Sunday, 3 November 2019

// అమృతవాహిని 9 //



ఓయ్ బంగారూ..
అప్పుడే బజ్జున్నావా..!
అలకపూనిన చిన్నారి పావురపు చెంపలు కనిపిస్తున్నాయి నాకైతే..
సజల హృదయ సంగీతమెప్పుడైనా విన్నావా..
ఏమో..నాకిప్పుడే వినిపిస్తుంది అదేమిటో, నిన్ను గాయపరిచి అశ్రువుగా మార్చానాననే అనుమానం.

నువ్వెంత అంతర్ముఖంతోనున్నా..
నావైపైతే లాలిత్యపు కళ్ళతోనే చూస్తావే..
వందల పూలతోటల పరిమళాలు నాకోసమే మోస్తున్నట్లు చిరునవ్వుల పుప్పొడినంతా నాపైనే చల్లుతావే
తెలుసు, నీవైపు ఎంతమంది చూస్తున్నా
నీలోకి నువ్వు చూస్తుకుంటూ నా ఉనికి కోసం ఆరాటపడుతుంటావని.
నీ నీడ కూడా నేనే అయినట్టు, వెనుక నుంచీ కౌగిలించే నా చేతుల కోసమే తడుముకుంటావని. ఆహా, అంత గర్వమా అంటే.. ఏం చెప్పను..అవునని కాక..
జీవిత కాలపు స్పర్శలా నాతో అంటుకట్టుకున్నాక, ఓదార్పు పరిష్వంగం నీదే కావాలని మనసు కొసకొమ్మ ముడేసుకున్నాక. 

ఎవ్వరికీ తెలియని ఏకాంతపు రాత్రి కలలో చిలిపి స్వరాల ముగ్ధత్వం మనిద్దరికే సొంతమని నీకైనా తెలియాలిగా..ఇంతకాలం స్పందించకుండా ఆగిన హృదయమిప్పుడు రవళిస్తుందని చెప్పాలంటే అలలా ఊగుతున్న మౌనాన్ని వినిపించాలిగా. దూరాన్ని దృశ్యంగా మలిచే ఊహలతో నేస్తం కడుతూ నేనున్నానందుకే, నీకు దగ్గరగా నన్ను చేరుస్తాయని. నీ కనుపాపల రవ్వంత సవ్వడి నాకో మంజులనాదమై వినబడుతుంటే, పెదవిప్పని మందహాసాన్నీ నేర్చేసుకున్నా తెలుసా..
బిందువుగా చేరి సింధువులా విస్తరించిన నిన్ను దాచడం కూడా తెలీని అనుభూతిలో నేనున్నా. నా ఎద వెదురుపొదల వేణుగానమొక్కసారి విను, నీ రాతిరి తీపిని వీలైతే  నాలాగే విరచించు. 🤗😊



// నీ కోసం 63//


అడ్డుకోలేని ఆలోచనల అరల్లో
అద్భుతమైన జ్ఞాపకాల మరకలు
వర్తమానాన్ని అతీతంగా ఉసిగొల్పి
నా చీకటి గుండెల్లో మౌనాన్ని నిట్టూర్చేసి
వసంతవర్ణం పాడదాం రమ్మంటున్నట్టు 

ఆనందానికో అస్తిత్వముందంటే 
అది నీ ధ్యాసలోనేనని
నే మనసుపడ్డ నీ కన్నుల్లో
అరమోడ్పుల నెలవంకలు
సుప్రభాత సున్నితత్వాన్ని ఆస్వాదిస్తున్నట్టు

నువ్వు నమ్మకున్నా రోజూ ఇంతే..☺

చెప్పు..ఎప్పుడొస్తావ్..
నీ కనుకొలుకుల సంగీతం వినాలి
నన్ను నేను విస్మరించేలా గుసగుసలు కావాలి
యుగళగీతమంటి పదాల గోదారిలో ఈదులాడాలి
అలవోకగా అనంతానంత లోకాలు చుట్టిరావాలి..💜💕


Saturday, 2 November 2019

// నీ కోసం 62 //

నిశ్శబ్దపు మత్తువీడిన చీకటి
నీ కలవరింతలతోనే వేకువై ఉదయించింది

తనువును తాకి గిలిగింతలు పెట్టేందుకొచ్చిన గాలి
నా నిట్టూర్పుల వెచ్చదనానికేమో విసుక్కుంది

నీ హృదయం నవ్విన సవ్వడి
ఆదమరపులోనూ నాకు వినిపిస్తూ
కాలాన్ని అధిగమించే మలుపులో
నన్ను నిలబెట్టి నీతో శృతి కలపమంది

నాకు పరిమళాన్ని పంచిన విరజాజులే
రేయంతా నీకు తోడున్నాయని తెలిసి
గొంతులో మొదలైన కంపిత గమకం
గుమ్మడిపువ్వులా విచ్చిన పెదవయ్యింది

నువ్వూ కనురెప్పల తలుపులు తీయొచ్చిక
చిన్ని పలకరింపుతోనే నీ ఉనికి చేర్చేసాక...💕💜   

// నీ కోసం 61 //


అరచేతిలో చుక్కల్ని పోగేస్తున్న రాత్రి
ఉండుండీ
ఆకాశం దూరంగా జరిగిపోతున్న భావన

ఒక్కసారిగా ఒంటరైనట్టు
మదిలో
రహస్యంగా పోగుపడుతున్న వేదన

పంచమానికి పరవశించాల్సిన కాలం
నిషాదాన్ని
హెచ్చుస్థాయిలో మొదలెట్టిన సాధన

కలలన్నీ అలిగి
మౌనానికి నన్నొదిలి
అనంతానికి తరలిపోతున్న వేళ..

రెప్పపాటులో
రూపం మార్చుకున్న జీవితం
అశాంతిగా కదులుతున్న క్షణం

ఎంతకీ తరగని
మనమధ్య దూరం
తనకు తానుగా మారిందొక మైదానం

అదను చూసి కరుగుతున్న మేఘం
ఇప్పుడంతా కురుస్తుంది కన్నుల్లోనే
అనునయించేందుకు రావూ..
కొత్తగా నీతో కలిసి చిగురులేయాలనుంది ☘️💞