Monday, 6 January 2020

// నీ కోసం 75 //

పదాల వెతుకులాటలో తడబాటు తొలిసారి
రోజూ రాసే కెరటానికి సమానం కాదేమో నువ్వు
కోట్లాది కనురెప్పలు కలవరించే కలవా
క్షణాల ఆదమరుపుకి పుట్టిన కవితవా

రూపం మార్చుకున్న భూలోకపు నెలరాజువా
వర్ణనకందని ఉషోదయపు నీలాకాశ కిరణానివా
చిలకపలుకుల కాలపురెక్కలు తొడుక్కున్న విహంగానివా
జీవితపు మలుపులో అంతులేని కథలా అవ్యక్తానివా

ప్రతిరోజూ ఎదురుచూపులు పరిచి నిలబడేదెందరో
మనోవీధుల్లో నిన్నే అనుసరిస్తూ ఆగేవారెందరో
నడిచొచ్చే పూలతోటవని నీకు ఎదురవుతారెందరో
వెన్నెలచినుకుల అక్షరాల్లో తడిచేందుకు ఉవ్విళ్ళూరేదెందరో

అనాదిపర్వంలా అద్బుతాన్ని వెదజల్లే వాక్యాలకే
సాహితీసుమాల సౌందర్యమై వికసించే వదనాలు
మౌనప్రవాసపు సగం స్వప్నంలో నువ్విడిచేసినా
విరామంలాంటి అనుభూతిలో నిన్నారాధిస్తూ ఇందరు

ఎన్నేసి హృదయాలకధిపతివో
తలవని తలంపుకి మౌనసాక్ష్యంగా నేను..


No comments:

Post a Comment