Monday, 26 April 2021

// నీ కోసం 315 //

 మనసు మిణుగురై నిన్ను చేరిన చీకటిలో

నా మైమరపుభావం నీ చూపుల ఎర్రదనం
నిశ్వాసల చిరుసవ్వడి నన్ను తాకిన ఏకాంతంలో
నీ మౌనాక్షరం నా నిశ్శబ్ద సంగీతం

అచ్యుతానంద జలపాతం నీ గుండెచప్పుడై
నా గానంలో కలగలిసిన గాంధర్వం
చలనమాగిన సంద్రం తీయగ మారినట్టు
కాలాన్ని పరిహసించు నీ వ్యక్తిత్వం

I know that U r an Alpha Male 


ఆ హృదయంలో తేజస్సు
సూర్యుడ్ని ధిక్కరించు కాంతిపుంజం
మోహనవంశీ మనోహరమైన ఆ స్పురధ్రూపం
మనోజ్ఞ మకరాంక శుక్లపక్ష చంద్రుని చందం

అలా..
కవ్వించే కలల సందర్శనలో నువ్విచ్చేసాక..
ఏమరపాటు పరిమళమంతా నీ ధ్యాసలో మల్లెలేనిక 



// నీ కోసం 314 //

 ఏమి రోజులివి

భరించలేని విషాదాల్ని చూట్టూ పేర్చేసి
ఊసులు నెమరేస్తూ ఆశలను పెకిలిస్తున్నవి

ఎవరికి వారు నమ్మకం కోల్పోయి
తమ నీడను చూసి తామే తడబడేలా
కొన్ని ఆర్తనాదాలు గొంతులేస్తున్నవి

కరుగుతున్న తారీకుల్లో
పండగలూ పబ్బాలు మరిచినట్టయి
మృత్యుపొలికేకలు మాత్రమే వినబడుతున్నవి

ప్రకృతి మీద భరోసా
నిశ్శబ్దంలో నిక్షిప్తమైనట్టు
పదాలేవీ ప్రాణం పోసేందుకు రానంటున్నవి

ప్రేమాన్వీ..
భద్రతంటూ ఉన్నదెక్కడ చెప్పూ..
నీ హృదయాన్ని ఆవిరిపడుతూ
ఆ పంజరంలోనే నన్నుండనివ్వి 



// నీ కోసం 313 //

 నిశ్శబ్దంలో మది సంగీతాన్ని ఆపలేకున్నా

నీ హృదయలయను ఇష్టంగా ఆలకించే

విరజాజి మొగ్గలా నవ్వులు దాచలేకున్నా
పూలతోటలో సీతాకోకలా నువ్వు చుట్టుముట్టే

మృదువైన భావనొకటి ముచ్చటగా దాచుకున్నా
అచ్చంగా నీకిమ్మని మనసు చెప్పబట్టే

కన్నులు విప్పారి రెప్పలసలే మూయలేకున్నా
ఆనందపు మధురిమేదో అలలుగా ముంచుకొచ్చే

ప్రేమాన్వీ..
పరవశాల చైత్రమిక పురివిప్పినట్టే 

 

// నీ కోసం 312 //

 మానసికంగా అలసిపోయినప్పటి స్తబ్దత

పైకి నిశ్చలత్వంగా అనిపించే ఓ ఉద్విగ్నత
కనుకే..
మనస్ఫూర్తి మాటలు సెలవడిగి
కదులుతున్న కాలాలు శిధిలమైతే
జీవితం విసుగనిపించే సుదూర ప్రయాణం

Sometimes emotions will b overrated..

నిశ్శబ్దపు నీలిజాడల పరావర్తనం
ఓ భావాతీత నిర్వేదమైతే
అనుభూతిరాహిత్యపు మౌనం
ఎప్పటికీ అసంపూర్ణ వర్ణమే
కానీ..
అనాలోచిత గమ్యమంటూ ఏదీ ఉండదు
ఆహ్వానం అందుకున్నది ఆత్మీయంగా అయితే 


Sunday, 25 April 2021

// నీ కోసం 311 //

 అష్టపదులు పాడుకొని

చానాళ్ళయిందనుకోగానే
ఇదేం మాయా మోహనమో

నువ్వేమో కొంటెకన్నయ్యవై
అనురాగమంత నన్ను రాధికను చేసి
ఏకంగా మధురానగరిలోకే పయనమా

పల్లకినీ పడవనీ కాదని
ఈ రాతిరేళ ప్రణయరధములో
విరహమంతా విస్తుపోయేంత విహారమా

కన్నులకిందే ఇంత కమ్మని కల
దాక్కుందని నిజంగా తెలీలేదు
ఏ రేయి తెల్లారకుంటే బాగుండు
కొన్ని కవనాలు కదంబాలుగా కూర్చుకోవచ్చు 



// నీ కోసం 310 //

 చల్లగా ఉన్నా ఉక్కిరిబిక్కిరి తబ్బిబ్బు కావడం నీపైన అభిమానమేనా, ఏమో సన్నని నీ చిరునవ్వుకి నాలో ఇంత ఆర్తి పుడుతుందెందుకు.. కురిసినప్పుడు వెన్నెల్లా, కరిగినప్పుడు కర్పూరంలా, కవిత్వాన్ని కలగనేలా ఉంటుందనేమో.. నాలో అల్లరి అప్పటికప్పుడు ఒద్దిక నేర్చిన ఆదమరుపవుతుంది. కనిపించని గాలిలోని నిశ్శబ్దసంగీతం నీ ఉనికిని అందించి సేదతీర్చేందుకు చూసినా.. దగ్గరకొచ్చి దూరమైన రంగులకలను తిరిగి పొందాలని జోకొట్టిన రాత్రిని కళ్ళు నిదురపోనిస్తేగా.


