Tuesday, 2 June 2020

// నీ కోసం 166 //

ఈ పరిసరాల మీద ప్రేమొస్తుంది అదేమో..
నీ పొడి మాటలు మనసులో వినిపించినప్పుడంతా

సగం వెన్నెలే కురిసిందని రాత్రిని నిషేదించలేని కాలప్రవాహం చిద్విలాసంగా సాగుతూనే ఉంటుంది. మల్లెపూలు చేస్తున్న దండయాత్రకి తప్పించుకోలేని నేను, మధుమాసాన్ని భావుకత్వాన్ని అంటుకలిపేందుకు ప్రయత్నిస్తుంటాను. ప్రపంచమంతా ఒకవైపు తిరిగి నిద్రిస్తున్న సమయం, నువ్వొచ్చి పెట్టే కలవరంలో గుట్టుగా స్వరం మార్చుకొనే గుండెను ఆపలేకపోతాను.

ఎన్నో మలుపులు తిరిగే నది.. సముద్రం లోతు తెలీకుండానే ఎదురెళ్ళి కలిసినట్లు, ఈ అనంతానంత భావాలూ కరిగి, తిరిగి రోజు ముగిసేప్పటికి నీతోనే సంగమిస్తూ ఉంటాయి. నువ్వు కలవకముందు నాలో  లేని సంతోషం..ఇప్పుడు కొత్తగా పరిచయమై, గాఢసుషుప్తిలోకి పోదామని పదేపదే పిలుస్తుంది.  కనురెప్పల చాటు గాయాలన్నీ సమసిపోయి, ఓ గోరువెచ్చని ప్రశాంతతను ఇవ్వగల చీకటి రోజురోజుకీ అవధుల్లేని ప్రేమ పరిమళాన్ని పంచుతుంది. 

ప్రేమాన్వీ..
ఏదయితేనేం, సహానుభూతి సరిహద్దుల్లో నాకోసం చేయి చాచి నువ్వు నిలబడటం, నా అంతరంగానికందిన సాంత్వనం. ఈ విరామ క్షణాల మన ఏకాంతం, నాకత్యంత ప్రియమైన తీయని భాష్పం..💜💕  


No comments:

Post a Comment