నీ హృదయం..
సుతిమెత్తని సౌహార్ధానికని చేయి చాచిందంటే
వెల్లువయ్యే సంద్రంలా నే స్పందించలేనా
విముక్తిలేని కలతల ఝరిలో
మునిగిపోతున్న నీ మనసుని తేల్చేందుకని
తటిల్లతల ఆశల స్పర్శ నేనందించలేనా
లోకం తన తగువులో
నీకు గాయం చేసినప్పుడు
నా ఒడి అనునయమే ఆచ్ఛాదన చేసి దాచుకోలేనా
అలలుగా పొగులుతున్న జ్ఞాపకాలతో
నీ దుఃఖం అధికమైనప్పుడు
నేనో ముద్దునై కాస్త పరవశాన్ని అందించలేనా
ఘనీభవించిన అశాంతి
నిన్ను దిక్కుతోచనివ్వని అలజడికి గురిచేసినప్పుడు
రవ్వంత రమ్యత్వాన్ని రుచి చూపలేనా
అందించాలనుకున్న ఆర్తినంతా
అరచేతుల ఆకుదొన్నెల్లోంచీ
అక్షయమంత అనురాగం చల్లగలనని
నీకెలా ఋజువు చేయనూ
వెలకట్టలేని ముత్యాలుగా
ఇన్ని మురిపాలు మాలగా అల్లావనే
హద్దుమీరిన మలయసమీరమై
మేఘరంజని మొదలెట్టా
ఇప్పుడీ వానంత విశేషమందుకే మరి ..



No comments:
Post a Comment