Thursday, 19 September 2019

//నీ కోసం 46 //

నా చెక్కిళ్ళపై ముద్రించిన అనురాగం
వెన్నెల తక్కువైన రాత్రులలో
నీ ఉదాత్తపు సంతకాలుగా
నీకు నువ్వుగా అందించిన తాదాత్మ్యమది

నీలిరంగు ఆవిరిలేవో అడ్డొచ్చినట్ట్లు
కళ్ళు మూసుకున్న ప్రతిసారీ
పదివేల పువ్వులు తావిని కురిపించినట్టు
మనసంతా సువాసనేసే మధుర క్షణాల ఆహ్లాదమది

నీ సంతోషమంతా నాపై మళ్ళించినప్పుడు
ఆ అనురక్తిని పరితపిస్తున్న నేను
అసలా కళ్ళలోకి పూర్తిగా చూసిందెప్పుడని
ప్రవహించేందుకు అనువుగా ఉన్నాయని తేలిపోవడం తప్ప
అవును..
అదో అపరచిత ప్రపంచమే నాకు..
నీలోంచీ నువ్వు నాతో మమేకించేందుకొచ్చే
అనిర్వచనీయపు స్వర్గం

Wednesday, 4 September 2019

// నీ కోసం 45 //

గతం మిగిల్చిన స్మృతులు పరాయిగా మారాక
వెలితిని పూడ్చుకోవాలనుకున్న కన్నుల్లో కన్నీరు
హృదయానికున్న బంధం కేవలం నీటిబుగ్గలని చెప్పేందుకేమో
ఒక్క నీటిబొట్టులో ఎన్నో రంగులు ప్రతిఫలిస్తూ ఆ మెరుపులు

అందమైన మలుపు తిరిగిన పరిచయం ప్రేమనే కదా అనుకున్నాం
అయినా ముగింపేదో తెలియని జీవితానికి ఇంత ఊగిసలాటెందుకో
పరిమళించిన మనసుపొరల్లోని రహస్యాన్ని దాచాలనుకోనందుకేనా
ఇప్పుడీ అనుభూతి చేజారుతుందని మది కలవరమవుతుంది

అయినా స్పృశించుకున్నవి ఆత్మలు కదా..
ఎందుకలా చిరునవ్వులు చిందే నీ కళ్ళను అనుమానిస్తానో
నా పేరు నువ్వు పలికినంతకాలం నవ్వుతూనే కదా నేనుండాలి
ఈసారి నువ్వొస్తే కాలాన్ని అలసిపోనివ్వకుండా ఆపేద్దంలే

ఇంకెప్పుడూ దిగులు మాటన్నది నీతో నేననను
అలికిడి లేని ఆకాశంలా కేవలం మౌనవిస్తాను

// నీ కోసం 44 //

సుదీర్ఘ స్వప్నం తరువాత
ఇప్పుడే నిద్దుర లేచినట్టు
తదేకమైన ధ్యానం ముగిసి
కనుకొలుకుల్లో ఓ భాష్పం మెరిసింది

సప్తమినాటి సన్నని సంధ్యారాగం
నీ వలపు సంకెల వేసి
నే పాడుతున్న శంకరభరణాన్ని 
సారంగీ నాదానికి మళ్ళించింది

ఎప్పటిలానే పూస్తున్న పువ్వులు
నా నవ్వుల నేపథ్యంలా నీకనిపించలేదా
వెన్నెల ప్రమిదలా వెలిగే నీ మోము
నులివెచ్చని బంగారమై మెరవలేదా

నన్ను చేరే దూరం దగ్గరవుతోంది
మనసు మాటలన్నీ వినిపించేందుకు సిద్ధమవ్వాల్సిన సమయం కదా ఇది.. 
కలగా కదిలే మబ్బులగుంపు వైపు చూడకిప్పుడు
నా పరిమళాన్ని మోసుకొస్తున్న గాలిపాటను మాత్రమే ఆలకించు




