Wednesday, 16 September 2020
// నీ కోసం 174 //
ఆకాశం కరిగి చెమరించగానే
కొన్ని నవ్వులు జలజలా రాలి
ఎడారిమయమైన నన్ను
తొలకరిగా తడిమేస్తాయి
ఏమని చెప్పను
మబ్బేసి మసకేసే ముందే
ఈ పూలు.. గుసగుసలు మొదలెట్టి
నీ గుండె చప్పుళ్ళు వినిపిస్తామని
ఊహానందానికి రమ్మంటాయి
నీ పిలుపు కోసం
పరితపిస్తున్న నాకు
నువ్వే బదులిచ్చినట్టు
ఈ ఉరుములు కొన్ని మెరుపులను కూడి
కుశలాన్ని చర్చిస్తాయి
గొంతులోకి చేరిన చల్లదనాలు
తీయని మౌనరాగాలుగా మారి
ప్రశాంత సుషుప్తిలోకి చేర్చుతూ
వియోగ పరిమళాన్ని
తర్జుమా చేసేందుకని ప్రవహిస్తాయి
నీకేమో మరి
మనసొంపి రాసిన కవిత్వమంతా
సరిగమలు దాచుకున్న కేరింతలు చేసి
కాగితప్పడవలుగా
నావైపుకి పంపుతుంటావు
నేనూ..అందుకే..
ముత్యపుచిప్పనై నీ పదాలను
పదిలంగా దాచుకుంటాను 💜💕
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment