Thursday, 25 June 2020

// నీ కోసం 167 //

నీకు తెలిసిన అలల ఊపు 
నన్ను వెంబడించినప్పుడంతా
తలుపులు మూసినా తడిచిపోతున్నా

పూలకొమ్మ పలికే సంతోషం
దిగులు కావ్యమై వినిపించినట్లు
ఏవో అపూర్వక్షణాల పసరువాసన
ఆరాతీయాలనిపించని సమయం
రాసిన కాగితాల నిండా 
మాటలవని మౌనసంభాషణలే

కువకువలాడుతూ కదలవలసిన కాలం
కలకలమై కుదేలవుతున్న అరుదైన రోజుల్లో..
గుప్పెడు సరిగమలన్నా నీకు వినిపించనే లేదు
విరజాజుల కదంబమేదో నేను దాచినట్టు
నా పదాలకో సుగంధముందనే
నీ పరవశం నాకిప్పుడో రహస్యం

కొంచెం నిజం చెప్పూ..
ఎప్పుడైనా అదృశ్యంగా నీదికాని స్వప్నంలోనికి నడిచున్నావా
అలసిపోయి ఇన్నాళ్ళకు కూర్చున్నావేమో
ఓ లిప్తపాటు నీకందిన అమరత్వమే
నాలో చిరుపాట వెల్లువైన తన్మయత్వం 😊 

No comments:

Post a Comment