Monday, 28 June 2021

// నీ కోసం 379 //

 ఎందుకలా చూస్తావో అపురూపంగా..

మిణుగురులాంటి మెరుపుల చూపులకి
గుండె కింద కల్లోలరాగం మొదలైనట్టు
మౌనపు అంచుల మీదే నిలబడిపోతుంది
మనసు విచిత్రంగా

కోమలత్వమనేది నీ రెప్పలమాటు
దాచుకున్న అనుభూతులదో
నులివెచ్చని నీ సమక్షపు తమకానిదో
తడబడ్డ సరిగమలను ఆరాతీద్దామంటే
వరసే మారిపోయింది

నిశిరాత్రి కలవరంగా నాలో రేగిన నునుసిగ్గు
వర్షానంతర సౌందర్యం కాగా
దూరాలు దాటి నువ్వొచ్చిన వివశానికేమో
నా చెక్కిలిపై నీ పెదవుల సవ్వడి
సంపెంగి నవ్వుల సుతార పరిమళమైంది 

ఓయ్.   కలల దారిలోనైనా 
గుప్పెడు క్షణాలు నాకు రాసివ్వగలిగితే చూడు
ఎడతెరిపి లేని నా ఊహల ప్రయాణానికి
మాత్రం అడ్డు రాకు

// నీ కోసం 378 //

 తీరని తనివితో కొట్టుకుపోయే నన్ను

చిరునవ్వుతో నువ్వు కౌగిలించావని
అరమోడ్చినట్టుండే నీ కళ్ళల్లో
నా కలలున్నాయేమో వెతకాలనిపిస్తుంది

నీలో నిశ్శబ్దాన్ని నక్షత్రాలకిచ్చి
నీలగిరి పువ్వులు నాపై చల్లావని
సంతోషంతో మనసు పాడే ప్రతీపాటనీ
నీ కోసమే ప్రత్యేకంగా పాడాలనిపిస్తుంది

ఇన్నినాళ్ళు నన్ను కలవలేని అజ్ఞాతంలో
అవ్యక్తమై సమస్త వేదన స్వీకరించావని
నాలో సహజమైన ప్రాణశక్తిని మధురించి
నీ విషాదచ్ఛాయను తొలగించాలనిపిస్తుంది

అనంతానికి నువ్వు రాసిన లేఖలు
నా హృదయానికి చేరినందుకే మరి
నేను ఏకాంతంలో ఉన్నప్పుడంతా 
నిన్ను మరింత ప్రేమించాలనిపిస్తుంది

// నీ కోసం 377 //

 ఒక్క నిముషం నిన్ను మర్చిపోలేని

మనసు యాతన నాకన్నా ఎవరికి తెలుసు

నిశ్శబ్ద పరిమళానికి ఎగిసిన మత్తు
రాత్రి గుసగుసలంత సహజమైనదని తెలిసాక
నిమీలిత నయనాల తడి చినుకులు
నిన్ను చేరలేని విషాదపు ఆనవాళ్ళు 
కాగా...
నువ్వు పాడిన పాట మెడ మీదుగా చెవినితాకి
తనువంతా సిగ్గుకమ్మి సంతోషమైన రహస్యం తెలుసా

నువ్వు వెలిగించిన వేయిదీపాలకి
మసకచీకటి మాయమై నా రూపం 
ప్రేమసంకేతమైన సంగతి గుర్తించలేదా

విరహాన్ని మాత్రమే మోసేందుకు జన్మనెత్తిన నేను
పిచ్చిదాన్నంటే అస్సలే ఒప్పుకోను
అలా ఎవరన్నా..
ముందుగా...
మానసికారధనలోని ఆహ్లాదత తెలుసుకొమ్మని చెప్తాను

// నీ కోసం 376 //

 


నరాలకొసల మీదుగా నువ్వు పంపిన తరంగాలు
నాలో నింపిన ఆహ్లాదం.. ఓ చల్లని వసంతం

అలిగిన నా కన్నుల వెంట
నీ పదాలు కవితలై తరుముతునట్టు
క్షణాల్లో నవ్వులు విస్తరించేలా
ఏం మత్తు చల్లుతావో చెప్పలేను

మృదువుగా చుంబించిన నుదుటిలో
తడిచిన కుంకుమ పరిమళాన్ని పీల్చుకుని
నీ హృదయలయల ప్రవాహమంతా నావైపుకొచ్చేలా
ఏకాంతవేళ తాదాత్మ్యపు భావనవుతావు తెలుసా..

ప్రియమైన కలల కిలకిలరావాలతో
రేయి వెన్నెలమాటునెలా కరిగిపోతుందో
మాటలకందని మనోహరమైన అభివ్యక్తి
పెదవికి తగిలిన తీపిగా తెల్లారిపోతుంది

Thursday, 10 June 2021

// నీ కోసం 375 //

 జ్ఞాపకాల జాతర నుంచి తప్పించుకుని

మనోవాల్మీకంలో నిద్రించిన నన్ను
ఏదోకలా తట్టిలేపుతావు

జాలిగా చూస్తున్న నన్ను
వెచ్చగా గుండెల్లో దాచుకుని
మనకిష్టమైన ఆ పాట పాడతావు

ఎక్కడో తప్పిపోయినట్టున్న నేను
కలగంటున్నానో
నిశ్శబ్దపు సుషుప్తిని పీలుస్తూ
నీ దేహపరిమళపు మత్తుని ఊహిస్తున్నానో
నా శ్వాసలో అరవిరిసిన పువ్వుల పులకింతలు మొదలవుతుంటే..

రెప్పలపై ముద్దులు ఆపకుండా
ఎంత మృదువుగా అడిగితేనేం..
"ప్రేమిస్తున్నావా" అంటూ
ఆ నవ్వెందుకు

ఆకాశంలా నువ్వల్లుకున్నాక
ఒంటినిండా ప్రవహిస్తున్న మోహానికి పేరడుగుతావా
నీ పెదవులకి నా మనసు తీపి తెలిసాక కూడా ?!