కాసేపు కిటికీలోంచీ ఆకాశాన్ని తాకి కొన్ని నక్షత్రాలను తెంపుకొచ్చి రవ్వల గొలుసుగా గుచ్చుకున్నా, రంగు రంగుల పూలెన్నున్నా ఊదారంగు పువ్వులే నాకెందుకు ప్రత్యేకమో ఆలోచించినా, మంచులో ఒకే మాదిరి తడుస్తున్న గడ్డిపూలూ, మల్లెలూ ఏం కబుర్లు చెప్పుకుంటున్నాయో ఆలకిస్తున్నా, ఎన్ని క్షణాల అనుభూతులు దాచుకున్నా.. నిన్ను తలచిన తాదాత్మ్యానికి సరి రావెందుకు?! ఇంకా సంపెంగల తీపివాసన మనిద్దరికీ ఎంతిష్టమో గుర్తుచేసుకోమనకు. కన్నుల్లో మెరుపు గుండెల్లోచేరి రక్తాన్ని వేడెక్కించి ఓరచూపులు చూస్తుంది చూడు. మౌనంగా మనసుతో సంభాషిస్తానంటే సరిపోదిప్పుడు. మృదువైన ఊహలు చిలకలగుంపులై ఇన్ని ఊసులేమిటో పెదవిప్పి మరీ అడుగు.

నా సమస్త ప్రాణమూ చైతన్యవంతమై నిన్నే తలచుకుంటుంది. భరించలేనంత చీకటిలోనూ కొంత వెలుతురుందంటే, అది లోపల నుండీ ప్రసరిస్తున్న నీ ప్రతిబింబానిదే. ఎక్కడ ఉన్నా నా ఏకాంతానికి కదిలొచ్చే నీ అడుగులు నాకు సంభ్రమాలు కనుకే నాకిన్ని స్పందనలు. గంపెడు గులాబీలను శ్వాసిస్తున్నట్లు.. నీ పరోక్షంలో చలిస్తున్న ఈ పరిమళం నీరాకది కాక మరేది. ఆకాశానికి సంద్రానికీ లేని సరిహద్దు మనకెందుకనీ, నువ్వొస్తే మోహానికి మరువాన్ని కలిపి అలౌకికం చేసేద్దాం..



// నీ కోసం 309 //

 ముసురేస్తున్న సాయంసంధ్య లేతచీకట్లో

ఎటుచూసినా నీ ప్రతిబింబం
లౌకికానికి నన్ను దూరం చేసి
దిగ్బంధం చేసిన వలయమవుతుంది

నా ఏకాంతాన్ని స్వాధీనం చేసుకునేందుకు
నీలో పల్లవి.. దూరాలు దాటొచ్చి
నాతో చరణాలు కలుపుతుంది

ప్రేమనే మధురాక్షరం చేసి
విరహంతో అల్లుకున్న పదాలనేమో
వసంతమంతా సంచరిద్దాం రమ్మని
ఉల్లాసంలోకి నెడుతుంది

నన్ను వెతుక్కుంటూ వచ్చిన నీ పాట
నా అమూర్తస్థితి మైమరపుగా
దేహానికి తాపిన మకరందమై
తీపి తన్మయత్వాన్ని పొంగిపొర్లుతుంది.. 

 


// నీ కోసం 308 //

 నువ్వు మాట్లాడి చాలాసేపయినా

ఇంకా ఏదో చెప్తున్నట్టే అనిపిస్తుంది
హృదయస్పందనలో పేరు తెలియని రాగం
నీ పల్చటి నవ్వుని ధ్వనిస్తున్నట్టుంది

నిశ్చలంగా జారుతున్న చీకటితెరను
పట్టించుకోకనే కురుస్తున్న వెన్నెల
నా కలను నీ నోట వినిపిస్తూ
పున్నమి పరవశాన్ని పెంచేస్తుంది

గగనకుసుమాలన్నీ నిలువెత్తు నీలా మారి
ఊపిరాడనివ్వని మత్తులో ఊపేస్తుంటే
అశ్రువులన్నీ అంతులేని అక్షరమాల చేసి
నీ ఎదనే అలంకరించాలనుంది తెలుసా

నీ సమక్షంలోని నా ఆనందాన్నడుగు
నే కల్పించుకున్న ఆత్మబంధాన్ని చెప్తుంది
లేదా నీ ఇంద్రియాల లాలసనే అడుగు
నీలో ఆర్తికి సరిపడా కవిత్వాన్ని వినిపిస్తుంది 



