Wednesday, 21 July 2021
// నీ కోసం 382 //
ఎదురుచూసిన కన్నులు ఏరువాకైన రాత్రి
చూపులకందని చందమామ నువ్వయితే
కలలకు చోటిచ్చినా కమ్ముకున్న విరహానికి
నిద్దుర బరువైన కొలనులోని కలువను నేను
రంగురంగు నెమలీకలు పురివిప్పే వేళ
పచ్చనిచేలు పరువాల్ని విరబూస్తున్నా
విరజాజుల రాగం సుధలూరి కవ్విస్తున్నా
గుండెల్లో నులివేడి నిట్టూర్పు సెగలు
నిశ్శబ్దంలోని అస్పష్ట విస్పోటనలు
కురవకుండా కదిలిపోతున్న మేఘం
సందేశాన్నివడం మర్చిపోయిందో
మోహవీచికల వీవన చాలని
పునరావృత మైకాన్ని ఆవహించేలా చేస్తుందో
మత్తుగా ఊగుతున్న మనసునడగాలేమో
ఏమో..
వేల అర్ధాలు ధ్వనించేదేముంది గానీ,
పైకి వినిపించని నీ మదిలో మాటలన్నీ
చిరుస్పర్శలై నన్నంటిన ఊహల్లో
ఈ ఏకాంతమంతా..
వెచ్చని నీ ఊపిరిగా తడిమిందీలోపునే
// నీ కోసం 381 //
బాగా పరిచయమైన సువాసనలా నీ నవ్వులకో మత్తుంటుంది. మనసంతా పూలు పూసి తేనెలొలికి నరనరాల్లో అమృతమేదో ప్రవహిస్తున్న వింత.. కలకాలం తపించిన స్పర్శేదో అనుభవానికొస్తుంది. అప్పటికప్పుడు పరిమళాల్లో పునీతమైనట్టు దేహం, నీ ఉనికినో చిలిపి కవితగా చుట్టుకుంటుంది. గుండె ఊయల మీద పసిపాప కేరింతల రాగంలా నీ గుసగుస నిద్దురనేమార్చుతుంది.
అవ్యక్త భావగీతికల్లా నీ నవ్వులు కెరటాలై రంగురంగుల నా హృదయకాగితాన్ని తీరపు పడవలుగా తేల్చుతాయి. మౌనంగా నువ్వు పాడే పాటలన్నీ అంతర్వాహినిగా నా పెదవిని తాకే పల్లవులవుతాయి. మరో లోకానికి పోదాం రమ్మనే మోహంలా తాజాగా తాకుతుంటాయి. అది మొదలు అంతులేని స్వాతిశయాలు అక్షరాలను అదుముకొనేలా ఆనందాలు చిమ్ముతాయి. కళ్ళు మూసుకుని సోలిపోయే సుషుప్తిలో ఆహ్వానించకనే దిగివచ్చే ఆకాశమేమో నువ్వనిపిస్తాయి.
మధురస్మృతిలోని మైమరపు క్షణాల్లా నీ నవ్వులు పులకింతల చెక్కిలిగింతలవుతాయి. ఊహలకు ప్రాణం పోసేలా కొన్ని బంగారు కాంతులు కన్నుల్లో కొలువుకొస్తాయి. చీకటివెలుగుల కలనేతలో చల్లగాలి చేర్చే ఊసులన్నీ నీవేననిపిస్తాయి. సర్వేంద్రియాల మైకం నీ బుగ్గలు చుంబించమని ప్రేరేపిస్తాయి. ఆవిరి పట్టిన అద్దంలోంచీ చూసినట్టనిపిస్తూ.. నిముషానికోసారి మూగబోయేలా నన్నెందుకిలా శిక్షిస్తావో తెలీదు.. అయినా సరే, నీ నవ్వులంటే నాకిష్టం.
Becoz.. ur smile is intrinsic n u r a garden, that I can visit anytime
// నీ కోసం 380 //
గ్రీష్మంతో సమంగా జ్వలిస్తున్న నీ దేహాన్ని
నా అంతరాత్మలో తలదాచుకొమ్మని ఆహ్వానించేందుకు
ఏ రూపంగా మారి సంకల్పించాలో
వెచ్చని నిశ్వాసల నిట్టూర్పు బరువుకి
నీ గొంతుకు అడ్డుపడ్డ గాయమే
నా స్వరప్రవాహాన్ని మధ్యలో ఆపింది
ప్రతి స్మృతిలో నిరీక్షించే నీ విరహాన్ని
చందమామకి నూలుపోగులా ఆవవరించి
ఎన్ని యుగాలని నేననుసరించాలో
కలలోంచీ చూస్తున్నట్లున్న నీ కళ్ళు
మది గదిలో వెలుగులు నింపింది నిజమైనా
నా పెదవుల్లో నవ్వులు పూయించలేదు
Subscribe to:
Posts (Atom)