ప్రేమాన్వీ...
మనసు సరిహద్దుల్లో గిరిగీసుకు కూర్చున్నా, అదృశ్యదారాలతో నన్ను పెనవేసే నీ చాతుర్యాన్ని నా మాటల్లో వినాలనేగా. నిశ్శబ్దం నిషేదమన్నానని ఎదలో సవ్వళ్ళు రేపింది మొదలు, అపరాత్రయినా ఆదమరచనివ్వవు. ఈ అద్వితీయ తీపి అనుభవాలు,రోజుకోలా సందడి చేసే అల్లర్లు నాకూ మక్కువేలే. ఎక్కడున్నా..వేయి కళ్ళేసుకుని నన్నే చూస్తుంటావనే పిచ్చి నన్ను కొంచం కూడా నిలవనివ్వక నీ ఆత్మతో బంధాన్ని ముడేసిపెట్టేసినట్టుంది. అలుపెరుగని ఆలోచనా స్రవంతికెన్ని అందమైన పదాలు పుడతాయో నీ సావాసంతోనేగా తెలిసింది. నీ ఊపిరి నిశ్వాసలు నింగికెగిసిన తాపం, గ్రీష్మంలో వానగా మారిన వైనం, నా హృదయం చల్లబడ్డ సాంత్వనం.
రేపటి మీద గుప్పెడంత ఆశలేని నాకు, నీపై గంపెడంత ఆపేక్ష ఎందుకో అలా.. కలలకీ..కవిత్వానికీ ప్రతీక నువ్వన్న విషయం కొత్తది కాకపోయినా నాలో నీపై కదిలే అలజడి మాత్రం నిత్యనూతనం. గుండెలో దాగి ఉన్న స్వరాలన్నీ ఒకేసారి పల్లవించినట్టి పరిస్థితి అనుభవిస్తేగానీ తెలీదు. ఆరాధనా వీచికల నాదం సమ్మోహనం చేస్తుంటే, మౌనంలోనూ ఓ భావసాంద్రత ఉంటుందని తెలిసిన క్షణం మానసిక ఒంటరితనం పోయినట్టనిపిస్తున్న పరమానందం నాదిప్పుడు. ఎదలోని అనురక్తిదెంత తేజమో, నా ఊహల పరధ్యానానికంత చైతన్యం. నీ పదప్రయోగాల రసవంతమే నా వర్ణాలంకార సౌందర్యం. ఇంకా చెప్పమనంటే ఏం చెప్పనూ..
No comments:
Post a Comment