Wednesday, 30 October 2019

// నీ కోసం 60//




విశాలమై ఇంత ప్రపంచముండగా
మౌనవించి నిన్నే ఎందుకు ధ్యానించాలసలు

సిగ్గుపూల సున్నితత్వం ఎదనూలయూపుతుంటే
తడబడొద్దని అంటావా
మోహావేశం కాగితపు రెక్కలేసుకొని
ఎగురుదాం రమ్మంటే కాదని అంటావా
ప్రేమంటే గుండె మొత్తం తవ్విపోయాలని ఎవరడిగారు

నీ వలపే పంజరమైతే..
ఓయ్..తెలుసా..
నీలాకాశపు మబ్బుపల్లకి, అనంతమైన సుందర సముద్రం..
ఆమని పువ్వుల బృందావనం, తొలకరి వర్ణాలద్దుకున్న సౌందర్యం
నిశ్చలమైన ఏకాంతంలో..నువ్వూ నేనూ
నీ చిలిపి చూపుల నవ్వుల్లో నేను
నా ఎద కనుమల స్వర్గంలో నువ్వు
ఇంతకన్నా ఏ స్వేచ్ఛ కావాలి, ఈ బంధమే ఒక అపురూపమనుకుంటే
ఇదో విశ్వరహస్యమంటావా
చెప్పు..నమ్మకానికి ఋజువేం కావాలి
మనసు పిట్ట నీ గూటికి చేరాక
అదే నా శాశ్వత చిరునామా అని నీకిప్పటికే తెలిసుండాలి..😏

// నీ కోసం 59//

ఎంత చూసినా తనివితీరలేదంటాయి కన్నులు
అంతలేసి ఊసులేం చెప్తావో మరి
అసలు నిద్రిస్తున్నానో లేదో కూడా తెలీదు

చూపుల దీపాలు వెలుగుతూ ఉంటుంటే
నువ్వు లేనప్పుడంతా ఇదే వ్యాపకమయ్యింది
అలా అయ్యేందుకే కనుమరుగయ్యావనుకుంటా..

నాతో కలిసి నవ్వుతున్నట్టు కేరింతలు
మేనంతా నువ్వయినట్టు పులకింతలు
నన్ను పిలుస్తూ పాటందుకొనే పెదవులూ
మనసాగక మొదలయ్యే మధురిమలూ
నాకేసి నువ్వెదురొస్తున్నట్టు తహతహలు
నీవైపు నేనేసే అడుగుల్లాంటి పరుగులు

ఇదంతా కలే
అయితే..నువ్వు నిజం చేసేవరకూ..💕💜

// నీ కోసం 58//

కాలం తడి పలకరింపుగా మారి
నన్ను ఓదార్చేందుకు చూస్తుంది
అలాంటిలాంటి బెంగ కాదు మరి
ఆకుపసుపువంటి మెలకువలో
నువ్వు చెంతలేని నలుపురంగు
నిట్టూర్పులివి తెలుసా

అసలు నిన్నూ నన్నూ కలిపేదే అయితే
ఇంత శూన్యాన్ని రచించుకోమని
ఆకాశమంత ఆవేదన ఎందుకిచ్చిందో

నువ్వేమో క్షణాలన్నీ నా పేర రాసి
దేహానికి అతీతంగా ఆత్మాలింగనమై
గోరువెచ్చని గుప్పిళ్ళతో నన్ను అల్లుకుంటావు

నీ ఉనికి తెలిపే కనికట్లు
నాకు తెలుస్తూనే ఉన్నా..
నేను మూగనవుతున్న విచారం
నీ చూపుకొసనైనా నువ్వు గమనించవు

నా ఊపిరిలో వెలితి నీకు తెలీదు
కొన్ని నిశ్వాసల బడలికనే
ఈ పదాలుగా రాసాననైనా పోల్చుకోవూ..😏💕

// నీ కోసం 57//

· October 3Edited 
 
ఇటుగా వచ్చిన శరన్మేఘం
రాయబారమంటూ
నీ స్వగతాన్ని చెప్పింది

ఎన్నాళ్ళకి ఇంత పరవశమైందని..😊

భావకుడిలా మౌనాన్ని పాతుకున్న నువ్వు
నిశ్శబ్ద సంగీతాన్ని ఆలకించే నా ప్రేమాన్వి
అల్లంత దూరాన్నుండి ముద్దాడగల రిషీ
ఆనందభాష్పాల్లో సుగంధాన్ని నింపగల నువ్వో తపస్వి

