Friday, 31 July 2020

// నీ కోసం 173 //

సగం రాత్రి కరిగిపోయిన మౌనంలో 
రెప్పలు తడుపుకున్న విరహం 
హృదయాన్ని సానబెట్టి 
 వింత అనుభూతిని పరిమళిస్తుంది.. 

 అంతులేని ఏకాంతం కుదిరి 
 అంతరాత్మను చదువుతున్నప్పుడు 
 చప్పుడు చేయక అల్లరిపెట్టే శూన్యంలో 
నీ నవ్వుతున్న చిత్రాన్ని చూస్తూ 
 పొగమంచులా నేనెటో తేలిపోతుంటా.. 

 నక్షత్రపు కొనల మెరుపులా 
వాలుచూపు కలుపుతున్నట్టున్న నువ్వు 
హాయి కెరటాలలో ఊయలూగుతూ 
పూలరెక్కలపై ప్రేమలేఖలు రాస్తున్నావనుకుంటా.. 

 కలల మైదనంలో తరుముతూ నువ్వున్నా 
ఎన్నాళ్ళయిందో నీ ఊసు విని అనుకోగానే 
సుషుప్తిలోకి జారదామంటూ ఓ ఆనందం 
సుతారపు తరంగమై..లోలోపలో సంగీతమై.. 
నీరవాన్ని దూరంగా విసిరేస్తుంది.. 
నిద్రించే అవసరం లేకుండానే వేకువైపోతుంది
 ప్రతిరోజూ లాగానే..😊💜

Monday, 27 July 2020

// నీ కోసం 172 //

మగతలాంటి నిదురలో
మనసున ఊయలూగే మృదు 
కనకాంబరాల గుసగుస తెలుసా..

పగలంతా మూగకోయిలైన ఎదలయ
కలలో కవితలు పాడి
క్షణాల తమకాన్ని ఆలపిస్తుంది విను..

సుతిమెత్తగా ఆవరించిన తీయని మైకం
అనురాగపు అగరుపొగలదేమో
ఆదమరచిన అంతరాత్మను ఆరాతీయవూ

విషాదమోహనంగా మొదలైన స్వరం
నీ కౌగిలిలో కళ్యాణిగా మారిన సమయం
సాగరసంగమమేగా మనోగతం
అందుకే..
ఆనందభైరవి రాగమిప్పుడు పూర్తిగా 
మన వ్యక్తిగతం 💕💜 

Monday, 20 July 2020

// అమృతవాహిని 15 //

  

విశాలమైన ఆకాశం బూడిదరంగులో నా మనసులాగే అనిపిస్తుందంటే నవ్వుతావేమో. మగత తప్ప నిద్రరాని రాత్రుల సంగతేమని  చెప్పను. నువ్వనుకున్నది నిజమే..నిశ్శబ్దపు నేపధ్యగీతంలో నీ భావాలు తరంగాలై లాలిస్తున్న కమ్మని ఊహ నిజమైనంత హాయిగా మురిపిస్తుంది. అయినా అన్యోన్యత కోల్పోయిన మనసూ.. కళ్ళ గురించేం చెప్పనూ. విషాదాన్ని విరమించాలని చూసిన ప్రతిసారీ కాలం చలిసంకెళ్ళు వేస్తుంటుంది. ఒంటరిక్షణాల నిశీధిలో కర్పూరమై కరుగుతున్న గుండె అలసిపోతుంది కానీ కలతను ఆపలేకపోతుంది. ఎప్పుడూ అందంగా ఉంటూ మనసుని ఓ అతీతమైన స్పందనలో ఉంచుతూ ఆరోగ్యాన్ని పదిలంగా చూసుకొనేదాన్ని. ఇదో అకాల గాయమైంది మొదలు, నాకు నేనో సత్తువ కోల్పోయిన విరాగిలా మారిపోయా. ఇదంతా కేవలం నా భ్రమ అని తెలుస్తూనే ఉన్నా, దాన్నుంచి బయటకు రాలేని విషమ పరిస్థితి. ఇన్నినాళ్ళ మనశ్శాంతి నన్నో తృణప్రాయంగా తోసి దూరం జరిగిపోయిన భావన. సంశయమన్నది రానే కూడదు. దానికి ఆలోచనల ఆజ్యంపోసి అధిక ప్రాధాన్యతనిచ్చేసాక, ఇప్పుడు ఆందోళన తప్ప మిగిలిందేముందని.

