Monday, 8 July 2024

// నీ కోసం 537 //

నిన్ను చూడాలనే నా బెంగంతా ఎందుకనంటే ఏమ్ చెప్పనూ అదో మనశ్శాంతి కావొచ్చు.. నువ్వు కనిపించే ఆ కొన్ని క్షణాల కోసం ఎంత నిరీక్షణో ఎలా తెలుపనూ నీకదో తడబాటుగా అనిపించవచ్చు.. ఆగి ఆగి రువ్వే నీ నవ్వులున్నాయే పసి పాప కళ్ళల్లోని మెరుపుల్లా నా చుట్టూ వెలిగే దీపాలవుతాయి.. నీ మౌన స్వరమనే అలల హోరుందే.. నన్ను సముద్రపు ఒడ్డున నిలబెట్టి చిగురేయమనే చినుకులై తడిపేస్తాయి.. హా.. నా శీతాకాలపు జ్ఞాపకాలు నీ పారవస్యపు చప్పుళ్ళుగా మారి చలి కాసుకునేందుకు పిలుస్తున్నాయి.. ఇది చెప్పాలనే ఎదురుచూస్తున్నా.. Hmm.. ఏమని స్పందించాలో తెలీకనే బహుశా ఏ కలవరంలోనో బందీవై నువ్వుండవచ్చు అని కూడా అనుకుంటున్నా..

// నీ కోసం 536 //

ఈ మలిసంజె నీలాకాశం మీద ప్రవహిస్తున్న దేవరాగానికి పూలగాలులు తోడైనప్పుడు నిన్ను స్వరాక్షరం చేసి పాడుకుంటున్నా.. ఏం వినబడిందనో నిశ్శబ్దాన్ని నిలేసి అనంతాన్ని ధ్వనించేలా నువ్వు నవ్వుతూనే ఉండుంటావ్.. కదా.. ప్రేమ పరిమళించే ఏకాంతంలో మళ్ళీ మళ్ళీ ఎదురు పడుతున్నావంటే.. అదే మరి.. చీకట్లో చుక్కలు ఎంతందంగా మెరుస్తున్నా కొన్ని రాత్రులు చందమామతోనే చనువుగా వుండాలి.. ఆహా.. ఈ వెన్నెలను ఏమని వర్ణించడం.. ఏకకాలంలో కరుగుతూ సౌందర్యాన్ని స్రవిస్తూ హృదయాన్ని మంత్రిస్తుందనా..?!

// నీ కోసం 535 //

నా వాలుచూపులు నీ మీద వాలేందుకు దారి మరచాయి నా వేడి నిట్టూర్పులకు కాలుతూ చిరునవ్వులు అదురుతున్నాయి నా పాటలో పన్నీటి వాసనలు మెలితిరిగి తిరిగి సన్నగిల్లాయి నా విరహంలో తీయదనం తరిగి జ్వరం బయటకొస్తుంది అయ్యో.. పున్నమి వెళ్ళిపోతుంది

// నీ కోసం 534 //

అవును.. నేనదే.. ఆకులూ.. పువ్వులూ కౌగిలిరాగంలో పాడుతున్నప్పుడు గుండెల్లో నిన్ను కలుస్తూ ఉంటాను నువ్వొక్కసారి పలకరించకపోయినా నీతో అన్నీ చెప్పేస్తూ ఉంటాను మనసంతా నీపై ప్రేమ నిండినందుకు అలకొస్తే అలానే కడిగేస్తూ ఉంటాను నువ్వు ఎక్కడున్నావో తెలీకపోయినా పక్కనే ఉన్నట్టు అనుకుంటాను ఒళ్లంతా పులకరిస్తున్నా నీతో లోలోపలే కలహిస్తూ ఉంటాను నీ నిర్విరామ కార్య కలాపాల్లో నేను గుర్తుకొస్తానో లేదో గానీ నా అస్తిత్వంలో అనుభూతిగా నిన్నెప్పుడో కలిపేసుకున్నా అంటాను.. ఇవన్నీ తెలిసి కూడా మళ్ళీ మళ్ళీ చెప్పించుకుంటూ నన్నల్లరి పెట్టే నువ్వేంటో కూడా చెప్పు మరీ.. !!