// నీ కోసం 43 //

నీ హృదయం..
సుతిమెత్తని సౌహార్ధానికని చేయి చాచిందంటే
వెల్లువయ్యే సంద్రంలా నే స్పందించలేనా

విముక్తిలేని కలతల ఝరిలో 
మునిగిపోతున్న నీ మనసుని తేల్చేందుకని
తటిల్లతల ఆశల స్పర్శ నేనందించలేనా

లోకం తన తగువులో
నీకు గాయం చేసినప్పుడు
నా ఒడి అనునయమే ఆచ్ఛాదన చేసి దాచుకోలేనా

అలలుగా పొగులుతున్న జ్ఞాపకాలతో
నీ దుఃఖం అధికమైనప్పుడు
నేనో ముద్దునై కాస్త పరవశాన్ని అందించలేనా

ఘనీభవించిన అశాంతి
నిన్ను దిక్కుతోచనివ్వని అలజడికి గురిచేసినప్పుడు
రవ్వంత రమ్యత్వాన్ని రుచి చూపలేనా

అందించాలనుకున్న ఆర్తినంతా
అరచేతుల ఆకుదొన్నెల్లోంచీ
అక్షయమంత అనురాగం చల్లగలనని
నీకెలా ఋజువు చేయనూ

వెలకట్టలేని ముత్యాలుగా
ఇన్ని మురిపాలు మాలగా అల్లావనే
హద్దుమీరిన మలయసమీరమై
మేఘరంజని మొదలెట్టా
ఇప్పుడీ వానంత విశేషమందుకే  మరి ..


Monday, 2 September 2019

// నీ కోసం 42 //

నాలో ఉన్న ప్రేమ నిన్ను తపించిందని తెలుసా
ఎన్ని తీపి పదాలు పాటగా కట్టి
నీ చరణాలుగా కలిపి పల్లవించానో
ఎన్ని రాత్రులు నిద్దురకాచి 
నీకివ్వబోయే కావ్యాకృతిని కలవరించానో
విషాదపు వీధుల్లో సంచరిస్తున్న నిన్ను
నా అనుభూతి పొత్తిళ్ళలో విశ్రమించేందుకని పిలిచా..

అందుకోసమని..
అంతులేని కలలు దాచుకున్న నీ సోగకళ్ళు
నా ఎదురుచూపుని గమనించాలని తలచా
నన్ను మాత్రమే తడిపే చినుకులు
నువ్వు కురిపించే అనురాగం కావాలనుకున్నా
నా ఊహలు నీలో కదలికలు తెచ్చేవరకూ
స్వప్నాలతో చెలిమి చేయాలనుకున్నా

కానీ నువ్వో అనిర్వచనీయమైన వేదన
నుండీ వేరుపడి రావని తెలిసాక..
నీ దారిలో అడ్డుతొలిగి సుగమం అవ్వాలనుకున్నా
నాకు నేనుగా నిష్క్రమించాలని
ఎలా వచ్చానో అలానే వెనుదిరిగి వెళ్ళిపోతున్నా


// నీ కోసం 41 //

ఏకాంతంలోని నిశ్శబ్దం
నన్ను అనూహ్యంగా భయపెడుతోంది
నిన్నటి నీ మోహనమైన పిలుపు
ఈ ఉదయానికి మూగబోయింది.

అంతరంగీకరించుకున్న ఆశలు 
ఎటో కదిలిపోయిన కల..
వేకువను తలచే కొద్దీ చీకటి చెలరేగుతున్నట్టు
చాలా దూరం ప్రయాణించిన తరువాత  
ఈ మలుపులో..అదేమో ఒంటరిగా మిగిలాక
ఇంకోలా ఆలోచించాలని చూసినా
ఇంకొన్ని జ్ఞాపకాల వెంటేగా నీ అడుగులెప్పటికీ 

వాన రావడం ఒకందుకు మంచిదయ్యింది
నాలో నేను కరుగుతున్న చప్పుడు ఎవరికీ వినబడదు
తడివాసన బయటపడేలోపు గడ్డకట్టాలి
లేదంటే అంతమయ్యాయనుకున్న క్షణాలు ఊపిరి పోసుకుంటాయి
మరోసారి నన్ను చచ్చిపొమ్మని వేధిస్తాయి. 
కానీ..
కొన్నాళ్ళు బ్రతికుండటం అనివార్యమిప్పుడు
నాలో నేను రోజుకి పదివేలసార్లు ఛస్తున్నా ఎవరిక్కావాలిప్పుడు..