 జీవితానికి పరిమళమద్దిన సమక్షం నీదని తెలుసు కదా..నువ్వేమో జడివానకి నన్నొదిలేసి అకస్మాత్తుగా మౌనవిస్తావు. ఓపక్క నన్ను అనుసరిస్తున్నట్టు అనిపిస్తూనే మూగబోయి వెక్కిరింతలు మిగులుస్తావు. ఈ వానాకాలం ఒంటరితనం ఎంత కష్టమో తెలుస్తుందా నీకేమైనా?!  నా పాట పన్నీటితీపిదన్న నీ మాట ఎన్నాళ్ళ క్రితముదో, నా కన్నీటి తపన కలల్నీ మింగేస్తుంది. నా ఆవేదన నిన్ను చేరే దారి వెతకలేక బుగ్గలవెంటే ఎండిపోతుంది. క్షణమన్నా అలికిడి చేయని నీ ప్రేమ నన్ను భయపెడుతుందంటే విస్తుపోతావు. అనుమతి లేకుండా నాలోకి వచ్చింది నువ్వేనని మరచి నేను ప్రశ్నించానని విసిగిపోతావు. మనోహరమైనవన్నీ నువ్వులేక వెలవెలబోతూ నా ప్రేమరాహిత్యాన్నే చర్చిస్తున్నాయి. ఊహల్లో పడిపోతూ ఎన్నయినా చెప్తావు అనుకోకుండా ఏమరపాటుగానైనా నన్నోసారి కలవరించానని చెప్పు.  రకరకాలుగా అదురుతున్న గుండె అస్తిత్వం కోల్పోయేలోగా నువ్వొస్తావని..రావాలనీ..  

// నీ కోసం 171 //

ఎంతకీ తెగని ఓ తీపి పెనుగులాట ఎదలో
వివరం చెప్పకుండా వీచే గాలితో కలిసి
కోయిల కుహూమని పిలుస్తుంది నన్నేనా..

వసంతమంటే నాకిష్టమని తెలుసనుకుంటా
వర్షంలోనూ నాకోసమొచ్చి పాడుతుంది
నువ్వనే ముద్దు మాటలన్నీ ముందుగానే చేర్చేస్తుంది

విరహంలో తడిచి బరువెక్కిన
నీ దేహపు మోహగీతాన్ని
లయగా వినిపిస్తూ నన్ను శృతి చేస్తుంది

ప్రేమాన్వీ
నీ కనుచూపు చిరునవ్వులు సైతం
మెత్తగా సవ్వడిస్తుంది
నిజంగా ఇంత సంగీతం నీలోని ఆర్తి కన్నీటిదేనా

నా శ్వాస అల్లాడిపోతుందిక్కడ
ఒక్కసారి అరచేతుల్లో నన్ను ఒదగనిచ్చి
అలసిన గుండె నివేదిస్తున్న నులివెచ్చదనం కప్పుకోవా 😣

// నీ కోసం 170 //

నిశ్శబ్దం ప్రవహిస్తున్న చీకటిలో
వర్షానికి తోడు..   
మత్తుగా వెలుగుతున్న దీపాలు

రెప్పలమాటు  నువ్వు దాచిన అనురాగయోగం
నాకిష్టమైన పాటగా గుండెను తాకి
లోపల వసంతాన్ని చిగురించిన వేళ
నిద్దుర కోసం తడబడ్డ క్షణాలు
ఇందువదన బుగ్గల్లో సిగ్గులై
సీతాకోకల గుంపు కదిలిన సవ్వడైంది

క్షణానికో రాగంలా వినిపిస్తున్న గుండెచప్పుడు
నీ నవ్వుని అనుకరించాలనుకొని
విఫలమవుతున్న రాతిరి
కన్నుల్లో విరిసిన పారవశ్యం నువ్వయితే
నీ మనసు మల్లెలపందిరి కింద
తలదాచుకున్న ఊహను నేనే కదా

నువ్వో చలిగాలిగా మారి చుట్టుకున్న రహస్యం 
ఏమరుపాటు కాదని తెలిసాక
అలమటించడమాపేసి
చెక్కిళ్ళ మైమరపుని చెమరిస్తున్నా..💜  

// నీ కోసం 169 //

నువ్వు తాగుతున్న తన్మయత్వం
నా హృదయమొలికిస్తున్న మధురిమను తాకి
నిన్ను చేరిన చిరుగాలి గానామృతానిది..

శారదరాత్రుల్లో నా పాట
ఒడిచేర్చి లాలించే కమ్మని గుసగుసగా
నీ మది నింపే వలపు పదనిసలది
కలహంసల కువకువలో
నిన్ను అలరించిన...మోహస్వరమది  నాదే

మనోఫలకంలో ముద్రించుకున్న బింబం
వసంతాల లోగిలిలో
మనోధరిలా నేనడుగేస్తున్న ప్రతిరూపానిది..
కలలో దారితప్పిన ప్రతిసారీ
నీ ఎదురుచూపులకి చిక్కి..కౌగిలింతకొచ్చేది నేనే

ప్రేమాన్వీ..
తపస్సు నుంచీ కన్నులు విప్పి చూడొకసారి
ఊపిరి పోల్చుకోగల నీ ఊహలో ఉన్నది నేనో కాదో స్పందించొకసారి..💕💜