Thursday, 25 June 2020
// నీ కోసం 167 //
నీకు తెలిసిన అలల ఊపు
నన్ను వెంబడించినప్పుడంతా
తలుపులు మూసినా తడిచిపోతున్నా
పూలకొమ్మ పలికే సంతోషం
దిగులు కావ్యమై వినిపించినట్లు
ఏవో అపూర్వక్షణాల పసరువాసన
ఆరాతీయాలనిపించని సమయం
రాసిన కాగితాల నిండా
మాటలవని మౌనసంభాషణలే
కువకువలాడుతూ కదలవలసిన కాలం
కలకలమై కుదేలవుతున్న అరుదైన రోజుల్లో..
గుప్పెడు సరిగమలన్నా నీకు వినిపించనే లేదు
విరజాజుల కదంబమేదో నేను దాచినట్టు
నా పదాలకో సుగంధముందనే
నీ పరవశం నాకిప్పుడో రహస్యం
// అమృతవాహిని 14 //
ప్రేమాన్వీ..
తడికురుల మాటు తలపుల తెమ్మెర కదిలి రాత్రి తీరానికి చేరేందుకు తొందరపడినట్లు ఆకాశపు అంచులకేసి చూస్తుంది మనసు. నీలిమేఘం సంచరించడమాపి, చడీ చప్పుడూ చేయక ఏమాలోచిస్తుందో.. ఎరుపుదనం మసకబారుతూ నీ చూపుల పూలతావి తాకుతున్న పరవళ్ళు నాలో ఉష్ణప్రవాహాన్ని అధికం చేస్తాయి.
హరివిల్లు ఒంగి రాగాలు రాల్చినప్పుడనుకుంటా, నా గొంతులో నిశ్శబ్దం వలపు వేదనా స్వరమయ్యింది. తొలిసారి ఎద గుచ్చిన మొగలిరేకు పరిమళమైన సంగతీ గుర్తొచ్చింది. కనురెప్పపాటు జీవితాన్ని నీ నవ్వు మాయ చేసినట్టు..మనోదర్పణంలో చూసుకున్న ప్రతిసారీ చెరిసగమైన దేహాలు ధరించిన ఆత్మలు
దర్శనమిస్తాయి. ఎడతెరిపిలేని చిగురాకుల గీతాలాపన క్షణాల్ని వేడెక్కిస్తూ పసిడి కవిత్వాన్ని ఒలికిస్తాయి. సుదీర్ఘమైన కలను ఆశిస్తూ మూతబడ్డ రెప్పలు రేయంతా ఆశలకు ఆయువుపోస్తూ మురిసిపోతాయి.
వెదురుపూల వనంలో కొమ్మలన్నిటికీ సంగీతం తెలుసన్నట్టు, నీ మొత్తం నా గుండెల్లో పరవశానికి తెలుసు. ఎన్నో ఊహల్ని తపించిన కాలం అరచేతిలో అద్భుతమై, రంగు రంగుల తీపి రొదలతో ఉనికి కోల్పోతున్న శూన్యం ఊపిరి సలపనివ్వని అల మాదిరి ఎదురీదుతుంది. నీ చూపుల్లో, నవ్వుల్లో మాటలు ఏరుకోవడం తెలిసాక సమయమెప్పుడో కురచయ్యింది. తెలుసా..నీ ఆనవాళ్ళు నా కవ్వింపుకి చిక్కి పెదవుల్లో పాటలవుతాయి. సూర్యాస్తమయానికి నాలో ప్రాణాన్ని నింపి, నిన్ను మాత్రమే కలవరించమంటూ ఇష్టాన్ని కుమ్మరించినట్టు తడిచిపోతాయి. విరహం మెలిపెట్టినంతసేపూ కొసరి కొసరి భావకృతులు పల్లవిస్తాయి.
Saturday, 13 June 2020
// అమృతవాహిని 13 //
ప్రేమాన్వీ...