// నీ కోసం 40 //

దాహాన్ని తీర్చలేని నీళ్ళు కొన్నుంటాయి
కన్నీరని వాటినంటారు
కలత బారిన కళ్ళల్లో అవి స్రవిస్తుంటాయి

తీరానికేసి సముద్రమెంత ఉరకలేసినా
ఆహ్లాదానికి తప్ప అవసరానికి పనికిరావు
అందుకేనేమో తిరిగి వచ్చినచోటుకే వెళ్ళిపోతుంటాయి

శాశ్వతమంటూ ఏదీ లేని ఈ లోకంలో
అత్యంత విలువైనదిగా కనిపించేది అల్పమైన ప్రాణమే
అందుకే లోపలెంత తడిగా ఉన్నా దేహం పైకి వెచ్చగానే కనిపిస్తుంది

భావకుడైనా..భగీరథుడైనా..
ఓనాటికి కొలిచిన భూమిలో నిక్షిప్తమవ్వవలసిందే..
జ్ఞాపకాలు ఆయువు పోసే జీవితాలు స్వర్గమైతే
ప్రేమానుభవానికందని గుండెల్లో నిత్యనరకాలు
అందుకే బ్రతుకు నీటిబుడగయ్యింది
ఏ క్షణాన పగులుతుందో తెలీదు కాబట్టి..

// నీ కోసం 39 //

ఏడుస్వరాలుగా  నేను విడిపోయి
నిన్ను వలపించిన క్షణాలకు తెలుసు
మనం కలిసి మూసుకునే నాలుగుకళ్ళలో రెండు 
కలలతీరం వైపు నిరంతరం చూస్తుంటాయని

మలుపులు తిరిగిన కాలం నిశిరాత్రిలో ఆగి
వెన్నెల కెరటాల్ని ఆస్వాదించేవేళ
నువ్వేమో చుంబనపు ఆకలేసిందని చిరునవ్వుతావు
చిరుకోపం చూపులతో నేనేమో అలుకను సంధిస్తాను

చిక్కని పొదల్లో విచ్చుకున్న పారిజాతాలు
నేలదిగిన నక్షత్రాలై నిన్నూనన్నూ 
వెచ్చబెట్టేందుకు పొగలు చిమ్మేంత పరిమళాలు చల్లి
మధుపానమంతటి మత్తును పెదవులకందిస్తాయి

రెప్పలపై రాసే ప్రేమకావ్యం పూర్తవగానే
తేనెతుట్టగా మారే తనువు
నువ్వే ప్రపంచమని నీలో దాగిపోతుంది
అరచేతులు చాచి పెనవేసుకున్న ప్రేమ
మన ఊపిరి గాలి చల్లారేంతవరకూ కొనసాగుతుంది..




// నీ కోసం 38 //

అనామక దృశ్యమవుతున్న జ్ఞాపకం
ఒక్కసారిగా మంత్రమేసినట్టు గుర్తొస్తుంది
మమకారపు పరదా కదిలి 
మనసు మెలిదిరిగిన పువ్వై నలుగుతుంది

జవాబులేని ప్రశ్నలకు పరిమితుండదు
కొసరికొసరి వీచే గాలే..ఆపాటికి దుమారమవుతుంది
రగిలి పొగిలిన క్షణాలు గుర్తుకొచ్చి
నిద్దురపోనివ్వని అలసట మొదలవుతుంది

ఒక్కోసారంతే..
అంతరంగపు రణరంగం 
నిశ్శబ్దాన్ని చెదరగొడుతుంది
అప్పటికప్పుడు అకాలవాన కన్నుల్లో కురవడం తెలుస్తుంది