Sunday, 25 April 2021

// నీ కోసం 305 //

 నీ తీపిబాధల కలతనిద్రను తీర్చేందుకు

ఒడిలో నువ్వొదిగినప్పుడల్లా
నా కురులనే చీకటిచేసి రాత్రిని రప్పిస్తాను

నీ హృదయం పరిమళించేందుకు
వెచ్చని సామీప్యపు ఏకాంతంలో
పూలవనమే తాకిడయ్యేలా నే వికసిస్తాను

మెడఒంపులో నీ శ్వాసల గిలిగింతలకేమో
ఎలకోయిల పరవశినై పులకరిస్తాను

నీ దేహస్పర్శలోని స్వరాలవెల్లువతో
వసంతహేల నేపధ్యముగా
నిరంతర మోహగీతాలు ఆలపిస్తాను

నీ చూపులాడుతున్న లేతకబుర్లకు
ఎదలో తడిపొడి చినుకులు కురిసి
సిగ్గులు మొగ్గలయ్యేలా తపిస్తాను

అవును..
నీకూ నాకూ మధ్య దిక్కుతోచని గాలి 
అచేతనమై ఉక్కిరిబిక్కిరవుతున్న యాతన 
ఒక్కసారైనా చూడాలి

మనస్సంగమ మధురిమలన్నీ
మనవైన సజీవ క్షణాలుగా
ఉప్పొంగుతున్న వెల్లువవ్వాలి

హాయిరాగాల వివశత్వమంతా
నిశ్శబ్దపు తీరాన ఆనందభాష్పమై
నింగి సరిహద్దునాగాలి

అందుకే, కొసరు కావాలనుందీ కొంటె రాత్రి
ఒకరికొకరం లీనమయ్యే రసయాత్రకి..

🥰

No comments:

Post a Comment