// నీ కోసం 307 //

 ఆదమరచిన ఏకాంతంలో

మెత్తగా నిన్నారాధిస్తున్న చూపులకు
నువ్వు చనువుగా స్పందిస్తే చాలు
కిలకిలలు రువ్వే పసిపాపనవుతున్నా

నిశ్శబ్దం పల్చబడిన ఆర్తిసంగీతపు నిర్వచనమే
నీ సహృదయ స్వభావము కాగా
సిరివెన్నెలలు, రంగులకలలూ ఏకమై
మనసుని ముంచెత్తే అలలతో
నువ్వలా చేయి చాచినప్పుడల్లా
గుండెల్లో ఎగిసే వెచ్చనిపొంగుకి తేలుపోతున్నా..

నువ్వూ నేనూ ఒక లోకమయ్యేవేళ
తనువెల్లా మనసై పరవశించే
ఈ గాఢసుషుప్తిలోంచీ నన్ను కదల్చకు
నీ ఎదసవ్వళ్ళను ఊహించే క్షణాలివి

అవునిప్పుడు పువ్వులన్నీ ఊదారంగులే
నీ స్పర్శకు నేనద్దుకున్న మనోభావమిది 



// నీ కోసం 306 //

 ముద్దుగా మూడు ముచ్చట్లు..


1. రెండు గుండెల చప్పుళ్ళు
రెండు పెదవుల కచేరీలు
కలుపుతూ మొదలైన తన్మయానుభవం

కొన్ని కాంక్షలంతే
సమస్తాన్ని ఆవరించి

రహస్యంగా కలిసిన కన్నుల్లో
ఓ కల కావ్యమవ్వాలంతే

2. కొమ్మెత్తు పువ్వుల నివేదిక
అనంతానంత హృదిలో
ఆత్మ ఒక్కటే
దేహాలే రెండు

3. ఉన్మత్త కెరటాల హోరులో
పట్టుజారిపోతున్న తీరపు పరవశం
సముద్రాన్ని కాదనలేని
అమృతపు క్షణాలు 


// నీ కోసం 305 //

 నీ తీపిబాధల కలతనిద్రను తీర్చేందుకు

ఒడిలో నువ్వొదిగినప్పుడల్లా
నా కురులనే చీకటిచేసి రాత్రిని రప్పిస్తాను

నీ హృదయం పరిమళించేందుకు
వెచ్చని సామీప్యపు ఏకాంతంలో
పూలవనమే తాకిడయ్యేలా నే వికసిస్తాను

మెడఒంపులో నీ శ్వాసల గిలిగింతలకేమో
ఎలకోయిల పరవశినై పులకరిస్తాను

నీ దేహస్పర్శలోని స్వరాలవెల్లువతో
వసంతహేల నేపధ్యముగా
నిరంతర మోహగీతాలు ఆలపిస్తాను

నీ చూపులాడుతున్న లేతకబుర్లకు
ఎదలో తడిపొడి చినుకులు కురిసి
సిగ్గులు మొగ్గలయ్యేలా తపిస్తాను

అవును..
నీకూ నాకూ మధ్య దిక్కుతోచని గాలి 
అచేతనమై ఉక్కిరిబిక్కిరవుతున్న యాతన 
ఒక్కసారైనా చూడాలి

మనస్సంగమ మధురిమలన్నీ
మనవైన సజీవ క్షణాలుగా
ఉప్పొంగుతున్న వెల్లువవ్వాలి

హాయిరాగాల వివశత్వమంతా
నిశ్శబ్దపు తీరాన ఆనందభాష్పమై
నింగి సరిహద్దునాగాలి

అందుకే, కొసరు కావాలనుందీ కొంటె రాత్రి
ఒకరికొకరం లీనమయ్యే రసయాత్రకి..

🥰

// నీ కోసం 304 //

 నిన్ను తలచినప్పుడల్లా మౌనంగా నువ్వు

ఊ కొట్టినట్లనిపించే ఊహలతోనే

రోజు గడిచిపోతుంది..

అదేమో.. ఈ రాతిరి..
అలల మీదుగా కదులుతున్న లేతవెన్నెల
ప్రవహించేందుకు రమ్మనగానే..
గతంలో కావ్యగానం చేసిన సాక్ష్యంగా
హృదయతంత్రులు మీటినట్లనిపించిన
నీ గొంతు గుర్తుపట్టి నేనాగానలా
మరైతే ఇన్నాళ్ళుగా వీచే గాలివాటు
గలగలలు నువ్వాలకించి..
బదులిచ్చిన ఉదాత్తపు గుసగుసలు నిజమేనా
నువ్వు పట్టించుకోని క్షణాలన్నీ
పరిమళించే మల్లెలుగా..
నేనూ మత్తెక్కిన కోయిలనైపోయానేమో
చిమ్మచీకటిలో చందనలేపనం
నా ఉనికనిపిస్తే చెప్పు
ఈసారి నీకిష్టమైన రాగానికి
అరమోడ్చిన కొనసాగింపులో నేనుండిపోతా