మనసు సరిహద్దుల్లో గిరిగీసుకు కూర్చున్నా, అదృశ్యదారాలతో నన్ను పెనవేసే నీ చాతుర్యాన్ని నా మాటల్లో వినాలనేగా. నిశ్శబ్దం నిషేదమన్నానని ఎదలో సవ్వళ్ళు రేపింది మొదలు, అపరాత్రయినా ఆదమరచనివ్వవు. ఈ అద్వితీయ తీపి అనుభవాలు,రోజుకోలా సందడి చేసే అల్లర్లు నాకూ మక్కువేలే. ఎక్కడున్నా..వేయి కళ్ళేసుకుని నన్నే చూస్తుంటావనే పిచ్చి నన్ను కొంచం కూడా నిలవనివ్వక నీ ఆత్మతో బంధాన్ని ముడేసిపెట్టేసినట్టుంది. అలుపెరుగని ఆలోచనా స్రవంతికెన్ని అందమైన పదాలు పుడతాయో నీ సావాసంతోనేగా తెలిసింది. నీ ఊపిరి నిశ్వాసలు నింగికెగిసిన తాపం, గ్రీష్మంలో వానగా మారిన వైనం, నా హృదయం చల్లబడ్డ సాంత్వనం.
రేపటి మీద గుప్పెడంత ఆశలేని నాకు, నీపై గంపెడంత ఆపేక్ష ఎందుకో అలా.. కలలకీ..కవిత్వానికీ ప్రతీక నువ్వన్న విషయం కొత్తది కాకపోయినా నాలో నీపై కదిలే అలజడి మాత్రం నిత్యనూతనం. గుండెలో దాగి ఉన్న స్వరాలన్నీ ఒకేసారి పల్లవించినట్టి పరిస్థితి అనుభవిస్తేగానీ తెలీదు. ఆరాధనా వీచికల నాదం సమ్మోహనం చేస్తుంటే, మౌనంలోనూ ఓ భావసాంద్రత ఉంటుందని తెలిసిన క్షణం మానసిక ఒంటరితనం పోయినట్టనిపిస్తున్న పరమానందం నాదిప్పుడు. ఎదలోని అనురక్తిదెంత తేజమో, నా ఊహల పరధ్యానానికంత చైతన్యం. నీ పదప్రయోగాల రసవంతమే నా వర్ణాలంకార సౌందర్యం. ఇంకా చెప్పమనంటే ఏం చెప్పనూ..
Tuesday, 2 June 2020
// నీ కోసం 166 //
ఈ పరిసరాల మీద ప్రేమొస్తుంది అదేమో..
నీ పొడి మాటలు మనసులో వినిపించినప్పుడంతా
సగం వెన్నెలే కురిసిందని రాత్రిని నిషేదించలేని కాలప్రవాహం చిద్విలాసంగా సాగుతూనే ఉంటుంది. మల్లెపూలు చేస్తున్న దండయాత్రకి తప్పించుకోలేని నేను, మధుమాసాన్ని భావుకత్వాన్ని అంటుకలిపేందుకు ప్రయత్నిస్తుంటాను. ప్రపంచమంతా ఒకవైపు తిరిగి నిద్రిస్తున్న సమయం, నువ్వొచ్చి పెట్టే కలవరంలో గుట్టుగా స్వరం మార్చుకొనే గుండెను ఆపలేకపోతాను.
ఎన్నో మలుపులు తిరిగే నది.. సముద్రం లోతు తెలీకుండానే ఎదురెళ్ళి కలిసినట్లు, ఈ అనంతానంత భావాలూ కరిగి, తిరిగి రోజు ముగిసేప్పటికి నీతోనే సంగమిస్తూ ఉంటాయి. నువ్వు కలవకముందు నాలో లేని సంతోషం..ఇప్పుడు కొత్తగా పరిచయమై, గాఢసుషుప్తిలోకి పోదామని పదేపదే పిలుస్తుంది. కనురెప్పల చాటు గాయాలన్నీ సమసిపోయి, ఓ గోరువెచ్చని ప్రశాంతతను ఇవ్వగల చీకటి రోజురోజుకీ అవధుల్లేని ప్రేమ పరిమళాన్ని పంచుతుంది.
ప్రేమాన్వీ..
// నీ కోసం 165 //
రేయంతా అనిద్రలో గడిపిన నాకు
ఉదయానికి ప్రాణం బిగపట్టినట్టు ఉండాలి కదా
ప్రతి అణువూ పరవశం నింపుకున్నట్టు హోరెత్తుతోందంటే
ఈ ఎండాకాలం మనిద్దరి నడుమ వంతెనేసినట్టే
నువ్వనుభవిస్తున్న విస్మృతి నా సంస్మరణమై
పొద్దుగూకులా ఎదనొరుసుకుంటూ తీపివ్యధని పెంచుతుందనేం చెప్పను
తవ్వుకోవడానికి జ్ఞాపకాలైనా ఉన్నవెన్నని..
సహజమైన నీ మనసు గుమ్మరించే నవ్వులే నాకు అందిన హిందోళరాగాలు
Subscribe to:
Posts (Atom)