వీచే గాలితో కొన్ని మాటలు
విరిసే పూలతో కొన్ని నవ్వులూ
వెలిగే చూపులో కొంటె పాటలూ
ఇప్పుడన్నీ ఎడతెగని నీ అనురాగాలే

క్షణాల మధ్య నే కరిగిపోతున్నా
ఈ ఊహ నిజమో కాదో చెప్పూ..💜💕

// నీ కోసం 56//


నీ చిన్ని చిన్ని కళ్ళకు ఎప్పుడూ మగత నిద్రే
అయినా సరే..
కళ్ళు బాగుంటే మనసు బాగుంటుందట
గుప్పెడు సన్నజాజులంత తేలికగా
ఓ అద్భుతమైన పాటలా
నిన్ను చూడగానే పోల్చేసుకున్నా కదా
నా కలల కిటికీలోకి తొంగిచూసింది నువ్వేనని

వంగపువ్వు రంగుకో పరిమళముంటే
అది నేనేనని నీకెవరు చెప్పారో
చూపులు పరిచి నన్ను పిలిచావు
నీ మౌనమో ఆరాధనైతే
ఆ మధురానుభూతి నేనందుకున్నా

అందుకే..
అంతులేని ప్రేమభావన ఎద నింపుతుంటే
కొనవేళ్ళ కలయికల కర్పూరరాగాలు
ఆలపించేందుకని నే తపిస్తున్నా 💕💜

// నీ కోసం 55//

నిదురపోయే క్షణాలు కదాని
అభావాన్ని అల్లుకొని
అనిశ్చితమైన కలల కోసమని
ఆశను జోకొడుతూ కనులు మూస్తానా

సగం చదివిన కవితలోంచీ
మైకం పుట్టినట్టు
మనసుని తడుముకోగానే
కొన్ని మరకలు చేతికి అంటుతాయి

ఎప్పుడూ మాట్లాడని చీకటి కూడా
పరిమళాన్ని మోస్తూ ఉన్నట్లు
వీచేగాలికి ఓ తీయని సువాసన రేగి
అప్పటికప్పుడో పలకరింపుగా అనిపిస్తుంది..

వెలుగునీడల దోబూచులాటల్లో
అలా అలా లయమైపోయాక
సంచరిస్తున్న నక్షత్రాలుగా
ఆకాశంలో నా నవ్వులే అవి ప్రతిరాత్రీ 💞

// నీ కోసం 54//



కాలం తన కుతూహలానికి
నిశ్శబ్దాన్ని ఉసిగొలిపి
తుళ్ళిపడే నా మనసుకి
సంకెళ్ళేసి ఉంచమని పురమాయించింది

అదిగో..ఇలా నిన్ను చూసిన తొలిక్షణం
మౌనరాగం మెల్లగా నన్నాక్రమించింది

ఇన్నినాళ్ళుగా దాగిన పరిమళం
ఎద నుండీ ఎగసి
నాకో కొత్త ఋతువుని పరిచయించింది

హేమంతానికీ వసంతానికీ మధ్య వారధిగా
నీ హృదయం కవిత్వంగా మారి
నువ్వే నేనని పువ్వులతో కొలిచి మరీ చెప్పింది

కాలం కలిసి రాకుంటే నీలో అలజడే
ఈపాటికి శూన్యాన్ని చేరి
తీరం దాటిన వాయుగుండంలా నిన్ను ముంచెత్తేది..

ఒకరికొకరం చిక్కుకున్న క్షణాలను అడిగితే తెలుస్తుంది
ఇంత సరళంగా నిన్ను నాకు పట్టిచ్చిన ఆనవాళ్ళేవో
ఇప్పుడిక లోకాన్నేమీ అనకు..
మనం తారసపడ్డ మురిపాన్నిలా గట్టిగా ముడేసుకున్నాం కదా..💕💜

// నీ కోసం 53//

 
నువ్వూ అన్నది అంతా నాకో స్వప్నమే ఐతే
ఆ రాత్రిని తలుపేసి మరీ ఉండిపోమనాలనుంది
నా హృదయం నుంచి తొంగిచూసే నీ చిరునవ్వులు
లాలసను నాపై వర్షించే తీపి తేనెచుక్కలు..

