విశాలమైన ఆకాశం బూడిదరంగులో నా మనసులాగే అనిపిస్తుందంటే నవ్వుతావేమో. మగత తప్ప నిద్రరాని రాత్రుల సంగతేమని చెప్పను. నువ్వనుకున్నది నిజమే..నిశ్శబ్దపు నేపధ్యగీతంలో నీ భావాలు తరంగాలై లాలిస్తున్న కమ్మని ఊహ నిజమైనంత హాయిగా మురిపిస్తుంది. అయినా అన్యోన్యత కోల్పోయిన మనసూ.. కళ్ళ గురించేం చెప్పనూ. విషాదాన్ని విరమించాలని చూసిన ప్రతిసారీ కాలం చలిసంకెళ్ళు వేస్తుంటుంది. ఒంటరిక్షణాల నిశీధిలో కర్పూరమై కరుగుతున్న గుండె అలసిపోతుంది కానీ కలతను ఆపలేకపోతుంది. ఎప్పుడూ అందంగా ఉంటూ మనసుని ఓ అతీతమైన స్పందనలో ఉంచుతూ ఆరోగ్యాన్ని పదిలంగా చూసుకొనేదాన్ని. ఇదో అకాల గాయమైంది మొదలు, నాకు నేనో సత్తువ కోల్పోయిన విరాగిలా మారిపోయా. ఇదంతా కేవలం నా భ్రమ అని తెలుస్తూనే ఉన్నా, దాన్నుంచి బయటకు రాలేని విషమ పరిస్థితి. ఇన్నినాళ్ళ మనశ్శాంతి నన్నో తృణప్రాయంగా తోసి దూరం జరిగిపోయిన భావన. సంశయమన్నది రానే కూడదు. దానికి ఆలోచనల ఆజ్యంపోసి అధిక ప్రాధాన్యతనిచ్చేసాక, ఇప్పుడు ఆందోళన తప్ప మిగిలిందేముందని.
జీవితానికి పరిమళమద్దిన సమక్షం నీదని తెలుసు కదా..నువ్వేమో జడివానకి నన్నొదిలేసి అకస్మాత్తుగా మౌనవిస్తావు. ఓపక్క నన్ను అనుసరిస్తున్నట్టు అనిపిస్తూనే మూగబోయి వెక్కిరింతలు మిగులుస్తావు. ఈ వానాకాలం ఒంటరితనం ఎంత కష్టమో తెలుస్తుందా నీకేమైనా?! నా పాట పన్నీటితీపిదన్న నీ మాట ఎన్నాళ్ళ క్రితముదో, నా కన్నీటి తపన కలల్నీ మింగేస్తుంది. నా ఆవేదన నిన్ను చేరే దారి వెతకలేక బుగ్గలవెంటే ఎండిపోతుంది. క్షణమన్నా అలికిడి చేయని నీ ప్రేమ నన్ను భయపెడుతుందంటే విస్తుపోతావు. అనుమతి లేకుండా నాలోకి వచ్చింది నువ్వేనని మరచి నేను ప్రశ్నించానని విసిగిపోతావు. మనోహరమైనవన్నీ నువ్వులేక వెలవెలబోతూ నా ప్రేమరాహిత్యాన్నే చర్చిస్తున్నాయి. ఊహల్లో పడిపోతూ ఎన్నయినా చెప్తావు అనుకోకుండా ఏమరపాటుగానైనా నన్నోసారి కలవరించానని చెప్పు. రకరకాలుగా అదురుతున్న గుండె అస్తిత్వం కోల్పోయేలోగా నువ్వొస్తావని..రావాలనీ..
No comments:
Post a Comment