Thursday, 25 July 2019

//నీ కోసం 21//

చూపులకందిన జాబిలి నీవని
చీకటి తరిమిన ఛురికవు నీవని
జీవితమంత పండుగ మనదని 
ఒప్పుకునుంటే బాగుండేది..
మనసున మెదిలే మెరుపువు నీవని
రెప్పలకంటిన రాగం నువ్వని
జీవనవేద సంగీతం మనదని
నమ్మకముంటే బాగుండేది..
కాలం కదలికలాపదని
అనుబంధమీ జన్మది కాదని
మాటలకందని ప్రేమొకటుందని
తెలుసుకునుంటే బాగుండేది..
దేహానికి మరణం ఉంటుందని
ఆత్మ నిరంతర సాక్షియని
అలుపెరుగని ఆకాశానికిది తెలుసునని
ప్రాణమాగిన చోటే మరో పుట్టుకని 
ఓదార్చుకునుంటే సరిపోయేదని... 


//నీ కోసం 20//

కన్నుల కరచాలనం చేసినప్పుడు అనుకోలేదు మనసు రేకులుగా విచ్చి పరిమళిస్తుందని

నాలుగు మాటలకని దోసిళ్ళు పడితే ఏకంగా వెన్నెలపాటలు పంచినట్టు నా తలపులూ తపనలు నీకే రాసిచ్చేసాను

విరహవీణ పలికిన రాగాలు రాలుగాయివని నీ పాలనవ్వుల్లోని గమకాన్ని చూసే గుర్తుపట్టాక
నా హృదయం పులకింతల వశమైంది

నీలో కదలికలు మోహన చంద్రికలై వరుసకట్టాక
 మనసంగమం మధుర బృందావనంలోని రాసక్రీడకు గిలిగింతల సరసమద్దింది

పల్లవించు కాలం ముందుండగా నీతోనే శృతి చేసుకుంటా  జీవితం.. 
నీ ఎద మల్లెలపొద పానుపు చేసి నా అలుక తీరుస్తావు కదూ..

//నీ కోసం 19//

రోజులు కరిగి గంటలుగా మారడమంటే ఇదే కదా..
ఎదురుచూపుల తారకలు దిగివచ్చి మెడలోని మాలను చేరినట్టు 
గుండెచప్పుడు సంగీతానికి లయ చెదిరింది

అంతరంగపు ఆనందం నాకై ఎదురుచూస్తున్న నీదైనా
ఆసాంతం పరిమళిస్తున్నది నేనంటే నమ్మగలవుగా
నీ కలువకన్నుల కిరణాలతో నా మనసు వెలగాలి
వైశాఖ పున్నమి పులకింతలన్నీ చెరిసగం కావాలి

పదే పదే అందుకే పాడుతున్నా
దూరం తరిగే క్షణాలను దోసిట్లో లెక్కకడుతూ..

//నీ కోసం 18//

చాన్నాళ్ళుగా తపిస్తున్న   అనురాగం ఆనందపూర్ణ జలపాతంలో ముంచి తేల్చే  క్షణం నీ సమక్షానికేమో..
కన్నులు కలిసిన ప్రతిసారీ మెరిసే మిణుగురులైతే నన్నుర్రూతలూపే సుముహూర్తం నీ చూపుల కౌగిలింతకేమో..

విహంగాలై ఎగిరే  వినూత్న కోరికల విశేషాలు ఏ సమ్మోహనపు అనుసరణలోని నీ సమీపానికో..
ఎదలయలో కలగలిసిన ప్రియమైన అనంత కలల సుప్తావస్త నీ తలపుల వైపుకో..

