Monday, 3 August 2020

// అమృతవాహిని 16 //

ప్రేమాన్వీ..

నువ్వక్కడ ఊగుతున్న జూకామందారాల్ని చూస్తూ నా లోలాకులను తలచావంటే మది పులకించింది. వెన్నెల పూల పరిమళాలు నీకిష్టమైన మల్లెల మాగాణిలో   కలగలిసి ముంచుతున్నట్లు నా భావనిక్కడ. ఇలా మనిద్దరికీ మనసు కుదిరే మహత్తరమైన ముహూర్తాలు కొన్ని రాత్రులు అంటే ఏమంటావో. పదేపదే తలచి నూతనానందం పొందుతూ ఉండే పిచ్చి నాదని తిట్టకు. చలిచీకటిలో వెచ్చని కన్నీటిని ఒలికించే అమందానంద సంస్మృతులు నాకివేగా. నాకోసం కాచుకొనే కనులు నువ్వక్కడ మూతలేయగానే మౌనంగా ఓ కౌగిలి నాకందిపోతుంది తెలుసా..😄 

నీ తలపులు తీపిసలుపులా మారి క్షణాల వెంబడి హృది బరువెక్కుతున్న మాయ నన్ను ఊయలూపుతున్న లాహిరిలో వింతైన వెచ్చదనం. 
నువ్వెక్కడో ఉంటూ నీలో సగమై నేనున్న ఊహతోనే మది పొంగిపోతుందిక్కడ. అవును, ఆత్మావలోకనమే. గడ్డిపోచ విలువ చేయని జీవితం నాదని విసిగిపోయానిన్నాళ్ళూ. అతీతమైన జగత్తు, అర్ధంలేని అనురాగస్వరాలు నాకు మాత్రమే సొంతమనుకున్నా. కంటిపాపలకు  నిశ్శబ్దంలో నీళ్ళు తిరిగేంత నిశ్చల సాన్నిధ్యం దొరికినట్టుంది నాకైతే.  అయినా నా ఆంతర్యం, ఆహార్యం ఏదీ నీకు చెప్పనవసరం లేదని గర్వం కదా నాకు . అవును భావగీతానికి నాదస్వరం తోడైన లాలిత్యంలోని అమరానందమిది. జీవదాహం తీర్చే ఏకాంతం పట్ల అనురక్తి అందరికీ చెప్పే వీలవదు. 

ఎప్పుడు చేర్చుకున్నావో నీ కథలో..మసక వెన్నెల్లో లీనమవుతూ, సొగసుగా కదులుతున్న అలలా నాలో రసవల్లరి ఎగబాకుతుంది. ఆరాధనావీచికల ఆనంద పల్లవి నీకందించిన క్షణాల మేలు ఎన్నటికీ మర్చిపోలేనందుకే. ఈ చీకటి సాక్షిగా నాలో విరుస్తున్న నవ్వు నీ కలల్లో చూడు. నిద్రలేని రాత్రులల్లా నీతో పంచుకొనే ఎద సంచలనాలు ఒంటరితనాన్ని ఓడిస్తుంటాయిలా. సెలయేట్లో తేలుతున్న ముద్దబంతిలా నాకు నేనిప్పుడు అద్భుతం. నీరవంలా ప్రవహిస్తున్న నా ప్రేమ లోపలి పంచమం నీ గుండెచప్పుడులో చేరిన స్పందన నాకు అనుపమానం. శాశ్వతమైనదేదీ లోకంలో లేదు కనుక ఇప్పటికి నీపట్ల నా తన్మయత్వమే నాకు కమనీయ కవనం. కాదంటే చెప్పు..అవుననేలా నిన్ను మోహంలో ముంచి మరీ ఒప్పిస్తా..class="CToWUd"class="CToWUd"

No comments:

Post a Comment