ఆవరించిన చీకటి తెరలలో నీ తలపులు
ప్రపంచాన్ని వేరు చేసి నీకు ముడేసుకున్న మల్లెపువ్వులు
నాకు పరిమళించడం తెలియదని ఎవరంటారు
ఈ సహజమైన సౌందర్యం నువ్వు వెలిగించిన దీపమవుతుంటే..

అంతుపట్టని లోతుగా ఉందని నిశ్శబ్దాన్ని మూసేయకు
నా ఊపిరిలో స్వరమైన నీ ఉనికిని తాకిచూడు
సగం నిద్రలోని ఊహలాంటి దాన్నని నన్ను విస్మరించకు
నీ విరహాన్ని ముగించేందుకొచ్చిన అపరంజిని పరికించు..💜💕

// నీ కోసం 52//

మనసు లోతుల్లోకి చూడటం మొదలైతే అంతేగా
మనో విపంచి మైమరపు స్వరాలను ముద్దులొలికించినట్టు

చీకటి మెరుపుగా ఎగిసే కెరటాల సవ్వళ్ళలా
ఎదలోని స్వప్నాలు ఎలుగెత్తి పాడుతున్న వలపుగీతికలు

సుగంధాలు మోసుకొస్తున్న లిప్తలన్నీ పూలధనువుగా
పరవశాన్ని ప్రకంపించే సుషుమ్న దారుల్లో ఊహాతీతమైనట్టు

నిశ్శబ్దంగా వెలిగే నీ కనుపాపలకి తెలిసేలా
అక్కడ కదలికల్లో ఇక్కడి చైతన్యం ముడిపడిన ఊహలు

తలపుల ద్వారాల్ని మూసేసి చేసే కనుసైగలింకొద్దు
అల్లనల్లన కలకలాన్ని రేపే పిల్లగాలివై చలించు

తడబడి చూస్తున్న కాలం నీ పేరడుగుతోంది
వెన్నెల నిరీక్షణలో ప్రేమకోటి రాసుకొనే చకోరానివని చెప్పేస్తానిప్పుడు 😉💕

// నీ కోసం 51//


ప్రత్యుషపు దరహాసానికి ఆకృతొస్తే అది నువ్వేనా
అభ్యంగన స్నానం చేసి వసంతాన్ని నే తొడుక్కుంటే అది పండగేనా
పున్నాగ పుష్పానికి సౌరభాన్నద్దింది ప్రేమేనా

ఎగరని తరంగంలా ఉంటూనే మనసెందుకో
రబ్బరు బుడగలా తేలిపోతుంది
ఊహకందని నీ చూపుల స్పర్శకేనా ఇదంతా

లేదా
నిశ్శబ్ద నదీతీరంలో చిరు అలల చప్పుడులా
చీకటి నిండిన గుండెలో వేకువ దీపంలా
కంటిచూరులో ఇన్నాళ్ళూ దాగిన స్వప్నంలా
దూరాన్నంతా దృశ్యంగా మార్చి చూపే మంత్రంలా
గుండెల్లో గుట్టుగా వినిపిస్తున్న నాదమో సరాగమై
పుప్పొడి రుచిని పరిచయించింది నిజమైతే
కుంకుమపూల తోటల సరిహద్దు దాకా మనమొచ్చాక
లోలోన కురుస్తున్న పారవశ్యమది అమృతమేగా 💕💜

// నీ కోసం 50//



వచ్చేస్తున్నా నీతో..
ఏమన్నావో నిజంగా అర్ధం కాలేదు
అయినా సరే..పిలిచావు కదాని
నిశ్శబ్దమైనా సరే.. నీతో కలిసి ఆలకించాలని నేనొస్తున్నా


మల్లెపువ్వుల మౌనకథలు
మనసు నిండేలా చెప్పు మరి
నీ కళ్ళు నవ్వుతూ ఉంటాయనే
ఆ కలలలోకి వచ్చి ఆగానని తెలుసుకున్నావ్ కదా ..