ఏమో ఈ తాపమింత..వసంతంలో గ్రీష్మమై నేను జ్వలించేంత..ఇహ నువ్వేగా అందించాలి నులివెచ్చని పులకరింత.. 
ఎదురుచూస్తున్నానిలా నా సమయం అంతా..నువ్వొస్తే అందిస్తావని మురిపెమంతా

//నీ కోసం 17//

ఏం కనిపించిందా కన్నుల్లో
ఎన్నోసార్లు కలలో కలుసుకున్న నీ రూపం
నా నిరీక్షణకు ఊరటయ్యిందనిపించలేదా
చదివేందుకు ప్రయత్నించావనే అనుకున్నా
జన్మజన్మల ఆర్తి ఆనందమై నిన్నూపలేదా
నా నిదురని ఎత్తుకుపోయిన నీ ఆనవాళ్ళు
పోల్చుకోనట్టే ఉండిపోయావు కదూ
ఊపిరాడనివ్వని ఊసులు కలబోసుకోవాలనుకున్న కళ్ళే
బరువెక్కిన నిశ్శబ్దాన్ని చెరిపేందుకు ఓడి
కన్నీటికి దారిచ్చి నవ్వుతున్నవిప్పుడు
ఏమో..కొత్తగా శూన్యాన్ని పరిచయించక్కర్లేదనేమో
తడిచూపులకెన్నడో అలవాటు పడ్డవేగా ఈ కళ్ళు..

//నీ కోసం 16//

వివశత్వం కావాలా..
నా పెదవుల్లోనో
దేహమలుపుల్లోనో వెతుక్కోక
కలలో ఏం వెతుకుతున్నావు...
అప్పుడంతా..
నీకు నిద్రసుఖంతోనే సరి..

సహజత్వం ఆశించావా..
నా మనసులోనో
మాటల్లోనో కనుగొనక
తలపుల ధ్యానం మొదలెట్టావా..
అదంతా..
కేవలం నీ ఊహనే కదా

మౌనాన్ని మోహించేవా..
గుండెను మూసేసి
రంగును దాచేసే
శూన్యాన్నేం శోధిస్తావు
అందుకే..
అందిన మనసుని పుచ్చుకో
లోలోపలి ఆనందం రెట్టింపయ్యేలా..😉😍 

//నీ కోసం 15//

పొమ్మన్నప్పుడల్లా ఎక్కడికి పోనూ
 అంటూ చిలిపిగా ప్రశ్నించే నీకు ఏ మాట వినాలనుందో  నాకు తెలుసు..
ఒక్కసారి ఎదలోకి అడుగేసాక 
ఎన్ని తకధిములైనా నీ హృదయవేదిక మీదనేనని నీకూ తెలుసు..
శూన్యాన్ని సైతం వెలిగించే తలపులుండగా
 పరితాపమైనా పరిమళించాలే కానీ వెలితిని శ్వాసించరాదు కదా..
ఇచ్చిన ప్రాణమంటి కానుక  పదిలంగా దాచుకున్నప్పుడే 
నీ మది మహారాజ మందిరమని గుర్తించు..



//నీ కోసం 14//


నిన్నూనన్నూ కలిపిన వసంతరాత్రి ఊసులు
ఆకుచాటు పూరేకుల సొగసుగా ఎవ్వరికీ వినిపించను
ప్రణయవేదం పలికే విరహవీణ నాదని 
మల్లెపూలు తోటలన్నీ నిట్టూర్పులిక్కడ

ఏ శుభసమయంలో చూపులు కలిసినవో
ఋతువులు మరచిన రాగం 
నా చిరునవ్వుగా నీ రసయోగమయ్యింది


ఇంకేమింకేమింకేం కావాలి..
మునిమాపు మోహనాల అష్టపదులన్నీ నిన్నే పాడుతున్నాక..

//నీ కోసం 13//

నిన్ను తాకిన తొలిసారి 
ప్రపంచమంతా ప్రేమే నిండి ఉందన్న అపురూపమైన భావన

అనంతమైన పువ్వుల పుప్పొడిని ఒకేసారి జల్లినట్టు 
ఊపిరిలో విలీనమైన మట్టిపరిమళం లాంటి పరవశం
కనిపించని గాలి ఏడుస్వరాలను కలగలిపి కొత్తరాగాన్ని సృష్టిస్తున్నప్పుడు
అంతులేని వెన్నెల జలపాతమేదో కురుస్తున్న అనుభవం

