ప్రేమాన్వీ..
తడికురుల మాటు తలపుల తెమ్మెర కదిలి రాత్రి తీరానికి చేరేందుకు తొందరపడినట్లు ఆకాశపు అంచులకేసి చూస్తుంది మనసు. నీలిమేఘం సంచరించడమాపి, చడీ చప్పుడూ చేయక ఏమాలోచిస్తుందో.. ఎరుపుదనం మసకబారుతూ నీ చూపుల పూలతావి తాకుతున్న పరవళ్ళు నాలో ఉష్ణప్రవాహాన్ని అధికం చేస్తాయి.
హరివిల్లు ఒంగి రాగాలు రాల్చినప్పుడనుకుంటా, నా గొంతులో నిశ్శబ్దం వలపు వేదనా స్వరమయ్యింది. తొలిసారి ఎద గుచ్చిన మొగలిరేకు పరిమళమైన సంగతీ గుర్తొచ్చింది. కనురెప్పపాటు జీవితాన్ని నీ నవ్వు మాయ చేసినట్టు..మనోదర్పణంలో చూసుకున్న ప్రతిసారీ చెరిసగమైన దేహాలు ధరించిన ఆత్మలు
దర్శనమిస్తాయి. ఎడతెరిపిలేని చిగురాకుల గీతాలాపన క్షణాల్ని వేడెక్కిస్తూ పసిడి కవిత్వాన్ని ఒలికిస్తాయి. సుదీర్ఘమైన కలను ఆశిస్తూ మూతబడ్డ రెప్పలు రేయంతా ఆశలకు ఆయువుపోస్తూ మురిసిపోతాయి.
వెదురుపూల వనంలో కొమ్మలన్నిటికీ సంగీతం తెలుసన్నట్టు, నీ మొత్తం నా గుండెల్లో పరవశానికి తెలుసు. ఎన్నో ఊహల్ని తపించిన కాలం అరచేతిలో అద్భుతమై, రంగు రంగుల తీపి రొదలతో ఉనికి కోల్పోతున్న శూన్యం ఊపిరి సలపనివ్వని అల మాదిరి ఎదురీదుతుంది. నీ చూపుల్లో, నవ్వుల్లో మాటలు ఏరుకోవడం తెలిసాక సమయమెప్పుడో కురచయ్యింది. తెలుసా..నీ ఆనవాళ్ళు నా కవ్వింపుకి చిక్కి పెదవుల్లో పాటలవుతాయి. సూర్యాస్తమయానికి నాలో ప్రాణాన్ని నింపి, నిన్ను మాత్రమే కలవరించమంటూ ఇష్టాన్ని కుమ్మరించినట్టు తడిచిపోతాయి. విరహం మెలిపెట్టినంతసేపూ కొసరి కొసరి భావకృతులు పల్లవిస్తాయి.
No comments:
Post a Comment