వేదన కాని..నివేదననుకో
తెల్లనికాగితంపై నీ అక్షరాల జలతారు
నాకిష్టమైన వెన్నెల్లో కరుగుతున్న
ఏకాంతరాత్రుల మన పరిష్వంగపు శృంగారు

అణువణువూ మధురమయ్యేలా
నీకోసం నేనో పల్లవి పాడుతా..
ఋతువులు దాటవలసిన పనేముందిప్పుడు
కన్నీటితోనే మనం ప్రేమను పంచుకుందాం పద..💕💜

Tuesday, 15 October 2019

//నీ కోసం 49//

నీతో నేను లేనని మౌనాన్ని కప్పుకోకు
నిద్రించే క్షణాల్లో కౌగిలై కాచుకుంటా
అలుకలతో దిక్కులు చూస్తాననుకోకు
నీ కనుసన్నలలోనే కదులుతుంటా నేనెప్పుడూ

నీ నిశ్శబ్దంలో నేను అక్షరమై ప్రతిధ్వనిస్తా
ఒంటరిగా ఉన్నావని నవ్వుల కోసం  బెంగపడకు
కాలం సంగతి నాకేం తెలీదు
నీకోసం నేనైతే వసంతమై విరబూస్తా కోరినప్పుడు

నిత్యం నీ అలికిడితో మనసు నింపుకున్నాక
మిగిలిపోయే రాగాలేముంటాయని..
అంటే..
నిరీక్షణలో ఒళ్ళంతా కళ్ళైతేనేమి
నువ్వొస్తావన్న నమ్మకం నాకున్నప్పుడు

//నీ కోసం 48//

నీ గురించే చెప్పుకోవాలిప్పుడు
శోకమూ గాయమూ సొదగా మారి
అశాంతి ఆలాపనలో నేనున్నప్పుడు
మలుపు తిప్పే కథలా హఠాత్తుగా నువ్వొచ్చావ్

అన్నీ తెలుసనుకున్న నాకు ఏమీ తెలీదని
జీవితానికో రుచితో పాటు రంగుంటుందని
హరివిల్లుని హృదయంలో చూపించావ్

నాకేముందని మబ్బుకమ్ముకున్న మనసుకి
నీడల్లే నేనుంటానని మాటిచ్చి
నిజంగా శ్వాసలో సంగమించినట్టే కలిసిపోయావ్

నాకు నువ్వంటే
ఆత్మ సంయోగం
నాకు మాత్రమే అనుభవానికొచ్చే ఆరాటం

అనుక్షణమందుకే నీతోనే లయమవుతున్నా
అతిశయమూ..అహంకారమూ అలంకారాలు
కనుకనే
అవి చెరిపి సహజమైన నేనుగా నిన్ను చేరుతున్నా

తడబడకుండా తడుముకున్నప్పుడు
అరచేతికి తగిలిన ఆనవాళ్ళలో
నిన్ను గుర్తించి విరులబంధముగా అల్లేసుకున్నా

నిష్క్రమించినా సంతోషమే ఇప్పుడు
అన్ని గుసగుసలూ నీకిచ్చేసి
ఆదమరపునై నీతో  మమేకమవుతానంటే..!!

//నీ కోసం 47//

నాకు తెలియని నేను
ఇన్నాళ్ళూ ప్రేమంటే నీలో ఉంటుందనుకున్నా
ఎన్నెన్నో మనోహర భావాలు నీకోసమనుకున్నా
నాలో పుట్టిన పులకింత నువ్విచ్చావనుకున్నా
ఆ చేతుల ప్రేమ స్పర్శ దూరం నుంచే తడిమిందనుకున్నా

మనసు మాట విననప్పుడు
నీ పాటలలో నన్ను వెతుక్కున్నా
ఊపిరి తీసుకోడమంటే నువ్వు ఉచ్ఛ్వాసగా మారావనుకున్నా 
ఎదలో ప్రవహిస్తున్న రుధిరమంతా
నీకోసం ఉరకలేస్తున్న హడావుడనుకున్నా 

ఇప్పుడో తీరం లేని చీకటిలో నిలబడ్డాకే
నిర్జీవమైన కలలనిక సాగనీయక
వెలుతురు కోసమని దూరాన్ని కొలుస్తున్నా
కొత్తగా పరిచయమైన నన్ను స్వహస్తాలతో
స్వీకరించేందుకని ఎదురెళ్తున్నా..

ఇన్ని భావాల రాసులు నాలో కనుగొన్నాక
నేనే ఓ రాగమై మెలికలు తిరుగుతున్నా
నాకు ప్రేరణిచ్చిన తమకం
లోలోని గమకమేనని గుర్తించిన క్షణాలలో
కాలమిప్పుడు కారుమేఘపు తేరులా కదలడం చూస్తున్నా