క్షణాలన్నీ తనివితీరా తడిచిపోతున్నట్టి ఆవిరిలో 
మది సుషుప్తికి చేరి 
మూసిన గుప్పిట్లో మల్లెలు ఆస్వాదించమన్నట్టు సంతోషం 

మైకం నీ కన్నులదో నా నవ్వులదో తెలీకపోయినా 
అదో పూల రథంపైన ఊరేగుతున్న సంబరం..
ఆమని ఆశల చివుళ్ళకు ప్రాణం పోస్తుందని తెలుసు కానీ
పరితపించే ఎదలను ఒకటి చేసి మురుస్తుందని తెలీదు

ఎంతలా కలవరించి పలవరించి కదిలావో
నా గుండెలో మొదలైన కిలకిల రావాలు
నీకు మాత్రమే వినబడ్డ మధుర సవ్వళ్ళు..
నీ అరచేతుల్లో పూచిన మోము
తొలిసారి చైతన్యబింబమై వలపుని ప్రకటించాక
నీలో మెరిసిన మెరుపు నా దీర్ఘ కవనమైందిప్పుడు..

//నీ కోసం 12//

ఘనీభవించిన చీకటిలో తప్పిపోయిన వెచ్చదనం
ఒక కౌగిలికి కూడా కలవరించేంత దౌర్భాగ్యం
ఎన్ని మనస్థాపాలు తట్టుకుంటే కలుగుతుందో
ఎవరికెవ్వరూ ఏమీ కాలేరన్న నిర్వికారం

తడబడ్డ మాటలు వెనక్కి తీసుకోమనేం లాభం..
స్వప్నాలకి సుదూరంగా జీవితాలుంటాయని తెలిసాక
వికారంగా ఉన్నా కొన్ని చారికల్ని చెరపలేము
గాయపడ్డ శకలాలుగా వాటికి గుర్తింపొచ్చాక..

గాలి బరువెక్కడం తెలుస్తోంది
మాటలు మాలలుగా అల్లలేని నా అవస్థ చూసి

//నీ కోసం 11//

మాటలూ మౌనాలూ మాత్రమే తెలుసనుకున్నా మన పెదవులకి
పచ్చిపాల మీగడేదని నువ్వడిగేవరకూ..

ఏకాంతానికింత తహతహ తెలుసని నీ కొసపంటికింద నలుగుతున్న నా పెదవి చెప్పేవరకూ..

మదిలో దాహానికి పెదవులొకటై తీరుస్తాయని అబద్దం చెప్పావెందుకు
ఇప్పుడీ దేహానికి మొదలైన వెక్కిళ్ళు తీర్చే మంత్రం నీకే తెలుసని ఒప్పుకొనేట్టు చేస్తున్నావు

సొగసు బరువెక్కిన సంగతి తెలీనట్టు మెత్తగా ఏం నిమురుతావో
నా ఊహకి నన్నే సిగ్గుపడేట్టు చేస్తూ వలపు వీణను మీటుతావు..
నన్ను నీలో దాచేసి నీతో ఉన్న హాయి పెంచేస్తావు


చీకటిపందిట్లో నీ కనుపాపలకెన్ని నవ్వులో
ముద్దులు పంపకాల్లో నువ్వు ముందున్నప్పుడు
నీ చురుక్కు చూపులు నన్ను వెక్కిరించినట్టు..

ఈ తడిగాలి మోసుకొస్తున్న నారింజపువ్వుల వాసనకేమో
కలగా మొదలైన కోరిక అలగా నిన్నల్లుకుంది
ఇప్పటికీ గమ్మత్తులో కాలం కరుగుతూనే ఉంది..


//నీ కోసం 10//

అజ్ఞాన శిలనైన నేనో అందమైన శిల్పముగా మారాననుకున్నా
నువ్విచ్చిన నులివెచ్చని పరిష్వంగం కలలోనిదైనా..
ఎదపై వాలిన ప్రతిసారీ నీ తోడుంటానని మాటిచ్చావే
కెరటమై ముందుకొచ్చినట్టే వచ్చి ఎందుకలా మాయమయ్యావ్..

