ఎన్నిరోజులయ్యిందో నీకు ఉత్తరం రాసి అనుకొనేలోగానే మనసు ఈ రేయి ఆ పని చేయమని ఉత్సాహపరిచింది. నీతో మనసు విప్పి మాట్లాడం ఎంతిష్టమో తెలుసు కదూ..నిద్రొచ్చి మనకోసం కలలు కనడం నీ అదృష్టమైతే, అది రాక నీ తలపుల్లో తేలుతుండడం నా పరవశం. చుట్టూ చీకటే ఉన్నా ఎందుకో పాడు నిద్రతో రాత్రిని వృధా చేయాలనిపించదు. అప్పుడప్పుడైనా మదిలో మోగే వీణను శృతి చేసుకోవద్దూ..ప్రియమైన ఈ సుషుప్తి అనుభవమైన మనకి మాత్రమే తెలుసు కదా మరి..తెలుసా.. అందరూ అదే అనుకుంటున్నారు. ఏదీ పట్టనట్టుండే నేను, ఇన్ని భావాలు ఎక్కడ నుంచి వెలికితీసి రాస్తున్నానోనని.. ముఖ్యంగా ఎవరికోసమోనని.
అదేమో, మన అభీష్టాన్ని నేను జ్ఞాపకం చేసుకొనే వేళకి ఎక్కడినుంచో మరి వానొస్తోంది. నమ్మగలవా, తెలిసే అంటున్నా అందుకే ఇలా..వానొస్తే చాలు ఇంట్లో ఉన్నా నువ్వు తడిచిపోయేంతగా తన్మయమవుతావని. ఇద్దరమూ ప్రకృతిని ఒకేరీతిగా ప్రేమించినా కాలాల దగ్గరకొచ్చేసరికి నాకు హేమంతం ఎక్కువ మక్కువనిపిస్తుంది. చిరు చలిలో మొదలయ్యే తీయని పరిమళాన్ని మనసు మోయలేనట్టనిపించే హాయినీ, మంచు బిందుల సోయగాన్ని ఎప్పటికీ లేలేత భావాలుగానే ఆస్వాదించాలనిపిస్తుంది. సౌందర్యారాధన విడివిడిగానే చేసినా పల్లవిగా నే పాడిన పాటల్లో నువ్వూ.. అందంగా పొదిగిన నీ అక్షరాలను నేనూ ఒకలాగే అనుభూతిస్తాం కదా, తలుచుకుంటేనే ఎంతో ముద్దుగా అనిపిస్తుంది.
వెలుగుకిరణాల తాకిడికి నా ఎద స్పందిస్తూ పులకించడం, అది నువ్వూహించి పూలతో ఊసులాడటం, నీ అల్లరినంతా వెచ్చగా నాకు ఇక్కడ పులమడం, ఒదిగిన నేనింకా నీ పరిష్వంగంలో దాగడం..హమ్మో..చెప్పొద్దనుకున్ నా చెప్పించేస్తావే, అంతేలే..ఇరుసంధ్యల నడుమ ధ్యాసల్లో పడి కొట్టుకుంటున్న ఈ తపన నీకు కాక ఎవరికి చెప్పేదిలే. ప్రేమనీ నన్నూ విడదీసి చూడటం తెలియని నీకు నా గుసగుసలు పెదవిప్పకుండానే వినబడతాయనీ తెలుసు. ఇంకా నేను నీ కళ్ళను ఇష్టపడినంతగా నా పెదవుల నవ్వును, ఆ ఒంపును ఇష్టపడతావనీ తెలుసు. ఏమో, ఎంతమంది ఎన్నిసార్లు ఈ మాట చెప్పినా, నీ చూపులకి సిగ్గుపడే నాకు తెలిసిపోతుంది అదేదో ప్రత్యేకమైన ప్రశంస అందులో దాగి ఉందని. పిలిచినప్పుడల్లా నన్ను ఆహ్లాదపరిచే ఆ పిలుపు చెప్పేస్తుంది, నా మీద నీ ప్రేమెంతోనని. అసలు వేదనలోనూ చిగురించడం ఎంత బాగుంటుందో నాకు మాత్రమే తెలుసు. ఇదంతా నీవల్లే కదూ.!
ఎప్పుడూ కంగారుగా తిరిగే నీకు మనసెలా నిశ్చలంగా ఉంటుదోనని ఆశ్చర్యమేస్తుంది నాకైతే. ఏ రంగూలేని అంతరంగంలో నేనే సీతాకోకనై అన్ని రంగులతో ఇలా తిరుగుతున్నానంటే అతిశయమే మరి. అపురూపమైన నీలో తరంగమై నేనుండటం విశేషమే కదా. ఓ పక్క దగ్గరుండాలంటావు, మరోపక్క ఎక్కడున్నా పక్కనేనంటావు. అదీ కొంత నిజమేలే. ఈ లోకంలో పక్కపక్కనే ఉన్నా, మనసుకి పట్టనివాళ్ళ మధ్యలో మనమున్నప్పుడు, ఎక్కడున్నా నాలోకంలో ఉన్నావంటే అదో అదృష్టమనుకుంటున్నా. మోహం నింపుకున్న ఈ సందెపొద్దులూ, సాయింత్రాలు ఎంత నిశ్శబ్దమైతేనేమి, మదిలో నువ్వున్న సందడి చాలదా ఈ చిన్ని జీవితానికి.
ఒక్క పదముగా మొదలై అనంగగంగలా ఇన్ని వాక్యాలు కలిసి ప్రవహిస్తున్నాయంటే నీ మీదున్న అనురక్తి కదూ. ఎదురుచూపులతో క్షణాల్ని బరువెక్కనీయకు మరి. నేను రాసినట్టే నాకో ప్రత్యుత్తరం రాసి నీ మనసు వేదనంతా తీర్చేసుకో. రాసులుగా కురిసే నీ ఆశల చమురుతో నేను మరిన్ని దీపాలు వెలిగించుకొని మురిసిపోతా..
No comments:
Post a Comment