// నీ కోసం 533 //

అతిశయం అనుకుంటావేమో.. ఆకాశం నవ్వుతుంది ఇప్పటిదాక ఒంటరిగా ఉందేమో మన మాటలన్నీ వినేసి కిలకిలలాడుతుంది ఈ కాసేపే హాయి రాగాలు తీసేదని పక్షులు కూడా గూళ్ళకి పోకుండా కోకిలతో పోటీ పడి రాగాలు తీస్తున్నాయి ఒక సుదీర్ఘ సుగంధం వెన్నంటి నన్ను అనుసరిస్తున్నట్టు మదిలో అల్లరేం చెప్పనూ.. ఇన్నాళ్ళ మౌనాన్ని మృదువుగా నువ్వు మేలుకొల్పాక నేనూ కాగితాన్ని కమ్ముకుంటున్నా.. అయితే.. నీతో అయిదు పది నిముషాలు మాట్లాడితే తీరిపోయే తనివి కాదని తెలీనట్టు తడిపొడిగా తడబడతావే.. సంధ్యని ప్రేమించడం ఎంత బాగుంటుందో నీకూ తెలుసుగా.. "A bit of tenderness can heal any wound" Am I right to say this..

Sunday, 7 July 2024

// నీ కోసం 532 //

నా తలపులకి తలుపులేస్తే అస్సలు ఊరుకోవేం కాలం కరుగుతూ గుండె బరువు పెంచుతుండగా నీ పిలుపు కోసం ఎదురుచూపులు ఆ లాలనకై అహర్నిశ తపనలు నువ్వో మేఘమై తొలకరి చెమరింపుగా జీవితానికి రంగులద్దుతావని నిశ్శబ్ద భావాల సుషుప్తి రాగాలు యుగయుగాల విరహ స్వరార్చన రాత్రిని కలవరించగా సుతిమెత్తని ఊహల ఊయలలో అగరుపొగల మధ్య మువ్వలగంటలు ఇన్నిన్ని మధురిమల పూలకోన చాటు కన్నులు మూసిన మౌన ముద్రలో కాసేపు నన్నుండనివ్వవు కదా.. ఎందుకలా... ఏకాంతానికి పిలుస్తావో వెన్నెల్లో గొడుగు పట్టి మరీ మనసెక్కి కూర్చుంటావు..

// నీ కోసం 531 //

చుక్కలు చిగురించే వేళ నా కురుల్లో చిక్కిన నీ మోహ పారవశ్యం వసంతపు మనోల్లాసాన్ని ఊయలోపుతుంది.. సముద్రంలోని నురుగంతా ఉబికి గుండెల్లో పాలపొంగుగా మారి నీ చేతుల్లో అందమైన ఆకృతి పొందినట్టనిపిస్తుంది అమృతం తాగి కొండమలుపుల్లో విశ్రాంతి పొందేందుకు నువ్వు చేస్తున్న ప్రయత్నానికి ఎదబరువు దించుకునేందుకు మనసూ సాయం చేయమంటోంది.. వెలుతురు పరావర్తనం చెంది నీ కళ్ళకు ఏం మైకమిచ్చిందో నా దృష్టికి అదే కలనిచ్చి కలవరపెడుతోంది.. బాగా మాగిన పనసుపండులా దేహం తేనె వాసనేస్తున్న సమయం ఈ తీపినంతా నీ పెదవులకే ఇవ్వమంటుంది

// నీ కోసం 530 //

ఎక్కడిదో ఇంత సౌందర్యం ప్రకృతికి అలికిడన్నదిలేని అగాధాల్లోకి నిశ్శబ్దాన్ని తోడుగా తీసుకు నడుస్తున్నప్పుడు జ్ఞాపకాలను శృతిబద్ధం చేస్తుంది చినుకుల స్పర్శతో పిట్లిన మట్టి వాసన ప్రాణ గ్రంధులను గుచ్చుతూండటం పూలగాలుల దేవరాగ సమ్మేళనం దేహాన్ని తడుముతూండటం బాగా తెలుస్తుంది హా.. మనసు తడబడుతుంది ఎటు వెళ్తుందో తెలీదు నన్నొదిలి నా ఆలోచనలు బయలుదేరింది నీ కోసమే సంగీతంలో స్వరాక్షరమై కదిలానిన్నాళ్ళూ మన కోసం సృష్టించుకున్న మరో ప్రపంచాన్ని జయించాలనే ఏకైక లక్ష్యంగా కన్నులు మూస్తున్నానిప్పుడు