Wednesday, 4 September 2019

// నీ కోసం 45 //

గతం మిగిల్చిన స్మృతులు పరాయిగా మారాక
వెలితిని పూడ్చుకోవాలనుకున్న కన్నుల్లో కన్నీరు
హృదయానికున్న బంధం కేవలం నీటిబుగ్గలని చెప్పేందుకేమో
ఒక్క నీటిబొట్టులో ఎన్నో రంగులు ప్రతిఫలిస్తూ ఆ మెరుపులు

అందమైన మలుపు తిరిగిన పరిచయం ప్రేమనే కదా అనుకున్నాం
అయినా ముగింపేదో తెలియని జీవితానికి ఇంత ఊగిసలాటెందుకో
పరిమళించిన మనసుపొరల్లోని రహస్యాన్ని దాచాలనుకోనందుకేనా
ఇప్పుడీ అనుభూతి చేజారుతుందని మది కలవరమవుతుంది

అయినా స్పృశించుకున్నవి ఆత్మలు కదా..
ఎందుకలా చిరునవ్వులు చిందే నీ కళ్ళను అనుమానిస్తానో
నా పేరు నువ్వు పలికినంతకాలం నవ్వుతూనే కదా నేనుండాలి
ఈసారి నువ్వొస్తే కాలాన్ని అలసిపోనివ్వకుండా ఆపేద్దంలే

ఇంకెప్పుడూ దిగులు మాటన్నది నీతో నేననను
అలికిడి లేని ఆకాశంలా కేవలం మౌనవిస్తాను

No comments:

Post a Comment