నువ్వో నిశ్శబ్దానివని తెలిసినా
నా సంగీతపు మధురిమలో ఓ గమకముగా మార్చాలనుకున్నా
ఇదే ఆఖరిదనుకుంటూ 
గాయమైన ప్రతిసారీ నిమురుకుంటూ నన్ను నేనే ఓదార్చుకున్నా 

పీడకలలోంచీ లేచిన ప్రతిసారీ నిన్నే తలచుకున్నా
గాఢమైన విరహాన్ని దూరం చేద్దామనే..
పువ్వొత్తుల పొగలో నీ మొహం దాచుకున్నాక
యుగాలకి సరిపడా విషాదాన్నిప్పుడు నే పులుముకున్నా..

//నీ కోసం 9//

నీ చూపులు వ్యక్తం చేసిన దాహానికి
పరిమితి తెలియని తేనెలూరిన పెదవి
ఆర్తిని అందించేందుకని అధరాన్ని చేరింది
పులకింతలు రగిలి వెయ్యేళ్ళ బంధమిదేనన్నట్టు
నీ మది నేపధ్యాన్ని పరవగా
దేహానికి రెక్కలొచ్చి వనహంసలా ఎగిరింది 
కొన్నిజన్మల సరిపడా అనుభూతులు 
అల్లరిమువ్వలై కవ్విస్తుంటే
వివశమైన కన్నులు ఏడుజన్మల బాసలు
తమకు తామే చేసుకున్న స్వగతమయ్యింది 

మత్తుగా రెచ్చివిచ్చుకున్న రేయిలో
పాలబువ్వను ముద్దులుగా మార్చుకున్న తమకం
మనోస్వరాలు ఆలపించినట్టు
అణువణువుదో వింతైన మోహం
ప్రాణానికి అంటిన రంగులధూళి
వెన్నెల్లో వెచ్చగా కరిగినట్టు
నిదురరాని రాత్రి నీ తలపుతో
నేనాడుతున్న దాగుడుమూతలు
రాగాలై వినబడుతున్న మనోనాదాలు

రేపటికి దాచి ఉంచు కౌగిళ్ళు
కొన్ని పదాలుగా మారి నన్ను అల్లుకొనేందుకు

//నీ కోసం 8//

నిన్ను రాయకుండా నాకే రేయీ
నిదురన్నది రాదు
నా పాట వినందీ 
నువ్వూ కనులసలే మూయవు

సుతిమెత్తని స్పర్శతో
నవ్వుతూ నీ చూపులు
నా ఎదలోయల్లోనికి అడుగేస్తాయి 

పిలువకముందే 
స్వప్నవేణువులోని స్వరాల ఒద్దికలా
నాలో ఒదిగి కరిగిపోతావు

కనురెప్పలమాటు పులకించే
బిడియాన్ని అడిగానందుకే
నా ఏకాంతంలో నీకీ చొరవేంటని 

 నీ విశ్రాంతి చిరునామా
నా హృదయమని తెలిసాక
ఆ మైమరపునే నేను అనుభూతిగా మలచుకున్నా..
బహుశా నీకూ నాకూ దూరమలా తరిగిందేమో

//నీ కోసం 7//

ఏం వినాలని..
నీకోసం నేనున్నానని చెప్పే అవసరముందంటావా
అంతమైన నాలో వెలితికి కారణం 
నీ కమ్మని సాన్నిహిత్యమని తెలీదంటావా

ఊహల వెచ్చదనమందించే చల్లనిరాత్రులు
ఊపిరులొకటయ్యే మనసైక మధురిమలు
ఊరడిస్తూ లాలించే  నీ మిలమిల కన్నులు
ఊ కొడుతూ నే మైమురిసే చిరునవ్వులు

ప్రతీక్షణం ఇన్నిభావాలు ఒకరికికొకరం దోసిళ్ళతో 
కుమ్మరించుకున్నది నిజమే అయితే
ఇంకేం చెప్పను..
నీకన్నీ తెలుసన్న నిశ్చింత నాదయ్యాక