వెచ్చనిపొంగుకి తేలుపోతున్నా..
నువ్వూ నేనూ ఒక లోకమయ్యేవేళ
తనువెల్లా మనసై పరవశించే
ఈ గాఢసుషుప్తిలోంచీ నన్ను కదల్చకు
నీ ఎదసవ్వళ్ళను ఊహించే క్షణాలివి
అవునిప్పుడు పువ్వులన్నీ ఊదారంగులే
నీ స్పర్శకు నేనద్దుకున్న మనోభావమిది
No comments:
Post a Comment