ఏడుస్వరాలుగా నేను విడిపోయి
నిన్ను వలపించిన క్షణాలకు తెలుసు
మనం కలిసి మూసుకునే నాలుగుకళ్ళలో రెండు
కలలతీరం వైపు నిరంతరం చూస్తుంటాయని
మలుపులు తిరిగిన కాలం నిశిరాత్రిలో ఆగి
వెన్నెల కెరటాల్ని ఆస్వాదించేవేళ
నువ్వేమో చుంబనపు ఆకలేసిందని చిరునవ్వుతావు
చిరుకోపం చూపులతో నేనేమో అలుకను సంధిస్తాను
చిక్కని పొదల్లో విచ్చుకున్న పారిజాతాలు
నేలదిగిన నక్షత్రాలై నిన్నూనన్నూ
వెచ్చబెట్టేందుకు పొగలు చిమ్మేంత పరిమళాలు చల్లి
మధుపానమంతటి మత్తును పెదవులకందిస్తాయి
రెప్పలపై రాసే ప్రేమకావ్యం పూర్తవగానే
తేనెతుట్టగా మారే తనువు
నువ్వే ప్రపంచమని నీలో దాగిపోతుంది
అరచేతులు చాచి పెనవేసుకున్న ప్రేమ
మన ఊపిరి గాలి చల్లారేంతవరకూ కొనసాగుతుంది..



No comments:
Post a Comment